బాబుగారు అధికారంలో ఉన్నప్పుడల్లా రైతన్నల పరిస్థితి ఇలాగే ఉంటోంది..

12–07–2018, గురువారం
ఊలపల్లి శివారు, తూర్పుగోదావరి జిల్లా

ఈ రోజు ఉదయం పాదయాత్ర ప్రారంభించే సమయానికి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రాత్రంతా కురిసిన వర్షంతో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. అయినా దారుల వెంబడి బారులుతీరి నా కోసం ఎదురుచూస్తూ అదే ఆత్మీయ జనసందోహం. ఊలపల్లిలంక దాటి నడుస్తుంటే.. రైతు కూలీలు చాలా మంది ఎదురుచూస్తూ కనిపించారు. కేవలం నన్ను చూడటానికి.. కలవడానికి.. మాట్లాడటానికే.. ఒక్క రోజు కూలి డబ్బులు పోయినా ఫర్వాలేదని వచ్చారట. కురుస్తున్న వర్షం సైతం వారి అభిమానాన్ని అడ్డుకోలేకపోవడం నన్ను కట్టిపడేసింది.  

రెండు కర్రల సాయంతో నడవలేక నడవలేక నడుస్తూ.. నా దగ్గరకొచ్చాడు పుట్టుకతోనే దివ్యాంగుడైన తిరుమలశెట్టి రాజు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడికి నాన్నగారన్నా.. నేనన్నా.. అమితమైన అభిమానమట. ఆ పిల్లాడి తండ్రి చిన్నప్పుడే వదిలేసిపోతే.. బట్టల షాపులో పనిచేస్తూ.. వస్తున్న చాలీచాలని ఆదాయంతోనే తన బిడ్డను పోషించుకుంటోంది తల్లి. ‘అన్నా.. నేను బాగా చదువుకుంటాను.. పెద్దయ్యాక నాకో ఉద్యోగం ఇప్పించండి. మా అమ్మను బాగా చూసుకోవాలని ఉంది’ అంటున్న ఆ చిట్టి తమ్ముడి ఆత్మవిశ్వాసానికి ముచ్చటేసింది.  

గతేడాది రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేస్తే.. దిగుబడి బాగా వచ్చినా రూ.40 వేల నష్టం వచ్చిందంటూ సత్యనారాయణ అనే కౌలు రైతన్న తన కష్టం చెప్పుకున్నాడు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో అధిక వడ్డీకి బయట అప్పులు చేయాల్సిరావడం, దళారీ వ్యవస్థే దీనికి కారణమన్నాడు. ప్రభుత్వమేమో కౌలు రైతులకు పెద్ద ఎత్తున రుణాలిప్పించామని గొప్పగా చెప్పుకుంటోంది.. కానీ మాలో ఏ ఒక్కరికీ బ్యాంకు రుణం అందలేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మీరొచ్చాకైనా కౌలు రైతులపై దృష్టిపెట్టాలని విన్నవించాడు. రాష్ట్ర ధాన్యాగారమైన గోదావరి డెల్టా ప్రాంతంలోనే కౌలు రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా ప్రాంతాల్లో ఇంకెంత దయనీయంగా ఉంటుందో! ‘వ్యవసాయం దండగ’ అని భావించే బాబుగారు అధికారంలో ఉన్నప్పుడల్లా రైతన్నల పరిస్థితి ఇలాగే ఉంటోంది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ వ్యవసాయ నివేదికలను అనుసరించి కనీస మద్దతు ధరను ప్రకటిస్తాం.. అని మేనిఫెస్టోలో పొందుపరిచి ఊరూవాడా ప్రచారం చేశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన సమయంలో 29 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చానని చెప్పుకున్న మీరు.. ఏ ఒక్క సారైనా రైతులకు లాభసాటి ధరలు కల్పించాలని కేంద్రానికి కనీసం లేఖయినా రాశారా? కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి.. రుణ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది?
‍ ‍
- వైయ‌స్ జ‌గ‌న్‌


Back to Top