నాన్నగారి ఆరోగ్యశ్రీ పథకం వరం

 

05–07– 2018, గురువారం
జగన్నాయకులపాలెం, తూర్పుగోదావరి జిల్లా

నాన్నగారి సంక్షేమ పథకాలందుకున్నవారు, అభివృద్ధి ఫలాలను పొందినవారు.. తమ జీవితాల్లో వెలుగులు ఎలా నిండాయో చెబుతుంటే.. పదికాలాలపాటు నిలిచిపోయే మంచి పనులు చేసి చిరస్థాయిగా నిలిచిపోయిన నాన్నగారి ఆశయాలు.. ఆదర్శాలు నాలో గొప్ప స్ఫూర్తిని నింపుతున్నాయి.  ‘వైఎస్సార్‌ మాకు దేవుడు. గుండెకు సమస్య వస్తే.. చికిత్సకయ్యే లక్షలు భరించలేక ప్రాణాలమీద ఆశలు వదులుకున్నాను. మా కుటుంబ సభ్యులకూ దిక్కుతోచని పరిస్థితి. సరిగ్గా ఆ సమయంలోనే నాన్నగారి ఆరోగ్యశ్రీ పథకం వరంలా అందింది. ప్రాణాలు నిలబెట్టింది. ఇప్పుడు నేను నా కుటుంబంతో కలిసి బతుకుతున్నానంటే.. నా పిల్లలను చూసుకుంటున్నానంటే.. అంతా ఆ దేవుడి చలవే’ అంటూ ఇంజరానికి చెందిన సోదరి కుడిపూడి సూర్యావతి చెబుతుంటే.. మనసుకెంతో సంతోషమేసింది.
 
ఈ రోజు భర్తతో కలిసి వచ్చిన చెల్లెమ్మ అనసూరి రాధిక.. నాతో పాటు పాదయాత్రలో అడుగులేసింది. నాన్నగారి వల్ల తమ కుటుంబానికి జరిగిన మేలు జన్మలో మరిచిపోలేనిదని, తమ కుటుంబమంతా ఆయనకు రుణపడిపోయిందని చెప్పింది. ఆమె అక్క.. సత్యవాణి 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమెల్యేగా పోటీ చేయడం కోసం తహశీల్దార్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిందట. ఆ ఎన్నికల్లో ఓడిపోయిందట. ఉద్యోగం కోల్పోవడంతో ఆమెతో పాటు, కుటుంబ సభ్యులూ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారట.
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాన్నగారికి ఆమె పరిస్థితిని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌గారు వివరించగా.. బలహీనవర్గానికి చెందిన ఆ సోదరి పరిస్థితి విని.. మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక అడుగు ముందుకేసి తిరిగి ఉద్యోగం ఇప్పించారట. ‘ప్రత్యర్థి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటికీ.. ఏమాత్రం వివక్ష చూపకుండా ఆదుకున్న పెద్ద మనసు వైఎస్సార్‌ గారిది’ అంటూ రాధికమ్మ.. తమకు నాన్నగారు చేసిన మేలు గురించి ఘనంగా చెప్పింది. కానీ, ఈ నాలుగేళ్ల పాలనాకాలాన్ని సమీక్షిస్తే.. అంతా పార్టీ వివక్ష రాజకీయాలే కనిపిస్తాయి.

శతవత్సరాల వృద్ధులకు, వందశాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు, పెద్ద దిక్కు కోల్పోయి.. బతుకు భారమైన వితంతువులకు సైతం.. పార్టీ వివక్షతో పింఛన్లు ఇవ్వడం లేదు. నాన్నగారికి పేరెక్కడొస్తుందోనన్న దుగ్ధతో.. పూర్తిచేయని పథకాలు, ప్రాజెక్టులు కోకొల్లలు. ఆయననే తలచుకుంటారన్న అల్పబుద్ధితో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి దేశానికే ఆదర్శంగా నిలిచిన అద్భుతమైన పథకాలనూ నిర్వీర్యం చేశారు. తమ పార్టీకి ఓట్లేయలేదని సంక్షేమ పథకాలు అందివ్వని దుర్మార్గాలెన్నెన్నో. ఈ పాలన మొత్తం కక్ష సాధింపు చర్యలు, వివక్షాభరిత రాజకీయాలు.. అంటూ పోల్చి చెప్పారు నా వెంట నడిచిన నేతలు.  
 
ఎన్నికలప్పుడే రాజకీయం. మిగతా సమయమంతా ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగాలి.. అని నాన్నగారు తరచూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. అధికార పార్టీ నేతలు, వారి సానుకూలుర రొయ్యల అక్రమ సాగు వల్ల.. మంచినీరు కలుషితమై తాగడానికి నీళ్లే దొరకని దుస్థితి దాపురించిందని వాపోయారు కె.గంగవరం ప్రజలు. తాగడం మాట దేవుడెరుగు.. స్నానానికి సైతం పనికిరానంతగా కలుషితమయ్యాయని బాధపడ్డారు. ఆ నీటిని వాడితే రోగాలే.పాలల్లో పోస్తే పాలు సైతం విరిగిపోతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

మాకిదేం ఖర్మ.. అని నాయకుల్ని నిలదీస్తే.. ఆందోళనలు చేస్తే.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రొయ్యల అక్రమ సాగు ఆపాలన్న కలెక్టర్‌ ఆదేశాలకే దిక్కు లేదంటే.. పచ్చ నేతల ప్రాబల్యం ఎంతలా ఉందో తెలుసుకోవచ్చన్నారు. రెక్కడితేగానీ డొక్కాడని తాము తాగునీరు ఎలా కొనగలం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఓ వైపు.. ప్రభుత్వ వైఖరి వల్ల తాగునీరు కలుషితమై విషతుల్యమైపోతోంది. మరోవైపు.. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రక్షిత మంచినీటిని సరఫరా చేయడం లేదు. పాపం.. ఆ సామాన్య ప్రజలు ఏం తాగాలి? ఎలా బతకాలి? కనీస మానవత్వం కూడా కనిపించని ప్రభుత్వమిది.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తాగునీటికి సంబంధించి మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు. ఉప్పునీటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం ఏర్పాటుచేస్తామన్నారు.. రొయ్యల సాగు వల్ల అనేక గ్రామాలు ఉప్పునీటిమయమయ్యాయి. ఒక్క గ్రామానికైనా మీరు చెప్పిన ప్రత్యేక తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారా? ప్రతి ఇంటికీ మంచినీరు లక్ష్యాన్ని పూర్తిచేస్తామన్నారు.. ఎన్నికలకు మరికొద్ది నెలలే గడువుంది.. కనీసం ఒక్క గ్రామంలోనైనా ఆ లక్ష్యాన్ని పూర్తిచేశారా? ప్రతిగ్రామానికీ రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికీ ఉచిత కుళాయి, రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌..  ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి? 

- వైయ‌స్ జ‌గ‌న్‌


Back to Top