బాబూ.. మీ నుంచి ముస్లింల సంక్షేమం ఆశించగలమా?


 
 
25–05–2018, శుక్రవారం
అజ్జమూరు, పశ్చిమ గోదావరి జిల్లా


ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో శుక్రవారం ఆకివీడుకు చెందిన మస్తాన్‌వలి, బాసిత్‌ అనే సోదరులు చెప్పిన మాటలు నాన్నగారి దార్శనికతకు అద్దం పట్టాయి. ‘సార్‌.. మీ నాన్నగారు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నాకున్న నలుగురు బిడ్డల్లో ఇద్దరు డాక్టర్లు అయ్యారు. ఇద్దరు ఇంజనీరింగ్‌ చదివి, ఆ పై పీహెచ్‌డీలు చేసి అమెరికాలో బాగా స్థిరపడ్డారు. ఒక తండ్రికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? ఇదంతా అల్లా దయ, మీ నాన్నగారి చలవే. ముస్లింలెవరైనా ఈ మాసంలో చేతనైనంత మందికి సాయం చేస్తాం.. సాయం చేసినవారిని జీవితాంతం గుర్తు చేసుకుంటాం’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పారు. కాస్త దూరం పోగానే చిన కాపవరం గ్రామం వద్ద చాలామంది ముస్లిం సోదరులు నా కోసం ఎదురుచూస్తూ కనిపించారు. ‘మీ ఆరోగ్యం బాగుండాలి.. పాదయాత్ర దిగ్విజయంగా సాగాలి.. మీ పై అల్లా దయ ఎప్పటికీ ఉండాలని ప్రార్థనలు చేసి వచ్చాం’ అంటూ శాలువా, టోపీతో సత్కరించారు. మనసంతా సంతోషంతో నిండిపోయింది.

నాన్నగారు తన జీవితంలో ముస్లిం సోదరుల కష్టాలు చూశారు. పాదయాత్ర చేసిన రోజుల్లో వారి దుర్భర జీవితాలను మరింత దగ్గరగా వీక్షించారు. సామాజికంగా, ఆర్థికంగా వారి వెనుకబాటుతనం అడుగడుగునా కనిపించాయి. ఏ సైకిల్‌ షాపులో చూసినా, ఏ మెకానిక్‌ షెడ్‌లో చూసినా, హోటళ్లలో, మార్కెట్‌లలో ముస్లిం పిల్లల బాల్యం నలిగిపోవడం గమనించారు. చదువుకోవాలన్న ఆశ ఉన్నా స్థోమత లేక, ఎదగాలన్న తపన ఉన్నా చేయూత లేక వారి జీవితాలు అలా గడిచిపోవాల్సిందేనా? అన్న ఆలోచనలు ఆయనను కదిలించాయి. వారి తలరాతలు మార్చాలన్న తపనతో నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం దానికి తోడైంది. ఆ ఫలాలు అందుకున్న ఎన్నో కుటుంబాలు నన్ను కలసి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటే.. ‘దేవుడిచ్చిన వరం... ఆ తండ్రికి కొడుకుగా పుట్టడమని’ మనసంతా ఉద్వేగభరితమైంది.


నా దగ్గరకు రాగానే ఆ అమ్మాయి కళ్లు మిలమిలా మెరిశాయి ‘అంకుల్‌.. నా పేరు ప్రవల్లిక. ఎనిమిదో తరగతి చదువుతున్నాను. ఊరు నారాయణపురం. అమ్మ రాజేశ్వరి, నాన్న అశోక్‌’ అంటూ గలగలా చెప్పుకొచ్చింది. పక్కనే సంబరంతో మురిసిపోతున్న ఆమె తల్లిని విషయమేమిటని అడిగాను. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న తమకు పుట్టుకతోనే మూగ, చెవుడు బిడ్డ పుడితే విలవిలలాడిపోయామని, జీవితాంతం బిడ్డ బతుకు ఇలాగే ఉండిపోతుందేమోనని దిగులు పడని రోజంటూ లేదని చెప్పింది. ఆశలు వదులుకున్న ఆ పరిస్థితిలో నాన్నగారు ముఖ్యమంత్రి కావడం, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం వారికి వరమైందట. ‘దాదాపు 40 రోజులపాటు ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు, వసతి, భోజనం, మందులతోపాటు దాదాపు పది లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ ఉచితంగా చేయించి, తర్వాత సంవత్సరం పాటు స్పీచ్‌ థెరపీ కూడా ఉచితంగా ఇప్పించి నా బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు వైఎస్సార్‌ గారు. మాటలే రావనుకున్న నా బిడ్డ ఇప్పుడు గలగలా మాట్లాడుతోంది’ అంటూ ఆనందబాష్పాలు రాల్చింది. అదే పాపకు ఈ మధ్యనే ముక్కుకు సంబంధించిన చిన్నపాటి ఆపరేషన్‌ చేయాల్సి వస్తే తొంభై వేలు ఖర్చయిందని నిట్టూర్చింది ఆ తల్లి. ‘మీ నాన్నగారి రోజులు మళ్లీ రావాలి... నువ్వే తీసుకురాగలవన్నా’ అంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. మీ మ్యానిఫెస్టోలో ముస్లిం బాలికలకు కేజీ టు పీజీ ఉచిత విద్య, ముస్లింలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, మదర్సాలలోని విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు, స్కాలర్‌షిప్పులు, ఉచిత దుస్తులు, ఉర్దూ టీచర్‌ పోస్టులకు ఏటా ప్రత్యేక డీఎస్సీ అంటూ హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? ఇది మోసం కాదా? ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని మీకు చిత్తశుద్ధి ఉందని అనుకోగలమా? ఎన్నికలప్పుడు తప్ప ఆ వర్గాలు గుర్తుకురాని మీ నుంచి వారి సంక్షేమం ఆశించగలమా? 
-వైయ‌స్‌ జగన్‌

 


Back to Top