పేదల బతుకులంటే మీకు ఎందుకింత చులకన?

 
07–06–2018, గురువారం
కానూరు క్రాస్, పశ్చిమగోదావరి జిల్లా


చాళుక్యుల ఏలుబడిలో నిరవద్యపురంగా పిలవబడ్డ ఈనాటి నిడదవోలుకు చారిత్రక, రాజకీయ నేపథ్యముంది. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి నిడదవోలు కోడలవ్వడం విశేషం. ఇంతటి ప్రాధాన్యంగల ప్రాంతంలో ఈ రోజు పాదయాత్ర సాగింది.   ‘అన్నా.. ఓ చిన్న కవిత’.. అంటూ వచ్చిన ఇంటర్‌ చదివే ఆ చెల్లెమ్మలు.. భావితరం భావాలను అక్షరాల ఆవేశంతో వినిపించారు. ‘జగనన్న వచ్చాడు.. జనులందరికీ ఉపాధినిస్తాడు’ అనే విశ్వాసాన్ని పద కవితలో పొందుపర్చారు. వాళ్ల నమ్మకానికి ఆప్యాయంగా కృతజ్ఞతలు చెప్పాను.  

జనబలమే ఊపిరిగా సాగుతున్న ఈ ప్రజా సంకల్పానికి.. ఎల్లలు దాటిన అభిమానం తోడవ్వడం ఆనందాన్నిచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రవాస భారతీయుడు సోమశేఖర్‌ కుటుంబం ఈ రోజు పాదయాత్రలో నన్ను కలిసింది. వాళ్ల నియోజకవర్గంలో సంకల్ప యాత్ర జరుగుతోందని తెలుసుకుని.. అదే పనిగా సెలవుల్లో ప్రణాళిక సిద్ధం చేసుకుని మరీ వచ్చారట. వైఎస్‌ కుటుంబమంటే చెప్పలేని అభిమానమని చెప్పారు. గతంలో దుబాయ్‌లో ఉన్నప్పటికీ 2014లో జరిగిన ఎన్నికలకు ఓటెయ్యడానికి వచ్చామన్నారు. ‘ఈసారీ మళ్లీ వస్తామన్నా.. మీ విజయం చూడాలన్నదే మా ఆకాంక్ష. మీరే భావితరం హీరో’ అంటూ వాళ్ల నోటి వెంట వచ్చిన మాటలు నన్ను కట్టిపడేశాయి.


హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి ముందుకెళ్తున్న నాకు.. డెబ్బై ఏళ్ల తాత ఎదురొచ్చాడు. ఆయన ముఖంలో చెరగని చిరునవ్వు కనిపించింది. ‘ఏంటి తాతా?’ అనే లోపే.. నాన్నగారి జ్ఞాపకాలతో ఆయన మాటలు మొదలు పెట్టాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ తాతకు 2005లో పెద్ద ఆపదే వచ్చిందట. ఆయన భార్యకు క్యాన్సర్‌ అని తేలడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడట. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నాన్నగారిని ఆశ్రయించాడట. పెద్ద మనసుతో ఆయన సాయపడ్డారని తెలిపాడు.

ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడంతో క్యాన్సర్‌ చికిత్స జరిగిందని, తన భార్య ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని చెప్పాడు. నాన్నగారు సాయం చేయడమే కాదు.. వైద్యం జరిగిన తర్వాత యోగక్షేమాలు తెలుసుకుంటూ లేఖ కూడా రాశాడని చెప్పాడు. భద్రంగా దాచుకున్న ఆ లేఖను నాకు చూపాడు. ‘ఆ మహానుభావుడు మా మధ్య లేడుగానీ.. ఆయన చేసిన ప్రతీ సాయం జనం గుండెల్లో నిండుగా ఉండిపోయిందయ్యా’.. అంటూ ఆ తాత ఆనందబాష్పాలు రాల్చాడు. ఏ పేదవాడూ క్యాన్సర్‌లాంటి పెద్ద జబ్బుల బారినపడి చికిత్స చేయించుకునే స్థోమతలేక ఇబ్బంది పడకూడదని నాన్నగారు ఆరోగ్యశ్రీకి అంకురార్పణ చేశారు. పదికాలాల పాటు పేదల గుండెల్లో ఉండిపోవడం కన్నా ఇంకేం కావాలి?  

నాన్నగారు ప్రజల మదిలో అంతగా పెనవేసుకుపోతే.. చంద్రబాబు సర్కార్‌ మాత్రం పేదలను ఎంత చిత్రవధ చేస్తోందో కదా.. అంటూ నడిపల్లి దగ్గర నన్ను కలిసి భోరున విలపించిన ఆ 70 ఏళ్ల తాత దయనీయ గాథే.. పాపిష్టి పాలనకు ఓ ఉదాహరణ. కూలి పనిచేసుకునే ఆ తాతకు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందట. వాళ్లచుట్టూ వీళ్లచుట్టూ తిరిగి మొత్తంమీద ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్నాడు.

కానీ అది విజయవంతం కాలేదట. కొద్ది రోజులకే ఎముక బయటికొచ్చి నరకం చూపిస్తోందని చెప్పాడు. ఆస్పత్రికెళితే.. మళ్లీ ఆపరేషన్‌ చేయాలన్నారట. ఈసారి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారట. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎముక బయటికొచ్చి నరకం చూస్తున్నాడు. ఆపరేషన్‌ చేయించుకునే మార్గమూ లేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తాత నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా దారుణమైన పరిస్థితే ఇది. ఆరోగ్యశ్రీకి సవాలక్ష ఆంక్షలు పెట్టి నీరుగారుస్తుంటే.. ఇలాంటి నిరుపేదల పరిస్థితేంటి?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వేలు, లక్షలు ముఖ్యం కాదు.. పేదవాడి ప్రాణాలు కాపాడటమే నా లక్ష్యమని ఆ మహానేత నాన్నగారు భావించారు.. ఆరోగ్యశ్రీని పేదవాడి బతుకు సంజీవనిగా మార్చారు. అయ్యా చంద్రబాబుగారూ.. అధికారంలోకొచ్చాక మీరు చేసిందేమిటి? ఆంక్షల చట్రంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యం పాల్జేయలేదా? మీరిచ్చే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు చెల్లక.. వాటిని పట్టుకుని మీ ఇంటి చుట్టూ, మీ సచివాలయం చుట్టూ పేదలు కాళ్లరిగేలా తిరగడం వాస్తవం కాదా? పేదల బతుకులంటే మీకు ఎందుకింత చులకన? 

 - వైయ‌స్ జ‌గ‌న్‌

Back to Top