బాబుగారు మరోమారు ప్రజలను వంచించాలని చూస్తున్నారు

 
23–06–2018, శనివారం
ములికిపల్లి, తూర్పుగోదావరి జిల్లా

ఉదయం నుంచి జోరువాన. అయినా రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు తరలివచ్చారు. వారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి హేమాహేమీలు ఉన్నారు. ఒలింపిక్‌ దినోత్సవం సందర్భంగా వందలాది మంది క్రీడాకారులు, అశేష క్రీడా ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ఒలింపిక్‌ రన్‌ను ప్రారం భించడం ఒక మధురమైన అనుభూతి. క్రీడా స్ఫూర్తిని నలుమూలలా వ్యాప్తి చేయాలన్న సంక ల్పంతో జరుగుతున్న ఈ ఒలింపిక్‌ పరుగులో క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వార్థ రాజకీయాలతో, అవినీతితో రాష్ట్ర క్రీడారంగాన్ని భ్రష్టుపట్టించిన ప్రభుత్వ పెద్దల దుర్మార్గ వైఖరిపై కసిగా కదం తొక్కారు. గత నాలుగేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురై.. చీకట్లు అలముకున్న రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త వెలుగులు తీసుకొస్తానన్న విశ్వాసాన్ని నాపై ఉంచి, క్రీడా జ్యోతిని పట్టుకుని ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందంటూ నా వద్దకు వచ్చిన ఘటనలు మదిలో మెదిలాయి. వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిరోమణి, పరుగులో నాగాంజలి, సైకిల్‌ పోలో, బాక్సింగ్‌లలో అంబిక ఎంతో ప్రతి భ కనబరిచినా, ఎన్నో పతకాలు సాధించినా ప్రోత్సాహం లేక క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడటం.. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 




ఉదయం నుంచి కురుస్తున్న జోరు వాన.. పూర్తిగా బురదమయమైన రహదారులు.. ప్రజలు ఇబ్బందులు పడరాదని.. వర్షం కాస్త తగ్గేదాక పాదయాత్రకు విరామమిచ్చాను. ‘అన్నా.. ఎంఎస్సీ జువాలజీ పూర్తయి ఐదేళ్లయింది. మా ఆయన బీఈడీ చేశాడు. ఇంటికో ఉద్యోగమని హామీ ఇస్తే.. ఒక్కరికైనా రాకపోద్దా అని ఆశపడ్డాం. బాబుగారి పాలన ముగుస్తున్నా.. జాబొచ్చే ఆశలేదు’ అంటూ నిట్టూర్చింది చింతలపల్లిలో కలసిన ధనలక్ష్మి. అబద్ధాలు, ఆర్భాటపు ప్రచారాలతోనే నాలుగేళ్లు పూర్తిచేసిన బాబుగారు ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలలు మాత్రమే వర్తించే స్కీమ్‌లను ప్రకటించడం ద్వారా మరోమారు ప్రజలను వంచించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. 

రాజన్న రాజ్యం రావాలన్న ఆకాంక్షతో.. నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం దాదాపు 1,500 కి.మీ. సైకిళ్లపై యాత్ర చేసి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారట మల్కిపురం మండలానికి చెందిన యువకులు. అన్నా.. మన పాలన వస్తే పాదయాత్రగా శబరిమలకు వస్తామని మొక్కుకున్నామని వారు చెబుతుంటే ఆ అభిమానానికి ముగ్ధుడినయ్యాను. 

సామాజిక మాధ్యమాల్లో.. ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. చైతన్యాన్ని రగిలిస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న సోదరులు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. వారి కృషి అభినందనీయం. 

సీఎంగారికి నాదో ప్రశ్న.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి ఒక్కటి కూడా చేయకపోవడం రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ దారుణంగా వంచించడం కాదా? ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ను ప్రకటించి సక్రమంగా నియామకాలు చేపడతానని హామీ ఇచ్చిన మీరు.. ఇప్పటి వరకు చేయకపోగా ఇప్పుడు గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపి భర్తీ చేస్తాననడం.. గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం కాదా?  
-వైయ‌స్‌ జగన్‌ 


తాజా వీడియోలు

Back to Top