హోదాను తాకట్టుపెట్టి చరిత్రహీనుడిగా మిగిలిందెవరు?

 
06–06–2018, బుధవారం
నడిపల్లికోట, పశ్చిమ గోదావరి జిల్లా


తెల్లవారుజాము నుంచే కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గే పరిస్థితి కనిపించలేదు. బయటకు వెళ్తే తడిసి ముద్దవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో నా పాదయాత్ర సాగుతుందా? పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా సలహా ఇచ్చారు. కొంతమంది ఈ ఒక్కరోజు విరామమి ద్దామన్నారు. ఒక్కపూటైనా ఆపుదామని మరికొందరు. భిన్నవాదనలు వింటూనే రెప్ప పాటు ఆలోచనల్లోకి వెళ్లాను. జనం కష్టాలు.. కన్నీళ్లే నా కళ్లలో మెదిలాయి. నన్ను చూడాలని.. కలవాలని.. కష్టాలు చెప్పుకోవాలని.. ఎదురుచూసే జనం గుర్తొచ్చారు. ఆ మరుక్షణమే యాత్ర మొదలైంది. వర్షంలో తడుస్తూనే ప్రజలు నా కోసం తండోపతండాలుగా వేచిచూడటం కనిపించింది. ఆ చిత్తడి వానలోనే దారిపొడవునా జనం వెన్నంటి ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రేమానురాగాల ముందు ఈ వానో లెక్కా అనిపించింది. వర్షంలో గంటల తరబడి ఎదురుచూస్తున్న అక్కచెల్లెమ్మలు ఇబ్బంది పడరాదని భోజన విరామాన్ని సైతం రద్దు చేసుకున్నాను. దాదాపు 8 గంటలపాటు.. 10.2 కిలోమీటర్లు.. విరామం లేకుండా ఏకబిగిన సాగింది ఈ రోజు యాత్ర.. ప్రజల ఆప్యాయతల మధ్య అలసట కూడా ఏ మాత్రం తెలియకుండా.

ఎడతెరిపిలేని వర్షంలోనూ జనం ఆప్యాయ తలను పంచేందుకు, బాధలను చెప్పుకుని గుండె బరువు దించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివ చ్చారు. ‘అన్నా ఒక సెల్ఫీ’ అంటూ అక్కచెల్లె మ్మలు అడుగడుగునా కట్టిపడేశారు. కొందరు చంటిపిల్లలను చంకనెత్తుకుని వచ్చి మరీ నామక రణం చేయాలన్నారు. తొలి అక్షరాలు వైఎస్సార్‌ అనే ఉండాలని పట్టుబట్టి అక్షరాభ్యాసం చేయిం చారు మరికొందరు. ఈ అభిమాన జన ప్రవా హంలోనే అడుగులు వేయాల్సి వచ్చింది. ఒక్క ఉండ్రాజవరం గ్రామం దాటడానికే మూడున్నర గంటలు పట్టడం మరిచిపోలేని అనుభవమే.


పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు గోస్తనీ ఘోష వినిపించారు. విషతుల్యమైన నదీజలాల వల్ల కలుగుతున్న నష్టాలు చెప్పుకొచ్చారు. తరతరాలుగా ఈ ప్రాంత వాసులకు శుద్ధ జలాలను అందించిన గోస్తనీ నది ఇప్పుడెందుకూ పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రొయ్యల చెరువులు ఆ నదిని కలుషితం చేస్తున్నాయని, మరోవైపు రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ రసాయనాలను, పారిశ్రామిక వ్యర్థాలను అందులోకి వదులుతున్నారని స్థానికులు చెప్పారు. ఆ నీళ్లు కనీసం పశువులు కూడా తాగలేనంతగా కలుషితమయ్యాయని తెలిపారు. పొరపాటున ఆ నది నీళ్లను వాడితే పలు రకాల వ్యాధులు వస్తున్నాయని ఏకరవు పెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉండటం వల్లే జనం ఘోష అధికారుల చెవికెక్కడం లేదన్నది వాళ్ల ఫిర్యాదు. నిజంగా ఇది దారుణమే. వేలాదిమందికి జీవనోపాధినిచ్చే నదీమ తల్లిని విషతుల్యం చేసే చర్యలు చాలా బాధను కలిగించాయి. ఆ జనం కన్నీటి ఘోషకు ఏం సమాధానం చెబుతుందీ ప్రభుత్వం? 

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించినట్టు తెలిసింది. నిజంగా రాష్ట్రం కోసం మా ఎంపీలు చేసిన త్యాగాన్ని ప్రజలెప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. హోదా కోసం మాట తప్పని, మడమ తిప్పని పోరాట స్ఫూర్తి మాదని మరోసారి రుజువైంది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు గారు... ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో త్యాగాలు చేసిన చరిత్ర మాది... ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. కాదంటారా? రాష్ట్ర ప్రజల జీవనాడైన ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి చరిత్రపుటలకెక్కింది ఎవరు? స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టి చరిత్రహీనుడిగా మిగిలిందెవరు?  
-వైయ‌స్‌ జగన్‌




తాజా వీడియోలు

Back to Top