ఇలాంటి వారినీ ఆదుకోని ప్రభుత్వాలెందుకు?

04–06–2018, సోమవారం 
యర్రాయిచెరువు, పశ్చిమగోదావరి జిల్లా

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఒకనాటి తారకా పురమే.. నేటి తణుకు. పవిత్ర గోస్థనీ నది పుణ్య జలాలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ యజ్ఞం చేసినట్టు చారిత్రక ప్రశస్థి. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి రచయిత, ప్రముఖ అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర్‌తిలక్‌ ఈ ప్రాంత వాసే. అట్టి ఈ నియోజకవర్గంలోని ఐతంపూడి, ఏలేటిపాడు, ఇరగవరం, యర్రాయిచెరువు మీదుగా నేటి పాదయాత్ర సాగింది.

చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి, భవిష్యత్తు అంధకారమై, బతుకు భారంగా నెట్టు కొస్తున్న వితంతువుల ఆవేదన అంతాఇంతా కాదు. ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే అట్టి ఐదుగురు అభాగ్యులు ఒకేసారి కలిశారు. ప్రభుత్వ సహకారం ఏమాత్రం అందని దుస్థితి వారిది. తమ కాళ్లపై తాము నిలబడాలని కాపు కార్పొరేషన్‌ లోన్లకు అర్జీలు పెట్టుకున్నా.. ఫలితం లేదన్నారు. వారిలో ఓ చెల్లెమ్మ హెచ్‌ఐవీ బాధితురాలు. ఆమెకు ఓ ఆడబిడ్డ ఉంది.. బాలికా సంరక్షణ పథకం కింద నమోదు చేసుకుని ధ్రువపత్రమూ పొందింది.


గడువు ముగిసి ఏడాది గడిచినా డబ్బులివ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంది. చంద్రబాబుగారి మహాలక్ష్మి పథకం ఆదుకుం టుందని నమ్మి మోసపోయినవారు మరో ఇద్దరు. మరో సోదరి కూతురు ఎంసెట్‌ రాసి ర్యాంకు సాధించింది. ప్రభుత్వం ఇచ్చే అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చాలక.. ఫీజులు కట్టే స్థోమత లేక.. పైచదువులు చదివించలేకపోతున్నానని భోరుమంది. కొడుకును చదివించే స్థోమతలేక డ్రైవర్‌ వృత్తిలోకి దించానంది మరో అక్క. వీరి సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. ఇలాంటి నిస్సహాయులను, నిరుపేదలను ఆదుకోవడానికే కదా.. ఏ సంక్షేమ పథకాలనైనా రూపొందించేది. వీరికన్నా అర్హులుంటారా? ఇలాంటి వారికీ చేయూతనివ్వని పథకాలెం దుకు? ఆదుకోని ప్రభుత్వాలెందుకు? 

‘సార్‌.. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకే ఓటేశాం. టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నాం. వైఎస్సార్‌ పాలన చూసైనా.. ఈసారి చంద్రబాబు ప్రజలకు ఏదైనా మంచి చేస్తాడని ఆశించాం. కానీ ఏమీ చేయలేదు సరికదా.. ఆయన మారలేదనిపించింది. ఇక ఆయన మంచి చేస్తాడన్న ఆశా లేదు’ అన్నాడు విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధి సత్యనారాయణ. మాకేదైనా మంచి జరిగిందంటే.. అది మీ నాన్నగారి పాలనలోనే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా నా కూతురు ఎంబీఏ పూర్తిచేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు చేయించుకున్నాం. ‘నాలాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి సైతం సాయం చేసిన పెద్ద మనసు ఆయనది’ అని చెబుతుంటే.. మనసుకెంతో గర్వంగా అనిపించింది. చంద్రబాబుపై భ్రమలు వీడాయి.. ఇక మేమంతా మీ వెంటే అని అంటుంటే.. ‘చేసే సాయానికి పేదరికమే ప్రామా ణికం కానీ.. పార్టీలు కాకూడదు’ అన్న నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి.

గొల్లగుంటపాలెం వద్ద కత్తెవపాడు గ్రామా నికి చెందిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో కలిశారు. వారి గ్రామంలో 39 ఐకేపీ గ్రూపులున్నాయట. టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు పొదుపు సంఘాల అక్కచె ల్లెమ్మలను మభ్యపెట్టి, మోసపుచ్చి కొత్త బ్యాంకు ఖాతాలను వారి పేర్ల మీద.. వారికి తెలియకుం డానే సృష్టించారట. గత నాలుగేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో వచ్చిన దాదాపు రూ.30 లక్షలకు పైగా కమీషన్లను మింగేశారట. చాలా బాధనిపిం చింది. ఓ వైపు.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేయక.. బ్యాంకుల ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను దోషులుగా నిలబెట్టి..  మరోవైపు వారికి న్యాయంగా రావా ల్సిన కష్టార్జితాన్ని సైతం జన్మభూమి కమిటీలు, అధికార పార్టీ నాయకులు మింగేయడం అమానుషం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేసి.. యుక్త వయసు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేస్తామ ని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏమైందా పథకం? ఒక్కరి పేరుమీదైనా డిపాజిట్‌ చేశారా? ఈ పథకాన్నీ అమలు చేయక.. అంతకు మునుపు ఉన్న పథకాలనూ ఎత్తి వేయడం మోసం కాదా?  
-వైయ‌స్‌ జగన్‌ 
Back to Top