ఫైబర్‌గ్రిడ్‌ను ప్రజలకు బలవంతంగా అంటగట్టడంలో మతలబు ఏంటి బాబూ?

22–07–2018, ఆదివారం 
ఉండూరు, తూర్పుగోదావరి జిల్లా 

ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో అచ్చంపేట, గొంచాల, ఉండూరు మీదుగా పాదయాత్ర సాగింది. అధికార పార్టీ నేతల అరాచకాలపై కన్నెర్రజేశారు.. పెద్దాపురం నుంచి వచ్చిన యువకులు. పెద్దాపురంలో 111 ఏళ్ల కిందట నిర్మించిన చారిత్రక భవనంలో ఆర్డీవో ఆఫీస్‌ ఉందని.. ఆ భవనాన్ని చూడగానే అల్లూరి సీతారామరాజు స్మృతులు గుర్తుకొస్తాయని వారు చెప్పారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న భవనాన్ని కూలగొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుని.. స్థానిక ప్రజలు ఆందోళనలు చేశారట. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రిగారు దానిని పరిరక్షిస్తామని హామీ కూడా ఇచ్చారట.

ఆయన మాటకే దిక్కులేకుండా పోయిందని ఆ యువకులు వాపోయారు. భవనం పరిరక్షణ కోసం కోర్టుకు వెళుతున్నామని తెలిసి రాత్రికిరాత్రే పడగొట్టే ప్రయత్నం చేసి.. పాక్షికంగా ధ్వంసం చేశారట. దీని వెనుక.. మరో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హోం మంత్రిగారు ఉన్నారట. సాక్షాత్తు హోం మంత్రి ఇలాకాలోనే రాత్రికి రాత్రే అధికారులు దొంగల్లా వచ్చి భవనాలను పడగొడుతున్నారంటే.. అసలేం పరిపాలన ఇది అనిపించింది. భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన చారిత్రక సంపదను సైతం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా.. స్వార్థ రాజకీయాలకు బలిపెడుతున్న దిగజారుడు రాజకీయాలను చూసి బాధేసింది.  


ఈ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ వెనక ఉన్న దురాలోచనల్ని, అవినీతిని ఎండగట్టారు.. నన్ను కలిసిన కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు. భారత ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించి విద్యార్థులకు, గ్రామీణులకు ఉచిత ఇంటర్‌నెట్, ఈ–గవర్నెన్స్‌ సదుపాయాలను కల్పించాలని ప్రవేశపెట్టిన డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టును.. ఫైబర్‌గ్రిడ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని వాపోయారు. కేబుల్‌ వ్యవస్థను, మీడియాను తమ గుప్పెట్లో ఉంచుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురాలోచన చేస్తోందంటూ.. పథకం వెనకున్న లోగుట్టును వివరించారు. ‘ప్రజల మీద ఫైబర్‌గ్రిడ్‌ను బలవంతంగా రుద్దాలనుకుంటోందీ ప్రభుత్వం.

పోల్‌ ట్యాక్స్‌లు విధిస్తూ, కేబుల్‌ ఆపరేటర్లను రకరకాలుగా వేధిస్తూ, బెదిరిస్తూ.. నయానో భయానో ఫైబర్‌గ్రిడ్‌ను అంటగట్టాలని చూస్తోంది. ఎన్నికల్లో లబ్ధిపొందడం, చినబాబుగారి బినామీలకు ప్రయోజనం కల్పించడమే దీని వెనకున్న లక్ష్యం. అసలీ ఫైబర్‌గ్రిడ్‌ టీవీని ఆన్‌ చేయగానే.. చంద్రబాబుగారు, లోకేశ్, ఆయన కుమారుడు దేవాన్‌‡్ష, ఇతర కుటుంబ సభ్యుల వీడియోలను చూడక తప్పని పరిస్థితి కల్పించారు. ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన పథకాన్ని వాణిజ్య పథకంగా మార్చివేయడం దౌర్భాగ్యం’అన్నారు కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు. ప్రజల మనసుల్ని గెలవలేని ఈ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం ఎన్ని అడ్డదారులనైనా తొక్కడానికి సిద్ధమవుతోంది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ప్రజలకు రూ.149కే ట్రిపుల్‌ ప్లే సర్వీసును అందిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. మరి వినియోగదారుడికి రూ.234.80 బిల్లు ఎందుకు వేస్తున్నారు? జీఎస్టీ తాలూకు వివరాలను ఎందుకు పొందుపర్చడం లేదు? ప్రజలకు ఇష్టం లేకున్నా ఫైబర్‌గ్రిడ్‌ను వారికి బలవం తంగా అంటగట్టడం వెనకున్న మతలబు ఏంటి?
-వైయ‌స్‌ జగన్‌    


 

Back to Top