ఓ దేవుడా.. ఆ చిట్టితల్లికి ఇన్ని కష్టాలా!


 
19–05–2018, శనివారం 
వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా 

ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే మెరిసే కళ్లతో నాకేసి చూస్తున్న ఓ చిట్టితల్లి కనిపించింది. పేరు దుర్గాదేవి. తన మావయ్యతో కలిసి వచ్చిన ఆ చిట్టి తల్లి తెల్లవారుజాము నుంచి నా కోసం ఎదురు చూస్తోందట. చిన్నప్పుడు ఆడుకుంటూ కొడవలి తగిలి ఆ పాప కంటికి తీవ్ర గాయం కావడంతో దాన్ని తీసివేయాలని డాక్టర్లు చెబితే మిణుకు మిణుకుమంటున్న ఆశతో హైదరాబాద్‌ వెళ్లారట. అక్కడ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో హతాశులై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తమ స్థానిక ఎమ్మెల్యే సాయంతో నాన్నగారిని కలిశారట. ఎంతో కొంత సాయం అందుతుందనుకున్నారు. ఊహించని రీతిలో నాన్నగారు ఆపరేషన్‌ మొత్తం ఖర్చును ఇవ్వడమే కాకుండా.. తన పర్సనల్‌ అసిస్టెంట్‌ ద్వారా వైద్యం వివరాలను ఎప్పటికప్పుడు కన్నతండ్రిలా తెలుసుకున్నారట. ఆ పాప తండ్రి వికలాంగుడు.. ఓ చిన్న రైతు. ఉన్నది ఒకే ఒక బిడ్డ. ‘ఇంత కష్టమొచ్చిందేమి దేవుడా.. అని నేను తల్లడిల్లిపోతుంటే.. రాజశేఖరరెడ్డిగారు దేవుడిలా సాయం చేశారు. ఆయనకు ఆజన్మాంతం రుణపడిపోయాను’ అని ఆ పాప మామయ్య చెబుతుంటే.. ఆ అమ్మాయి ముఖంలో ఎక్కడలేని సంతోషం కనిపించింది. ‘మా పాపకు కంటిచూపిచ్చిన ఆ దేవుడి కొడుకును చూడాలని వచ్చామయ్యా’ అంటూ తమ కృతజ్ఞతను ప్రకటించారు.  
 
మూడేళ్ల రెహాన్‌ను ఎత్తుకుని వచ్చాడు వాళ్ల నాన్న. పుట్టుకతో మూగ, చెవుడు అయిన వారి బిడ్డను తీసుకుని చిత్తూరు జిల్లా నగరిలో పాదయాత్ర సాగుతున్నప్పుడు నన్ను కలిశాడు. ‘అన్నా.. లక్షలు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేక ఆశలు వదులుకున్న మాకు.. మీరు చేసిన సాయం ఈ జన్మలో మరువలేం. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది’ అని ఆ తండ్రి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ ఇరువురు పిల్లల జీవితాలలో వెలుగులు నిండటం మనసుకెంతో తృప్తినిచ్చింది. రాష్ట్రంలో ఏ చిట్టితల్లి, చిట్టితండ్రి ఇబ్బందులు పడని విధంగా ఆరోగ్యశ్రీని పటిష్టం చేయాలనే నా సంకల్పం మరింత దృఢపడింది.  
 
ఈ రోజు గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాను. మాయ తెలియనివాడు అమాయకుడు.. అలాంటి అమాయకులు సైతం చంద్రబాబు మాయల్ని, మోసాల్ని ఎండగడుతున్నారంటే.. ఎంతగా దారుణ మోసాలకు గురయ్యారో కదా! అమాయక గిరిజనులు నిష్కల్మషంగా చెప్పిన మాటలు, వెలిబుచ్చిన ఆవేదన నన్ను కదిలించాయి. ‘గిరిజనుల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు రాజశేఖరరెడ్డిగారు. ఆయన చేసిన మంచినీ మరువం.. చంద్రబాబు వంచననూ మరువం’ అంటూ ఆ గిరిజన బిడ్డలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తుంటే.. ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంతో వారికి బాబుగారిచ్చిన హామీలన్నీ గుర్తొచ్చాయి. అందరికీ చేసినట్టే.. ఈ అమాయకుల నెత్తినా శఠగోపం పెట్టారు బాబుగారు.  
 


ప్రకాశరావుపాలెం వద్ద రోడ్డు పక్కన మంచంపై పడుకోబెట్టిన ఓ చిట్టితల్లి వద్దకు తీసుకెళ్లింది వాళ్లమ్మ. పదో తరగతి చదువుతున్న లక్ష్మీపద్మకు ఆరు నెలల కిందట రెండు కిడ్నీలు పాడైపోయాయట. ‘అన్నొచ్చాడు చూడమ్మా..’ అంటూ ఆ తల్లి చెబుతున్నా.. కన్నీరు జాలువారుతుండగా కళావిహీనమై, చలనంలేని ఆ కళ్లు ఎటో చూస్తున్నాయి. విషయం తెలిసి గుండె పిండేసినట్లనిపించింది. అధిక రక్తపోటుతో ఆ చిట్టితల్లి కంటిచూపూ పోయిందట. చదువులో మేటిగా ఉండే ఆ బంగారు తల్లి బతుకు చీకటిమయమై పోయింది. చిన్ననాడే తండ్రిని కోల్పోయింది. కుండలు చేసుకునే కులవృత్తి కూడా కష్టమైపోయింది. కనుచూపు కరువై, కిడ్నీలు పాడైన కన్నబిడ్డను వదిలి ఉండలేక.. కూలికి పోలేక.. కుటుంబ పోషణ బరువై, వైద్యం గుదిబండగా> మారి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఓ దేవుడా ఆ చిట్టితల్లికి ఇన్ని కష్టాలా! ఆ కన్న తల్లికి ఇన్ని కన్నీళ్లా! 
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలప్పుడు గిరిజనుల కోసం ఇరవైకి పైగా హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడం ధర్మమేనా? మిగతా అన్ని కులాలనూ, వర్గాలనూ మోసగించిన మీరు.. మాయామర్మం తెలియని అమాయక గిరిజనులనూ మోసం చేస్తారా?
- వైయ‌స్‌ జగన్‌Back to Top