అఖిల భారత సర్వీసుల ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న బాబు వైఖరి దారుణం

 
11–06–2018, సోమవారం
కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా

మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ అనేది ఏమాత్రం వర్తించని నియోజకవర్గం కొవ్వూరు. బీరు మద్యం కాదు.. హెల్త్‌ డ్రింక్‌.. అంటూ కొత్త భాష్యం చెప్పిన ఎక్సైజ్‌శాఖ మంత్రిగారు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. అటువంటి ఈ నియోజకవర్గంలో చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు పాలక పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి.. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు, అక్రమ పేకాట క్లబ్‌ల నిర్వహణకు తోడ్పాటునిస్తుండటం దారుణమైన విషయం.  

ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. తీవ్ర స్థాయిలో పార్టీ వివక్షను ప్రదర్శిస్తూ.. ఈ మొత్తం వ్యవహారాల్లో అధికారులను పావులుగా వాడుకోవడమన్నది చంద్రబాబు మార్కు పాలనగా మారిపోయింది. ఓ దళిత మహిళా సర్పంచ్‌ ఎదుర్కొంటున్న పార్టీ వివక్ష, వేధింపులు నా దృష్టి కొచ్చాయి. చిక్కాల గ్రామం లో గతంలో 20 ఏళ్లుగా టీడీపీ సర్పంచ్‌లే ఉన్నారట. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీకి చెందిన దళిత మహిళ సర్పంచ్‌ అవడంతో జీర్ణించుకోలేక.. ఎలాంటి అభివృద్ధి పనులూ జరగనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారట.


ఆమెతో పాటుగా నన్ను కలిసిన గ్రామస్తులు ‘సార్‌.. ఇక్కడ మా కలెక్టర్‌గారు పనులు సాంక్షన్‌ చేస్తారు.. ఆ పనులు జరగకుండా కింద స్థాయి అధికారులతో ఆయనే అడ్డుపుల్ల వేయి స్తారు.. పనులు చేయనందుకు చర్యలు తీసుకుం టామంటూ డీపీవోతో నోటీసులిప్పిస్తారు. చెక్‌ పవర్‌ రద్దు చేస్తామంటూ బెదిరిస్తారు. పనులు అవ్వాలంటే పార్టీ మారాలంటూ సంకేతాలిస్తారు. విధిలేక కోర్టుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబు గారి దృష్టిలో దళిత అభ్యున్నతి అంటే ఇదేనేమో! ఇదేనేమో ఆయన చెబుతున్న దళిత తేజం! 

ఇరవైసార్లకు పైగా కలెక్టర్‌ను కలిసినా తమకు న్యాయం జరగలేదని.. చాగల్లు చక్కెర ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని.. కలెక్టర్‌గారు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను చిత్తశుద్ధి తో అమలు పరచకుండా యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఈ ప్రాంత చెరకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

ఏ విధమైన నోటీసులివ్వకుండా, సరైన పరిహారమూ చెల్లించకుండా పోలీసులను పెట్టి దౌర్జన్యంగా వేయిస్తున్న 220 కేవీ టవర్‌ లైన్ల వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామన్నారు.. తాడిపూడి మండల రైతన్నలు. ఈ లైన్ల వల్ల తమ భూములు నిరుపయోగమవుతున్నా.. ఇచ్చేది మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువలో కేవలం పదిశాతం మాత్రమేనట. ఇదెక్కడి న్యాయమని అడగబోతే పరిహాసం చేస్తున్నారట కలెక్టర్‌గారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాష్టీకం జరుగుతోందంటూ వాపోయారు. ‘జిల్లాలో మీ పాదయాత్ర సాగు తోందని పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. మీరు ఈ జిల్లా దాటగానే.. మళ్లీ వారంతా మా నెత్తిన పడతారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఆ సన్నకారు రైతన్నలు. 

గోదారమ్మ గర్భాన్ని తొలిచేస్తూ.. అధునా తన భారీ యంత్రాలతో వేలాది లారీల ఇసుకను ఎలా తరలించేస్తున్నారో చెప్పారు ఈ ప్రాంత రైతన్నలు. ఇదే విషయమై వారు గతంలో హైకో ర్టులో పిల్‌ కూడా వేశారట. ఇక్కడ జరుగుతున్న ఇసుక అక్రమాలను చూడలేక ప్రజలు రెడ్‌హ్యాం డెడ్‌గా యంత్రాలతో సహా పట్టించినా.. కలెక్టర్‌ గారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదట. ఆయన గారే ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటే.. ఇక అడ్డూఅదుపు ఏముంటుందంటూ తీవ్రమైన విమర్శలు చేశారు.

ఈ జిల్లాలో ఎన్ని అక్రమాలు బయటపడుతున్నా, ఎన్ని ఆందోళనలు జరిగినా, కలెక్టర్‌పై ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినా ఆయన గారినే నాలుగేళ్లుగా కొనసాగించడం.. అధికార పార్టీ పెద్దలతో ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెబుతోందని వారంటుంటే.. మైకుల ముందు బాబుగారు చెప్పే శ్రీరంగనీతులకు, క్షేత్ర స్థాయి లో సాగుతున్న ఆయన పాలనా తీరుకు ఎలాంటి పొంతన లేదన్న వాస్తవం తేటతెల్లమైంది. తన అక్రమాలకు కలెక్టర్ల వంటి ఉన్నతాధికారులను పావులుగా వాడి.. అఖిల భారత సర్వీసుల ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న చంద్రబాబు వైఖరి అత్యంత దారుణం. జిల్లా మొత్తాన్ని టీడీపీకి కట్టబెట్టిన పాపానికి ఇప్పుడీ శిక్షలు అనుభవిస్తు న్నామని ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ పార్టీ ప్రయోజనాలకు, మీ నేతల అవినీతిఅక్రమాలు అడ్డు లేకుండా సాగడానికి.. అధికారిక వ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడుకుని వాటిని భ్రష్టుపట్టించడం వాస్తవం కాదా? ప్రజలకు, రాజ్యాంగానికి బాధ్యులుగా మెలగాల్సిన అధికారులను.. మీ అక్రమాలకు ఉపయోగపడే సాధనాలుగా వాడుకోవడం రాజ్యాంగ వ్యవస్థను దిగజార్చడం కాదా?  
-వైయ‌స్‌ జగన్‌
Back to Top