కుటీర పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతున్న బాబుగారు



 
 
15–06–2018, శుక్రవారం
వెదిరేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా

సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్‌ పండుగను ముస్లింలందరూ ఘనంగా జరుపుకోవాలని, ఆ అల్లా దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. 

ఒకప్పుడు ఆకలికేకలతో అలమటించిన ఈ కరువు సీమను.. గోదావరిపై బ్యారేజీ నిర్మించడం ద్వారా పచ్చటి కోనసీమగా మార్చిన కాటన్‌దొర విగ్రహాలు గ్రామగ్రామానా కనిపించాయి. ఒకప్పుడు అన్నమో రామచంద్రా.. అని దేశాలుపట్టి పోయేవారు ఇప్పుడు దేశానికే అన్నదాతలయ్యారంటే.. సాగునీటి ప్రాజెక్టుల గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఇంతతెలిసీ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసేవారు, అవినీతిమయం చేసేవారు చరిత్రహీనులుగాక ఇంకేమవుతారు?! 


నిన్న పూతరేకుల మాధుర్యాన్ని అందించిన తల్లులు ఈ రోజు మామిడి తాండ్ర రుచులు చూపించారు. ‘అచట పూసిన చివురు కొమ్మయినా చేవ’ అన్నట్లుగా ఇక్కడ ప్రతివారి పాకశాస్త్ర ప్రావీణ్యత ఎవరినైనా అబ్బురపరిచేదే. మామిడి తాండ్ర తయారీ నైపుణ్యాన్ని ఓ వైపు గమనిస్తూనే.. మరోవైపు దాని వెనక ఉన్న కష్టాన్నీ అడిగి తెలుసుకున్నాను. ఈ ఒక్క ఆత్రేయపురంలోనే వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ మామిడి తాండ్రకు స్టోరేజ్, మార్కెటింగ్‌ సౌకర్యాలు లేవని చెప్పారు. పెట్టుబడులు ఎక్కువైపోయి, రవాణా చార్జీలు పెరిగిపోయి, జీఎస్టీ బాదుడు తట్టుకోలేక ఇబ్బందులుపడుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదన్నది ఆ అక్కచెల్లెమ్మల ఆవేదన. 

కొద్దిగా ముందుకు పోగానే.. నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన మహిళలు కలిశారు. వారంతా నోరూరించే పచ్చళ్ల తయారీలో చేయితిరిగినవారే. ఆ పచ్చళ్ల తయారీ సైతం ఈ పాలనలో పన్నుల దెబ్బకు, అధికారుల వేధింపులకు, పెరిగిపోతున్న పెట్టుబడుల దెబ్బకు తట్టుకోలేక కుదేలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. ఇళ్లలోనే పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్లు తయారుచేస్తూ.. తెలుగు సంప్రదాయ రుచులకు దేశవిదేశాల్లో ప్రాచుర్యం తెచ్చిపెడుతున్న అక్కచెల్లెమ్మల్ని చూసి ఓ వైపు గర్వంగా అనిపించినా.. మరో వైపు ఈ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో కూరుకుపోతున్న ఆ కుటీర పరిశ్రమల్ని చూసి బాధేసింది.

ఇప్పటికే గత వైభవాన్ని కోల్పోతున్న ఈ ‘వంట కళలు’.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతరించే అవకాశమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తంచేశారా అక్కచెల్లెమ్మలు. పొదుపు సంఘాలను బలోపేతం చేసి, పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు ఇప్పించి, గుర్తింపు కార్డులిచ్చి, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించి, డ్వాక్రా బజార్ల తోడ్పాటునందించి అండదండగా నిలిచిన నాన్నగారిని గుర్తుచేసుకున్నారు. మరోవైపు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసి, వడ్డీలు కూడా కట్టకుండా నమ్మిన వారిని నట్టేట ముంచి, బ్యాంకుల ముందు దోషులుగా నిలబెట్టి, వాటి గడప కూడా తొక్కలేని పరిస్థితి కల్పించి, తమ కుటీర పరిశ్రమల సంక్షోభానికి కారకుడైన బాబుగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుగారు ఓ వైపు పరిశ్రమల కోసమంటూ సింగపూర్, జపాన్‌ అంటూ దేశవిదేశాలు తిరుగుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వచ్చేశాయంటూ అబద్ధపు ప్రచారాలతో మోసపుచ్చుతున్నారు. రాని కంపెనీలకు, బోగస్‌ కంపెనీలకు, బినామీ కంపెనీలకు, ముడుపులిచ్చే బడా కంపెనీలకు పెద్దపెద్ద రాయితీలంటున్నాడు. కోట్ల విలువ చేసే పేదల భూముల్ని ధారాదత్తం చేస్తున్నాడు. కానీ.. మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే చిన్నచిన్న కుటీర పరిశ్రమలను మాత్రంనిర్లక్ష్యపు ఉక్కుపాదం కింద నలిపేస్తున్నాడు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు అంటూ బూటకపు మాటలు చెబు తూ ప్రజలను మోసం చేస్తున్న మీకు.. రాష్ట్రానికే వన్నె తెచ్చి, వేలాది మంది అక్కచెల్లెమ్మలకు బతుకుదెరువైన కుటీర పరిశ్రమలు బలైపోతుం డటం కనిపించడంలేదా? ఇందుకు బాధ్యులు మీరు కాదా?
-వైయ‌స్‌ జగన్‌ 




Back to Top