ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొట్టడం ధర్మమేనా?


 
 
13–06–2018, బుధవారం
పేరవరం, తూర్పుగోదావరి జిల్లా

ఈరోజు కాటన్‌ బ్యారేజీ సెంటర్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ శిబిరం. పక్కనే గోదావరి, ఎదురుగా ‘గోదావరి డెల్టా పితామహుడు’ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహం. అక్కడే నాన్నగారి నిలువెత్తు విగ్రహముంది. గొప్ప పనులు చేసే వారిని ప్రజలు గుండెల్లో నిలుపుకుంటారనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఈ రాష్ట్ర చరిత్రలో నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను, ఆవశ్యకతను గుర్తించి భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేసిన ఇద్దరు దార్శనికులు నిలువెత్తు విగ్రహాల్లో స్ఫూర్తి ప్రదాతలై కనిపించారు.
 
‘నీటికి నడకలు నేర్పి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్‌ దొర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడో పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా ఇక్కడకు వచ్చిన ఆ మహానుభావుడి తపనలో వెయ్యో వంతు, లక్షో వంతు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి లేకపోవడం బాధగా ఉంది’ అని నాన్నగారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన రోజుల్లో రాసుకున్నారు. అప్పుడు సీఎం చంద్రబాబే. ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి. కానీ పరిస్థితుల్లో తేడా లేదు. నాడు, నేడు కూడా పైపై ప్రచారానికి పనికొచ్చే వాటి మీదే ఆయన దృష్టి. అక్రమార్జనకు అనువైన వాటిమీదే ఆయన ధ్యాస. 

‘ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఉద్యోగ భద్రత లేదు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం. బాబు గారు ఎప్పుడొచ్చినా మా జాబు ఊడుతుందన్న అభద్రతే’ అంటూ నన్ను కలిసిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వెలిబుచ్చారు. ‘ఎన్నికలప్పుడు క్రమబద్ధీకరిస్తామన్నాడు. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలకే ఎసురు పెడుతున్నాడు’ అంటూ వారు వాపోయారు. ఆ తర్వాత కలిసిన ట్రాన్స్‌కో ఉద్యోగులదీ ఇదే వ్యథ. ‘గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి దశ సంస్కరణల పేరుతో కాంట్రాక్టు పద్ధతి తెచ్చాడు. ఇప్పుడు రెండో దశ అంటున్నాడు. ఉద్యోగుల సేవలను ఔట్‌ సోర్సింగ్‌ చేస్తాడట. విద్యుత్‌ సేవలను ప్రైవేటీకరించి, అయిన వారికి కట్టబెట్టి దోచుకోవడమే దీని వెనుక ఉన్న మర్మం’ అంటూ ట్రాన్స్‌కో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 22 లక్షల రూపాయల ఖర్చుతో సక్రమంగా నిర్వహిస్తున్న 132 కేవీ సబ్‌స్టేషన్లను ప్రైవేటు వారికి అప్పగించి.. రూ.52.5 లక్షలు చెల్లించడం ముడుపులకు కాక మరెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కన్నా సీఈవోగా పిలిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానన్న బాబు గారికి వ్యాపార దృష్టి తప్ప మానవత్వం ఎందుకుంటుంది? 

పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ దుర్భరంగా బతుకులీడుస్తున్న ఆర్‌.ఎస్‌.నగర్‌ అక్కచెల్లెమ్మల ఆవేదన కలచివేసింది. ‘పాకల్లో బతికేవాళ్లం.. పక్కా ఇళ్లల్లోకి వచ్చామంటే మీ నాన్నగారి చలవే. ఆయన తదనంతరం మా గురించి కనీస ఆలోచన చేసిన నాయకుడే లేడు. ఈ పాలనలో మరీ దుర్భరం. మా కాలనీలో మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ దుర్గంధపు మురుగునీటి మధ్యలోనే దోమలతో, పందులతో సావాసం చేస్తున్నాం. మరుగుదొడ్డి మలినాలు అందులోనే.. తాగునీటి పైపులూ అందులోనే. కలెక్టర్‌ గారికి విన్నవించుకున్నా, ఎమ్మెల్యే గారి కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపలేదు. తీవ్రమైన రోగాల బారిన పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. మమ్మల్ని కనీసం మనుషుల్లా కూడా గుర్తించడం లేదు’ అంటూ ఆడపడుచులు బావురుమంటుంటే చలించిపోయాను. పుష్కరాల పేరుతో రూ.వందల కోట్లు దోచేసిన నేతలకు పక్కనే ఉన్న ఈ పేదలు... ఎన్నికలు వస్తే తప్ప గుర్తుకు రారేమో! 

చివరగా ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న. రాష్ట్రంలోని సబ్‌స్టేషన్లు.. ప్రస్తుతమున్న సిబ్బంది, ఇస్తున్న బడ్జెట్‌తో సక్రమంగా నడుస్తున్నప్పటికీ రెట్టింపు ఖర్చుతో ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం మీ కమీషన్ల కోసం కాక మరెందుకు? ఎన్నికలప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన మీరు.. ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొట్టడం ధర్మమేనా?  
-వైయ‌స్‌ జగన్‌




Back to Top