మానవత్వం కరువైన ఈ పాలనలో పేదల దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది


08–07–2018,ఆదివారం 
మాచవరం, తూర్పుగోదావరి జిల్లా 

నా ప్రతి మాటలో.. ప్రతి చేతలో.. ప్రతి ఆలోచనలో.. నిత్య స్ఫూర్తి నాన్నగారే. ప్రజలతో మమేకమై సాగిన ఆయన జీవన ప్రస్థానంలోని ప్రతి అడుగూ నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది. ‘మీ విలువల బాటలో.. విశ్వసనీయత సాక్షిగా నడుస్తా..’అని మనసులో నాన్నగారిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజున నివాళులర్పించాను. 

ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే.. నన్ను కలిసిన సోదరి ఉషామాధవి తన దయనీయ గాథను చెప్పుకుంది. అగ్రవర్ణానికి చెందిన గుణసాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ తల్లి.. ఎంఏ, బీఈడీ చేసినా ఇంకా ఉద్యోగం రాని దుస్థితి. ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లోనూ ఆమెకు న్యాయం జరగలేదు. భర్త ఆటో నడుపుతాడు. ఇదంతా ఇలా ఉంటే.. ఆ తల్లి 13 ఏళ్ల కొడుక్కి పుట్టుకతోనే జన్యుపరమైన ఎముకల వ్యాధి. ఎదిగే కొద్దీ ఎముకలు పెళుసై, వంకరపోయి నడవలేని స్థితిలోని బిడ్డకు.. వీల్‌ చైరే వీడని ఆసరా. బిడ్డను చేతులమీద ఎత్తుకుని అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి. ఇల్లు గడవడానికే సరిపోని ఆదాయంతో బిడ్డ వైద్యానికి నెలకు రూ.ఐదారు వేలు ఖర్చవుతుంటే.. బతుకు భారమై, గుండె బరువై ఆ తల్లిని కుంగదీస్తున్నా యి. ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడం ఆ తల్లి కష్టాలను రెట్టింపు చేశాయి. భర్తకూ గుండె జబ్బు. ఇన్ని మానసిక ఒత్తిళ్లతో ఆమె కూడా షుగర్‌ వ్యాధి బారిన పడింది. ఎలాగోలా బతుకు పోరాటం చేద్దామనుకుంటే.. కాసింతైనా కనికరం చూపించే ప్రభుత్వ సాయమేదీ అందకపోవడం.. బతుకును మరింత దుర్భరం చేస్తోందని ఆ తల్లి కన్నీటి మయమైంది. జీవితం మీదే విరక్తి పుట్టింద న్నా.. అన్న ఆమె మాటలు గుండెను తాకాయి. 


2004కు పూర్వం పేదల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆరోగ్యశ్రీ లాంటి పథకమూ లేదు.. ముఖ్యమంత్రి సహాయనిధి ఉండీ లేని పరిస్థితి. పేదలకు పెద్దజబ్బు చేస్తే.. తూర్పునకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. చదువు‘కొనాల్సిన’పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల ఊసే లేదు. పేదవాడిని అప్పుల పాల్జేసే.. ఆరోగ్యం, విద్య రెంటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాలన అది. ఇప్పుడూ అదే పాలన.. అవే పరిస్థితులు. మానవత్వం కరువైన ఈ పాలనలో పేదల దుస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోంది. నాన్నగారి ప్రజా పథకాలన్నింటినీ పునరుద్ధరించి, పునరుత్తేజం కల్పించాలన్న నా సంకల్పం మరింత బలపడుతుండగా.. అడుగులు ముందుకేశాను. 

పసలపూడి గ్రామ శివార్లలో పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘ ప్రతినిధులు కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ‘సార్‌.. ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీపీఎస్‌ను రద్దు చేయాలని పట్టుపడుతోంది. అది రాష్ట్ర పరిధిలోనిదేనని.. ఎందుకు చేయరంటూ నిలదీస్తోంది. మన రాష్ట్రానికొచ్చేసరికి.. అధికారం చేతిలో ఉన్నా.. సీపీఎస్‌ ఊసే ఎత్తదు. టీడీపీ రెండు నాల్కల ధోరణికిది నిదర్శనం’అంటూ పచ్చ పార్టీ వంచనను పట్టిచూపారు. ‘సార్‌.. ఏప్రిల్‌లో అందాల్సిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ ఇవ్వకపోతే.. పిల్లలకు పాఠాలెలా చెప్పాలి? యూనిఫాంలదీ అదే పరిస్థితి. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం పాఠ్యపుస్తకాలకు కొరతే ఉండదు.. అందుకే పిల్లలంతా ప్రైవేటు బాట పడుతున్నారు’అంటూ వాస్తవ పరిస్థితుల్ని వివరించారు. విద్యను పూర్తిగా వ్యాపారమయం చేసి.. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని అటకెక్కించిన ఈ పాలనలో పేదవానికి ఉన్నత విద్య అందని ద్రాక్షే. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకా లు, యూనిఫాంలు అందివ్వకపోవడం.. మౌలిక వసతులు మెరుగుపర్చకపోవడం.. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం.. వంటి మీ చర్యల వల్లనే విద్యార్థుల సంఖ్య తగ్గడం వాస్తవం కాదా? విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న సాకుతో సిబ్బందిని తగ్గించడం.. స్కూళ్లను మూసేయడం కుట్ర కాదా? ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం.. కార్పొరేట్‌ స్కూళ్లకు, మీ బినామీ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చడానికేనంటున్న ఉపాధ్యాయ సంఘాలకు ఏం సమాధానం చెబుతారు?  
-వైయ‌స్‌ జగన్‌   
Back to Top