‘నగరం’ఘటనలో నష్టపోయిన జనానికి బాబు సమాధానం చెప్పి తీరాల్సిందే..


 
 
27–06–2018, బుధవారం  
భీమనపల్లి, తూర్పుగోదావరి జిల్లా  


ప్రజలే సారథులై.. ప్రజాభిమానమే వారధిలా సాగిపోతున్న సంకల్ప యాత్ర ఇవాళ 200 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సుదీర్ఘ యాత్రలో లక్షలాది మందిని కలిసే అవకాశం దక్కింది. పేదల జీవితాలను దగ్గర్నుంచి చూడగలిగాను. ఆర్తులు.. అన్నార్తులు.. దగాపడ్డ హృదయాల ఆవేదనలను విన్నాను. శాపమైన చంద్రబాబు పాలనలో నష్టపోయి, కష్టపడుతున్న ప్రజలందరి మనోవ్యథలు ఎన్నో.. ఇంకెన్నెన్నో! 

ఈ రోజు మధ్యాహ్నం నగరం గ్రామానికి చెందిన జాఫరీబేగం కలిసింది. కన్నీరు పెడుతూనే కష్టాన్ని చెప్పుకొంది. పదిహేనేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయింది. కుట్టుపని చేసుకుంటూనే ఇద్దరు ఆడపిల్లలను చదివించింది. భారంగా సాగిపోతున్న ఆమెకు మళ్లీ కష్టం వచ్చింది. రెండు కిడ్నీలూ చెడిపోయాయట. డయాలసిస్‌ చేయకపోతే ప్రమాదం. దానికోసం కాకినాడకు వెళ్లాలి. దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెబుతూనే.. ఆమె గొంతు జీరబోయింది. ఆ అక్క బాధ వింటుంటే నాకు ఓ విషయం గుర్తుకొచ్చింది. నగరం గ్యాస్‌ పైప్‌ల విస్ఫోటన దుర్ఘటన జరిగి సరిగ్గా నేటికి నాలుగేళ్లు. 22 మందిని బలిగొని.. 18 మంది తీవ్రంగా గాయపడ్డ ఆ పెను విషాద బాధిత కుటుంబాలను ఆనాడే నేను పరామర్శించాను. ఆ దుర్ఘటన తర్వాత చంద్రబాబు చేసిన హడావుడీ గుర్తుంది.


నగరం గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా చేస్తానన్నాడు. ఏమైంది ఆ మోడల్‌ విలేజ్‌? సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రే గెయిల్‌ అధికారులను పక్కన పెట్టుకుని 18 హామీలు గుప్పించారు. ఒక్కటైనా నెరవేరిందా? నగరం ఆస్పత్రిని సూపర్‌ స్పెషాల్టీ చేస్తామన్నారు.. మరి ఆ ఆస్పత్రే ఉంటే ఈ అక్కకు ఈ దుర్గతి పట్టేదా? నాలుగేళ్ల బీజేపీ సంసారంతో బాబుగారు సాధించిందేంటి? స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడం తప్ప. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడం కోసం ఒక్క క్షణమైనా ప్రయత్నించారా? ఈ నాలుగేళ్లలో చమురు సంస్థల నుంచి వచ్చిన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులు ఏమయ్యాయి? వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే.. కోనసీమకు ఈ దుస్థితి ఉండేదా? కోనసీమ ప్రజల మనస్సుల్లోంచి వస్తున్న ప్రశ్నలివి. జాఫరీబేగం లాంటి ఎంతోమంది బాధితులకు, నగరం దుర్ఘటనలో నష్టపోయిన జన సామాన్యానికి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే.  

చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న విలసవిల్లి గ్రామంలో అక్కచెల్లెమ్మలు పట్టుపోగుల దండలతో స్వాగతం పలికారు. దారి పక్కనే ఉన్న చేనేత చెల్లెమ్మ వెంకటలక్ష్మి.. తను నేస్తున్న మగ్గం చూడాలని తీసుకెళ్లింది. తన బతుకు కష్టం చెప్పుకొంది. భార్యాభర్తలిరువురూ రోజుకు 15 గంటలు పనిచేసినా 150 రూపాయలు కూడా గిట్టడం లేదని, ఎలా బతుకుతామని ఆవేదన వెలిబుచ్చింది. కులవృత్తిని నమ్ముకుంటే అప్పుల్లో కూరుకుపోయామని తెలిపింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంది. రుణమాఫీ మొదలుకుని.. ఇచ్చిన హామీలన్నీ గోదాట్లో కలిపారన్నా.. అని చెప్పింది. గంటల తరబడి మగ్గంపై పనిచేయడంతో ఆరోగ్య సమస్యలూ వెంటాడుతున్నాయంది.

ఈ కష్టాలు పడలేక ఇక్కడి వారిలో ఎక్కువ మంది చేనేత వృత్తిని మానేసి.. తాపీ మేస్త్రీలుగా, కూలీలుగా వెళుతున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మగ్గాలే కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. చేనేత దుస్థితిని చూసి చాలా బాధేసింది. నాన్నగారి పాలనలో నేతన్నల కన్నీళ్లకు చలించిపోయారని.. సంక్షేమ పథకాలతో ఆదుకున్నారని గుర్తుచేసింది. ఆ మంచి రోజులు మళ్లీ తప్పక వస్తాయని భరోసానిస్తూ ముందుకు సాగాను.  

రాబోయే 8 నెలల్లో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని, మత్స్యకారులను ఎస్టీలలో, వడ్డెరలను, రజకులను ఎస్సీలలో చేర్చడానికి కమిషన్‌ వేస్తామని కేబినెట్‌లో నిర్ణయించినట్లు పత్రికల్లో చదివి విస్మయానికి గురయ్యాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గత నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాననడం.. నిరుద్యోగ యువతను మరోసారి మోసపుచ్చడం కాదా? మీరిస్తామంటున్న అరకొర నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ స్పష్టత లేదనడం.. మీ హామీల డొల్లతనాన్ని ఎత్తిచూపడం లేదా? మీ చేతుల్లో లేదని, కేంద్రం పరిధిలోని అంశమని తెలిసి కూడా మత్స్యకారులను ఎస్టీలలో.. వడ్డెరలను, రజకులను ఎస్సీలలో చేర్చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మీరు.. మళ్లీ ఎన్నికలొస్తున్న ఈ తరుణంలో కంటి తుడుపు చర్యగా.. కాలయాపన చేయడానికి కమిషన్‌ వేస్తాననడం మరోసారి వారిని వంచించడానికి కాదా? ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’అనే మోసపు సినిమాలు ఇంకెన్ని చూపిస్తారు బాబుగారూ?   
-వైయ‌స్‌ జగన్‌ 
Back to Top