ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పలుచన చేయడం దారుణం

21–07–2018, శనివారం   
అచ్చంపేట జంక్షన్, తూర్పుగోదావరి జిల్లా 

పార్లమెంట్‌లో నిన్న జరిగిన పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అయిన ‘హోదా’ను ఓ ప్రహసనంగా మార్చివేయడం, కోట్లాది మందికి ఆశ, శ్వాస అయిన హోదాను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకోవడం.. క్షమించరాని నేరం. నాలుగేళ్లుగా హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజల నరనరాల్లో వ్యాపింపజేసి.. అవిశ్వాస తీర్మానం ద్వారా, రాజీనామాల ద్వారా, ఆమరణ దీక్షల ద్వారా.. హోదా ఉధృతిని, ఆంధ్ర ప్రజల ఆకాంక్ష తీవ్రతను దేశం మొత్తానికి తెలియజెప్పి, కేంద్రంపై ఒత్తిడి పెంచి.. హోదా ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం చేస్తే.. బాబుగారు దానికి సహకరించకపోగా.. నాలుగేళ్లుగా హోదాను భూస్థాపితం చేయాలని ప్రయత్నించి, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారు.

చివరకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాగ్రహానికి భయపడి విధిలేని పరిస్థితుల్లో యూటర్న్‌ తీసుకుని.. లోపాయికారి ఒప్పందాలు, లాలూచీ రాజకీయాలతో మొక్కుబడిగా అవిశ్వాస తీర్మాన తతంగాన్ని నడిపించి.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పలుచన చేయడం అత్యంత దారుణం. ఒక్క పార్టీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం చాలా బాధనిపించింది. గుండెల్లో రగులుతున్న ఈ భావాలను, కోట్లాది మంది ప్రజల ఆవేదనను.. మీడియా మిత్రులతో పంచుకుని పాదయాత్ర ప్రారంభించాను.     


పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ యువత జేఎన్‌టీయూ సమీపంలో కలిసింది. ఎన్నికలప్పుడు బాబుగారిచ్చిన హామీలను నమ్మి మోసపోయామని చెప్పారు. పోటీ పరీక్షలు నిర్వహించకపోతారా.. ఉద్యోగాలు రాకపోతాయా.. అన్న ఆశతో నాలుగేళ్లుగా కోచింగ్‌ సెంటర్లలో వేలకు వేలు ఖర్చుచేసి ప్రిపేర్‌ అవుతున్నా.. నిరాశే మిగిలిందని వాపోయారు. ఏపీపీఎస్సీ ఉన్నా.. లేనట్లుగా తయారైందన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రత్యేక హోదా సైతం నీరుగారిపోతుంటే.. భవిష్యత్తును తలుచుకుంటుంటే భయంగా ఉందన్నారు.  

ప్రభుత్వ విద్యావ్యవస్థ నానాటికీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆంధ్రప్రదేశ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులపై, విద్యార్థులపై విద్యేతర కార్యక్రమాల ఒత్తిడి ఎక్కువైందన్నారు. ర్యాలీలు, ‘రన్‌’లు, సర్వేలు, సభలు, దీక్షలు.. అంటూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు బలవంతంగా తరలించే చెడు సంప్రదాయానికి తెరతీసిందన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం.. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పూర్తిగా గాలికొదిలేయడం.. తదితర చర్యలన్నీ కార్పొరేట్‌ స్కూళ్లకు లబ్ధిచేకూర్చే కుట్రలో భాగమేనన్నారు.  

‘అన్నా.. బాలికా సురక్ష పథకం కింద నా పేరు నమోదైంది. ఇప్పుడు నా వయసు 20 దాటింది. అయినా ఆ డబ్బు రాలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. దుర్గాభవాని అనే చెల్లెమ్మ. ఆ పథకపు ధ్రువపత్రాన్ని సైతం తెచ్చి చూపించింది. ప్రభుత్వాలు మారవచ్చు.. పథకాలూ మారవచ్చు.. కానీ బంగారు తల్లులను మోసం చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.  


మత్స్యకార ప్రముఖుడు మల్లాడి సత్యలింగంనాయకర్‌ దాతృత్వాన్ని గుర్తుచేసుకుంటూ మత్స్యకార సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాను. వేటకెళితేగానీ పూటగడవని పరిస్థితి ఆ సోదరులది. సముద్రాన్ని నమ్ముకుని.. భద్రత లేని బతుకులు బతుకుతూ వేటకెళ్లి వస్తే.. దళారుల చేతుల్లో బలైపోతున్న కష్టం వారిది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే సమస్యగా మారిన దుస్థితి. వారి కష్టాలు విని గుండె బరువెక్కింది. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కేంద్రంపై సమరం.. మోదీపై యుద్ధమంటూ రంకెలేశారు.. హోదాకు అనుకూలంగా దేశంలోని అత్యధిక పార్టీల మద్దతు కూడగట్టామంటూ పచ్చమీడియాలో ఊదరగొట్టారు.. ఏమైంది మీ పోరాటం? మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏ ఒక్క పార్టీ అయినా ప్రశ్నించిందా? హోదా గురించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడిందా? ఇది మీ దారుణ వైఫల్యం కాదా? మా ఎంపీలు రాజీనామాలు చేసిన రోజే.. మీ వాళ్లు కూడా రాజీనామాలు చేసి, నిరాహార దీక్షకు కూర్చుని ఉంటే.. దేశం మొత్తం చర్చనీయాంశమై కేంద్రం దిగొచ్చేది కాదా?   
-వైయ‌స్ జ‌గ‌న్   


Back to Top