హామీలన్నీ నెరవేర్చారట.. ఇవ్వాల్సిందేమీ లేదట!

 
28–05–2018, సోమవారం
వీరవాసరం, పశ్చిమగోదావరి జిల్లా

నేనీరోజు భీమవరం దాటి ఉండి నియోజకవర్గంలో అడుగేస్తున్నప్పుడు వీరవాసరంలో సోదరి వెంకటలక్ష్మి చూపించిన అభిమానం కట్టిపడేసింది. నాన్నగారితో పాటు విజయనగరంలో, చెల్లి షర్మిలతో పాటు భీమవరంలోనూ పాదయాత్రలో పాల్గొని ఫొటోలు దిగిందట. ఇప్పుడు నాతోనూ ఫొటో దిగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ‘నా అంత అదృష్టవంతురాలు లేదు’ అంటూ పొంగిపోయింది. విలువకట్టలేని ఆ అభిమానానికి కృతజ్ఞత తప్ప ఏమివ్వగలను? 

వీరవాసరం దగ్గర కొంతమంది అర్చకులు కలిశారు. వేదమంత్రాలు ఉచ్ఛరించే వారి మాటల్లో కలవరం కనిపించింది. కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకన్న సన్నిధి వివాదాస్పదమవడాన్ని నా వద్ద ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో నిజంగా ఇది క్షమించలేని అపచారమే. అధికార పార్టీ నేతల నిర్వాకమే దీనికి కారణమనేది జనాభిప్రాయం. స్వామివారి ఆభరణాలకే రక్షణ లేదనే ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు సరైన సమాధానాలివ్వకపోగా అర్చకుల మధ్యనే విభేదాలు సృష్టించి.. బ్రాహ్మణులను బ్రాహ్మణులతోనే తిట్టించడం దారుణం. ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరపాలన్న అర్చకుల డిమాండ్‌లో అర్థముంది. 


ఈ రోజు కూడా గ్రామగ్రామాన నీళ్లకోసం కన్నీళ్లు పెట్టే అక్కచెల్లెమ్మల ఆవేదన గుండెను పిండేసింది. స్వాతి అనే చెల్లెమ్మ ఓ బాటిల్లో నీళ్లు తెచ్చి చూపించింది. మురికి కాల్వల్లో నీళ్లలా ఉన్నాయి. ఇవి తాగితే రోగాలు రాక.. కిడ్నీలు పాడైపోక మరింకేమవుతుంది.. అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే లక్ష్మీదేవి అనే తల్లి వచ్చి చెప్పిన మాటలు కలచివేశాయి. ఊళ్లోనే బెల్టుషాపు ఉందట. కొడుకు తాగొచ్చి కోడల్ని రోజూ కొడుతున్నాడని కన్నీళ్లు పెట్టింది. నిజంగా నాకు ఆశ్చర్యమేసింది. గుక్కెడు నీళ్లు కావాలని గొంతెండి పల్లెలు ఘోషపెడుతున్నా పట్టించుకోని ఈ పాలకులు.. వద్దు వద్దంటున్నా బెల్టు షాపులు పెట్టిమరీ ప్రజలతో తాగిస్తున్నారు. మురుగు నీళ్లు తాగి ఓ వైపు, మద్యం తాగి మరోవైపు జనం ఆస్పత్రుల పాలవుతున్నా చంద్రబాబు సర్కారు కళ్లు తెరుచుకునిమరీ నిద్ర నటిస్తోంది.


ఒకటా రెండా.. బాబుగారి మోసాలు లెక్కలేనన్ని. ‘రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడు.. బంగారం ఇంటికి తెస్తానన్నాడు.. నాలుగేళ్లయినా మా బంగారం బ్యాంకులోనే ఉందన్నా’ అంటూ దేవి అనే ఓ అక్క, ‘పొదుపు సంఘాల రుణాల మాఫీ అంటూ మోసం చేశాడు’ అని గణేశ్‌లక్ష్మి గ్రూపునకు చెందిన పద్మకుమారి అనే మరో అక్క నన్ను కలిసి ఆక్రోశం వ్యక్తం చేశారు. ఒక్క రాయకుదురు గ్రామంలోనే ఉన్న 40కి పైగా గ్రూపుల వారు ఒక్క రూపాయి కూడా మాఫీకాక నా వద్దకొచ్చి ఘొల్లుమన్నారు. రైతు రుణమాఫీదీ మోసమేనని గోవాడ రాంబాబు అన్నాడు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటూ గాలికెగిరిపోయి.. ఇచ్చే అరకొరా అందక తీవ్ర ఇబ్బందిపడుతున్నానని వీరవెంకటయ్య చెప్పాడు.

ఇంటికో ఉద్యోగమన్నారు.. ఎంబీఏ చదివిన తన కొడుకు ఉద్యోగంలేక, నిరుద్యోగ భృతీరాక ఇంటిపట్టునే ఉన్నాడంది.. విస్సాకోడేరుకు చెందిన భాగ్యలక్ష్మి. ఇళ్లు రాని, పింఛన్‌లు అందని పేదలు.. ఆరోగ్యశ్రీ రాక బిక్కుబిక్కుమనే ప్రాణాలు తారసపడని ఊరే లేదు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరని పరిస్థితి నెలకొని ఉంటే.. ఆయన మాత్రం మహానాడు వేదికగా అబద్ధాలమీద అబద్ధాలు చెబుతున్నాడు.

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడట. ఇవ్వాల్సిందేమీ లేదంటున్నాడు. హామీలిచ్చి మోసం చేసిన ఆయన నైజాన్ని తెలుసుకున్న జనం నిప్పుకణికలవుతుంటే.. లెంపలేసుకోవాల్సిందిపోయి.. తప్పుడు మాటలు చెప్పడం న్యాయమేనా? తప్పుడు పనులపై సమీక్షించుకోవాల్సిన మహానాడులో ప్రజల్ని మళ్లీ ఎలా మోసం చేయాలనే కుయుక్తులుపన్నడం జనానికి తెలియదా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తెలంగాణలో మీ పార్టీ అధికారంలోకి వస్తే 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మంత్రి పదవులిస్తానని తీర్మానం చేశారు. మీ మాటల్లో, చేతల్లో ఇసుమంతైనా నిజాయితీ ఉందా? అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో మాత్రం ఎస్టీలకు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వవు. అధికారంలోకి రానే రాలేమని తెలిసిన పొరుగు రాష్ట్రంలో మాత్రం బీసీలను ముఖ్యమంత్రిని చేస్తానంటావు.. ఎస్టీలకు అధిక సంఖ్యలో మంత్రి పదవులంటావు.. ఇంతకన్నా అవకాశవాదము, మోసమూ ఉంటాయా? తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననడం అంటే ఇదే కదా? 
-వైయ‌స్‌ జగన్‌

 

తాజా ఫోటోలు

Back to Top