కమీషన్ల కోసం పాకులాడే పాలకులకు పేదల బాధలెలా తెలుస్తాయి?


 

24–06–2018, ఆదివారం
నగరం, తూర్పుగోదావరి జిల్లా


ఈ రోజు రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఈ ప్రాంతంలో చెమటోడ్చినా బతుకుబండి సాఫీగా నడవని కొబ్బరి దింపుడు, ఒలుపు కార్మికులు ఎందరో ఉన్నారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటున్న వారి విన్నపం సమంజసమే అనిపించింది. ఇక్కడి ప్రతి గ్రామంలో బతుకు దెరువు కోసం ఎడారి దేశాలకు వలస పోయినవా రెందరో ఉన్నారు. ఇక్కడ దళారుల చేతుల్లో మోసపోయి.. అక్కడ నానా అగచాట్లుపడుతున్న వారి కుటుంబాల క్షోభ చెప్పనలవి కాదు. అట్టి వలస బాధితుల కోసం అధికారిక సహాయ కేంద్రం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. 

కడలి గ్రామం వద్ద మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది కలిశారు. ఎన్నో ఏళ్లుగా బడి పిల్లలకు భోజనం వండిపెడుతున్నా.. వారికి ఇస్తోంది నామమాత్రపు వేతనమే. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ మాత్రం వేతనం కూడా నెలల తరబడి రావడం లేదట. బిల్లులు కూడా చెల్లించడం లేదట. అయినా అష్టకష్టాలూ పడుతూ ఏదోలా నెట్టుకొస్తుంటే.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పనిని సైతం ప్రయివేటు వారికి అప్పగించి తమకు ఉపాధి లేకుండా చేస్తోందన్నది వారి ఆందోళన. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ఉన్నఫళంగా ఉపాధి లేకుండా చేస్తే.. వారేం కావాలి? ప్రతి పనిలో కమీషన్ల కోసం పాకులాడే పాలకులకు పేదల బాధలు ఎలా తెలుస్తాయి?


ఈ రోజు సాయంత్రం నగరం గ్రామంలో నడుస్తున్నప్పుడు.. 2014లో చంద్రబాబుగారు సీఎం అయిన తొలి నాళ్లలో జరిగిన గెయిల్‌ పైప్‌లైన్‌ పేలుడు బాధితులు కలిశారు. వారిలో.. ఆప్తులను కోల్పోయినవారు కొందరు, తీవ్రంగా కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్నవారు మరికొందరు. దుర్ఘటన జరిగిన తొలినాళ్లలో హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు తర్వాత వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, ఇచ్చిన హామీలను గాలికొదిలేయడం దారుణ మైన విషయం. ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తామన్నారు.. ఉపాధి కల్పిస్తామన్నారు.. గాయపడ్డ కుటుంబాల చదువు మొదలుకుని పూర్తి బాధ్యత తమదేనన్నారు.. ఆ మాటలన్నీ నీటిమూటలేనా? ఇచ్చిన 18 హామీలు ఏమయ్యాయి? కాలిపోయి గాయపడ్డ బాధితులకు వేలిముద్రలు పడటం లేదని నాలుగేళ్లుగా రేషన్‌ బియ్యం కూడా ఇవ్వడం లేదంటే.. ఈ ప్రభుత్వానిది ఎంత దుర్మార్గం? ‘ఒళ్లంతా కాలిపోయి వైకల్యం పొందిన మేము.. పింఛన్‌కూ అర్హులం కాదా’ అని వారు అడుగుతుంటే.. ఏమని సమాధానం చెబుతారు ఈ పాలకులు.

ఇచ్చిన హామీలను నెరవేర్చి కాస్తయినా న్యాయం చేయాలని బాధితులు కాళ్లరి గేలా తిరుగుతుంటే.. మాకు సంబంధం లేదు.. గెయిల్‌ సంస్థను అడగండని ప్రభుత్వం, మాకేం సంబంధం లేదు.. వారినే అడగండని గెయిల్‌ వారు తప్పించుకు తిరుగుతుంటే ఎవరికి మొర పెట్టుకోవాలి? బాధ్యత ఎవరిది? చేయని పాపా నికి శిక్ష అనుభవిస్తున్న ప్రజల పక్షాన నిలవాల్సిన కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఆందోళన కరమైన విషయం ఏంటంటే.. దుర్ఘటన జరిగిన ప్పుడు హడావుడి చేయడం తప్ప అటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు నేటికీ తీసుకోకపోవడం.. ఇప్పటికీ గ్యాస్‌ లీకవుతోందంటూ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతుండటం.. ప్రమాదం జరిగి నప్పుడు భిక్షమేసినట్టు పరిహారం ఇవ్వడం తప్ప ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోవడం. 

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నగరం దుర్ఘటన జరిగి నాలుగేళ్లవుతున్నా బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం అన్యాయం కాదా? వారికి న్యాయం జరిపించాల్సిన మీరే.. వేలిముద్రలు పడటం లేదని రేషన్‌ బియ్యం లాంటి సంక్షేమ పథకాలను సైతం అందించకపోవడం అమానుషం కాదా?  
-వైయ‌స్‌ జగన్  

Back to Top