ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. రైతన్నలను ఆదుకోవడం పెద్ద కష్టమా?


 
 
04–07–2018, బుధవారం
ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా 


ఈ రోజు కుయ్యేరు, బాలాంత్రం, వేగయమ్మపేట, ద్రాక్షారామం మీదుగా పాదయాత్ర సాగింది. ఉదయం చిత్తూరు జిల్లా నుంచి మామిడి రైతులు వచ్చి కలిశారు. ఏడాదిపాటు కష్టపడి పండించిన మామిడిని రోడ్డుపై పారబోసే దురవస్థను వివరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, అమ్ముకుందామంటే.. మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ‘ఈ సంవత్సరం పూత దశలోనే పంట దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో పిందె దశలోనే కాయలు నేల రాలాయి. దిగుబడి బాగా తగ్గిపోయింది. మిగిలిన ఆ కాస్త పంటకైనా డిమాండ్‌ పెరిగి మంచి ధర వస్తుందనుకుంటే.. సిండికేట్లు, దళారీ వ్యవస్థ తమను నిలువునా ముంచేశాయి’ అని చెప్పారు.

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన గల్లా ఫుడ్స్, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు డీకే శ్రీనివాస్‌కు చెందిన శ్రీని ఫుడ్స్‌.. ఇలా టీడీపీకి చెందిన ప్రముఖ నేతల మామిడి గుజ్జు ఫ్యాక్టరీలన్నీ సిండికేట్‌గా ఏర్పడి టన్ను రూ.23 వేలు పలకాల్సిన ధరను రూ.4 వేలకు దించేసి.. తమను నిలువునా ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ ఫుడ్స్, గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌.. ఇలాంటివన్నీ లాభాల బాటలో పరిగెడుతుంటాయి.. అహర్నిశలు కష్టపడి పండించిన రైతన్న మాత్రం నష్టాల ఊబిలో కూరుకుపోతాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ మంత్రుల సొంత జిల్లా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌ అయి రైతుల నడ్డి విరుస్తున్నాయంటే.. ప్రభుత్వ పెద్దల లాలూచీ వ్యవహారం ఎంతలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. రైతుల విషయంలో దళారులకు, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఇంత బరితెగింపు వచ్చిందంటే.. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమా, అలసత్వమా, నిర్లక్ష్యమా.. ఏమనుకోవాలి? ముఖ్యమంత్రే దళారీలను ప్రోత్సహించడం, దళారీలకు నాయకత్వం వహించి.. ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కుమ్మక్కవ్వడమే రైతన్నల దయనీయ పరిస్థితులకు కారణం. నిజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ రైతన్నలను ఆదుకోవడం పెద్ద కష్టమా? 


‘అప్పులు చేసి.. సరుకులు తెచ్చిమరీ బడి పిల్లలకు వండిపెడుతున్నాం.. రూ.1,000 కనీస వేతనంతోనే ఏళ్ల తరబడి పనిచేసుకుంటూ పోతున్నాం.. పిల్లలకు వండిపెట్టే మాకు.. తినడానికి కష్టపడే రోజులొచ్చిపడ్డాయి. గత సెప్టెంబర్‌ నుంచి వేతనాలివ్వడం లేదు. సరుకుల బిల్లులూ చెల్లించడం లేదు. మేమెలా బతకాలి.. ప్రభుత్వం ఇచ్చేది 4 రూపాయల 13 పైసలు.. సరఫరా చేసేది నాసిరకం బియ్యం, నాణ్యత లేని గుడ్లు.. మంచి భోజనం ఎలా పెట్టగలం’ అంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతలేని భోజనం పెడుతున్నామన్న నెపాన్ని మాపై నెట్టి.. ఈ పథకాన్ని అస్మదీయులైన ప్రయివేటు వారికి అప్పజెప్పడానికి ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక ప్రకారం ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. సహకార డెయిరీలైనా, సహకార చక్కెర ఫ్యాక్టరీలైనా, ప్రభుత్వ ఆస్పత్రులైనా, స్కూళ్లైనా.. వేటినైనా ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేసి.. స్వలాభానికి బాటలేసుకోవడం బాబుగారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో!

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ సొంత జిల్లాలోనే సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసి.. చెరకు రైతుల నడ్డి విరవడం వాస్తవం కాదా? విజయా డెయిరీని మూసి.. పాడి రైతుల ఉపాధిని దెబ్బతీయడం నిజం కాదా? దళారులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ.. మీరే దళారులకు నాయకత్వం వహిస్తూ.. టమాట, మామిడి రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు.. ధర్మమేనా? మీ సొంత జిల్లా పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలోని మిగతా జిల్లాల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో మీకు తెలియదా? ఓ వైపు వ్యవసాయాన్ని మీరే సంక్షోభంలోకి నెట్టేస్తూ.. మరోవైపు వ్యవసాయ రంగంలో తిరుగులేని వృద్ధి సాధించాననడం.. ఎవర్ని మోసగించడానికి?  
-వైయ‌స్‌ జగన్‌    




Back to Top