అధికారమంతా ఆ తండ్రీ కొడుకులది.. అపవాదు మాత్రం ఉప ముఖ్యమంత్రులది

23–07–2018, సోమవారం 
గణపతినగర్, తూర్పుగోదావరి జిల్లా

సర్వమత ప్రార్థనల అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలోని ఉండూరు, సామర్లకోటలలో నేటి పాదయాత్ర సాగింది. స్వాతంత్య్రానికి పూర్వమే.. పెద్దాపురం విద్యాపురంగా భాసిల్లింది. ఎంతో ప్రాశస్త్యం ఉండి, ఎన్నో సహజ వనరులు కలిగి, సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం సమస్యల సుడిగుండంలో తల్లడిల్లుతూ.. చిత్తశుద్ధిలేని పాలనకు నిదర్శనంగా నిలిచింది.  

భారతీయ గ్రామీణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సహకార వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనుడు చంద్రబాబే అన్నారు.. నేడు కలిసిన నేతన్నలు, రైతన్నలు. సహకార వ్యవస్థకు వైఎస్సార్‌ ఊపిరి పోస్తే, చంద్రబాబు.. ఉసురు తీశాడన్నారు. ఉదయం ఉండూరు వద్ద చేనేత కార్మికులు కలిశారు. పది నెలలుగా చేనేత సంఘాలకు ఆప్కో వారు బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. సొసైటీ వస్త్రాలను కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ దుస్థితి బాబుగారి పాలనకే ప్రత్యేకమన్నారు. బాబుగారి గత పాలనలో కుదేలైన చేనేత సంఘాలకు చేయూతనిచ్చి నాన్నగారు జీవం పోస్తే.. నేడు బాబుగారు వాటిని మళ్లీ నిర్వీర్యం చేసి.. మూసివేత దశకు తెచ్చాడన్నారు. ఆప్కోకు రాజకీయ మకిలిని అంటించి అవినీతిమయం చేసిన ఘనత బాబుగారిదేనన్నారు.


అత్యధిక నేతన్నల ఆత్మహత్యల రికార్డు బాబుగారి పాలన పేరిటే ఉందని చెప్పారు. ఉండూరు దాటాక కలిసిన నవర గ్రామ రైతన్నలదీ అదే ఆవేదన. ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో దీర్ఘకాలిక రుణం తీసుకున్న రైతన్నలకు ఆరుశాతం వడ్డీ రాయితీనిచ్చి నాన్నగారు ఆదుకుంటే.. బాబుగారు 2015 నుంచి ఆ రాయితీని ఆపేశారు. రైతుల నుంచి వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కట్టలేని రైతన్నల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. రైతులు రుణాలు కట్టలేకపోవడంతో సహకార సంఘాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సహకార సొసైటీలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి నాన్నగారు రైతన్నలకు అండగా నిలిస్తే.. బాబుగారు మాత్రం దీర్ఘ, స్వల్పకాలిక రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ వాటాను ఆపేసి, సహకార సంఘాల ఉనికినే ప్రశ్నార్థకం చేసి రైతన్నల నడ్డి విరుస్తున్నాడు’ అని అన్నారు.  

ఇక్కడి ప్రభుత్వాస్పత్రి దుస్థితిని కళ్లకు కట్టారు.. సామర్లకోట యువకులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రిగారు ఈ ఆస్పత్రిని 30 పడకల స్థాయికి పెంచుతానని, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారట. నాలుగేళ్లయినా ఆ ఆస్పత్రి కేవలం ఆరే పడకలతో, ఇద్దరే వైద్యులతో, తీవ్ర సిబ్బంది కొరతతో.. మధాŠయ్‌హ్నం రెండు గంటలు దాటితే వైద్య సేవలందని దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. అంబులెన్స్‌ కూడా లేదట. ఎమర్జెన్సీ కేసులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనట. ఇదీ.. ఉప ముఖ్యమంత్రిగారి సొంత నియోజకవర్గంలో సర్కారు దవాఖానా పరిస్థితి. ఆ పదవిలో ఉండి ఏం ఉపయోగం? అయినా ఆయన్ను అని ఏం ప్రయోజనం! బీసీలకు, కాపులకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పి, ఎన్నికల్లో లబ్ధిపొంది.. వారిని డమ్మీలుగా మార్చి.. వారి శాఖల అధికారాలు సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని.. అడ్డంగా దోచుకుంటున్న ప్రభుత్వ ముఖ్యులైన తండ్రీకొడుకులదే ఈ పాపమంతా. అధికారమంతా ఆ తండ్రీ కొడుకులది.. అపవాదు మాత్రం బీసీ, కాపు వర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులది. ఇదీ.. బాబుగారి మార్కు సామాజిక న్యాయం.
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీ పుణ్యాన పద్దెనిమిది డీసీసీబీలు దివాలా తీసే స్థితిలో ఉంటే.. వైద్యనాథన్‌ సిఫార్సులు అమలు చేసి.. దాదాపు రూ.1,500 కోట్లు చెల్లించి.. నాన్నగారు సహకార రంగానికి జీవం పోసింది వాస్తవం కాదా? కాగా, మీరు మాత్రం బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తాను.. రుణాలు కట్టొద్దు.. తాకట్టు పెట్టిన పుస్తెల తాడును, దస్తావేజులను ఇంటికే తెచ్చిస్తాను.. అని ఊరూ వాడా చెప్పి.. మాట తప్పి.. దేశంలోనే రైతులకు ఇంతవరకూ జరగని అతి పెద్ద మోసం చేయడం నిజం కాదా? మీరు చేసిన ద్రోహం వల్ల రైతుల బకాయిలు పెరిగిపోయి సహకార బ్యాంకులన్నీ దివాలా దిశగా నెట్టివేయబడుతుండటం వాస్తవం కాదా? మీ పాలనలోనే సహకార రంగం నిర్జీవమై పోతోందంటున్న నేతన్న, రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు?
‍వైయ‌స్‌ జగన్‌    


Back to Top