నటించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య

 
29–05–2018, మంగళవారం  
కొప్పర్రు, పశ్చిమగోదావరి జిల్లా 

నయవంచనే నేపథ్యమై.. మోసాల వేషాలే నైజమై.. చంద్రబాబు పాలన సాగుతుంటే.. పల్లెతల్లి గుండెకోతను అక్షరాల్లో చెప్పడం సాధ్యమయ్యే పనేనా? ఈ రోజు పాదయాత్ర జరిగిన పల్లెల్లో జనం కష్టాల్లోంచి పుట్టుకొచ్చిన ప్రశ్న ఇది. ఏం పాపం చేశామన్నా.. ఈ సర్కారు మమ్మల్నిలా కాల్చుకుతింటోంది.. అంటూ అడుగడుగునా జనం ఆవేదన వ్యక్తం చేశారు.  

బొబ్బనపల్లి దగ్గర కలిసిన నలుగురు రైతన్నలు పుట్టెడు దుఃఖాన్ని నా ముందుంచారు. చేతికొచ్చిన పంటను మిల్లర్లు కొంటారట. కానీ డబ్బులిచ్చే దగ్గర మాత్రం చుక్కలు చూపిస్తున్నారట. నేరుగా రైతన్న ఖాతాలోనే డబ్బులేయాలి. నెల రోజులైనా ఖాతాల్లో డబ్బులు పడటం లేదన్నారు. ఆ తర్వాత బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవడమూ సమస్యగానే ఉందని చెప్పారు. రోజుకు రూ.3,000కు మించి ఇచ్చేదిలేదని బ్యాంకులు మొండికేస్తున్నాయని నిస్సహాయత వ్యక్తం చేశారు. కౌలు రైతు పరిస్థితి మరీ దారుణం. భూమి యజమాని ఖాతాలోనే డబ్బు జమచేస్తున్నారట. యజమాని కరుణిస్తే తప్ప పైకం చేతికొచ్చేట్టు లేదని బావురుమన్నారు. మా డబ్బులు మాకు రావడానికే నెలల తరబడి తిరగాల్సి వస్తోందని చెప్పారు. ఈలోపు వడ్డీలు పెరిగిపోయి అప్పులోళ్లు వేధిస్తున్నారన్నా.. అని తెలిపారు. వాళ్ల ఆవేదన నన్ను కదిలించింది. కానీ చంద్రబాబుకు ఇదేం కొత్తకాదు. ఇలాంటి రైతన్నల గోడు చూసీచూడనట్లు నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 


ఆ బంగారు తల్లులకు కష్టమొచ్చిందా.. చంద్రబాబు వాళ్లనూ మోసం చేశాడా! పెరుమళ్ల దుర్గ, కోడి మణి, బొంత వరలక్ష్మి అనే అక్కచెల్లెమ్మల ఆవేదన చూశాక నిజంగా ఆశ్చర్యమేసింది. పుట్టిన ప్రతి ఆడపిల్లకూ దశలవారీగా బ్యాంకులో డబ్బు జమ చేసి.. 21 ఏళ్లు వచ్చే నాటికి ఆ మొత్తాన్ని ఇచ్చేలా బంగారుతల్లి పథకం ఉండేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ పథకం పేరు మార్చాడు. అయితే ఏ ఒక్కరికీ ఇప్పటి వరకూ పైసా జమ చేసిన పాపానపోలేదు. ఆ అక్కచెల్లెమ్మలు చెప్పిందీ అదే. ఇంత మోసం ఎక్కడైనా ఉంటుందా అన్నా.. అంటూ ప్రశ్నించారా తల్లులు. అయ్యా చంద్రబాబూ.. ఆ తల్లుల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతావ్‌? బాలికా సంరక్షణ, మహిళా సాధికారత అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పే మీరు.. కొత్తగా ఏదీ చెయ్యకపోగా ఉన్న పథకాలకూ తూట్లు పొడవడం న్యాయమేనా? 

ఉపాధి కరువై, వలసే మార్గమై.. కువైట్‌కు వెళ్లి కష్టాలతో తిరిగొచ్చిన ఆ కల్లుగీత కార్మికుడి కన్నీటి గాథ నన్ను కలచివేసింది. అన్నా.. అంటూ ఆప్యాయంగా వచ్చిన అతను ఎన్నో విషయాలు చెప్పాడు. ఉన్న ఊళ్లో కొబ్బరిచెట్టెక్కి కాయలు కోసి బతికేవాడినన్నా.. ఆ చిన్నపాటి సంపాదన ఇబ్బందిగా ఉంటే.. ఏజెంటు మాటలు నమ్మి కువైట్‌ వెళ్లానని చెప్పాడు. అక్కడ షేక్‌లు నా జీవితంతో ఆడుకున్నారన్నా.. మానవ సంచారమే లేని ఎడారిలో ఖర్జూరం చెట్లెక్కి కాయలు కోసే పని అప్పగించారన్నా.. అని చెప్పాడు. ఒంటెలు తాగే నీళ్లు.. ఎడారిలో బతుకు.. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశానన్నాడు.

పాస్‌పోర్టు వాళ్లే లాగేసుకున్నారట. జీతం ఇవ్వకపోగా.. చిత్రహింసలు పెట్టి నరకం చూపించారని చెప్పాడు. అదృష్టం కలిసొచ్చి తెలిసినవాళ్ల సాయంతో దేశానికి తిరిగొచ్చి బతికిపోయానన్నాడు. ఏళ్ల తరబడి కష్టపడ్డా ఒక్క రూపాయి కూడా లేక.. కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడే పనుంటే ఈ యాతన తప్పేది కదా అన్నా.. అన్నాడు. బతుకుదెరువులేక సొంత ఊరిని, కుటుంబాలను వదిలి వలసబాట పడుతున్న అభాగ్యులు ఓ వైపు.. జీవనోపాధి కోసం దేశంకాని దేశం వెళ్లి నరకయాతన పడుతున్న నిర్భాగ్యులు మరోవైపు.. నిజంగా చాలా బాధేసింది. ఉన్నచోటే ఉపాధి కల్పిస్తే ఎవరు మాత్రం పరాయి ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు? ఈ దిశగా ఈ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించిన పాపానపోలేదు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు.. వేలాది పరిశ్రమలు.. లక్షలాదిమందికి ఉపాధి.. ఇవీ, మీరు రొటీన్‌గా చెప్పే అబద్ధపు మాటలు. ప్రజల్ని మోసపుచ్చడం తప్ప ఉపాధి కల్పనకు చిత్తశుద్ధితో తీసుకున్న చర్య ఒకటైనా ఉందా? ఆఖరికి వలసల నివారణకై ఉద్దేశించిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం వల్ల ఊళ్లకు ఊళ్లు వలసెళ్లిపోవడం వాస్తవం కాదా? నిరుపేదల కడుపు నింపడానికి ఉద్దేశించిన ఆ పథకాన్ని సైతం మీ దోపిడీకి మార్గంగా మార్చడం ధర్మమేనా?
-వైయ‌స్‌ జగన్‌
Back to Top