అటువంటి మీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత ఉందా?


18–05–2018, శుక్రవారం
నల్లజర్ల, పశ్చిమగోదావరి జిల్లా

ఈ రోజు పాదయాత్రలో అనారోగ్య బాధితులు అడుగడుగునా కలిశారు. ఆరోగ్యశ్రీ వర్తించక ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకున్నవాళ్లు, అప్పులపాలైన వారు, అప్పుచేసి కొద్దిపాటి వైద్యం చేయించుకుని ఇక సాధ్యంకాక మధ్యలోనే వదిలేసిన వారు, వైద్యం చేయించుకోలేక దేవునిపై భారం వేసి నాటుమందులు మింగుతున్నవారు.. ఇలా ఒక్కొక్కరి బాధ వింటుంటే గుండె బరువెక్కి నట్లనిపించింది. ‘అన్నా.. మా మామకు క్యాన్సర్‌. ఇల్లు తాకట్టుపెట్టి రూ.2 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాం. ఇప్పుడు మళ్లీ చికిత్స చేయించుకునే ధైర్యంలేక దేవుడిపై భారం వేసి బతుకుతున్నాం’ అంటూ జ్యోతి అనే ఓ చెల్లెమ్మ,  ‘అయ్యా.. మా కిడ్నీలు చెడిపోయాయి.

మందులు కొనే పరిస్థితి కూడా లేదు’ అంటూ భూపతిరావు, దుర్గాప్రసాద్‌ అనే అన్నలు తమ కష్టాలు చెప్పుకొచ్చారు. ‘బతుకుదెరువు కోసం కొబ్బరిచెట్టెక్కితే కిందపడి వెన్నెముక విరిగింది. లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైకల్యంతో పాటు అప్పులే మిగిలాయి’ అంటూ తన వ్యథాభరిత జీవితం గురించి వివరించాడు శ్రీనుబాబు అనే అన్న. ‘పక్షవాతం వచ్చి లక్షలు ఖర్చుచేసుకున్నా సరైన ఫలితంలేక 80 శాతం వైకల్యం బారిన పడ్డా.. పింఛన్‌ కూడా రావడం లేదన్నా’ అంటూ ఓ సోదరుడు.. ఇలా బాధాకరమైన విషయాలను వింటుంటే.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మానవత్వం లేని ఈ పాలకుడెంత కఠినాత్ముడో మరోసారి అవగతమైంది. 


మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో భావితరాల బాగు కోసం తవ్వించిన చెరువులు నేడు టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుని.. ఉనికినే కోల్పోయే ప్రమాదకర పరిస్థితుల్లో పడ్డాయి. పాదయాత్రలో ఇసుక, మట్టి అవినీతి గురించి ఫిర్యాదులందని నియోజకవర్గమే లేదంటే అతిశయోక్తి కాదేమో! నిరుపేద దళితుల నుంచి.. దేశం కోసం ప్రాణా లొడ్డి పోరాడి పతకాలు సాధించిన వీరసైనిక కుటుంబాల భూముల వరకు.. ఏవీ కూడా మినహాయింపు కాదు ఈ పచ్చనాయకులకు. దురాక్రమణలకు గురైన నారాయణపురం చెరువు దీన స్థితిని కేసిరెడ్డి కృష్ణ అనే రైతన్న ఫొటోలతో సహా కళ్లకు కట్టినట్టు చూపించాడు.

చెరువు గట్టున 30 ఏళ్లుగా నివశిస్తున్న తమ ఇళ్లను పొక్లెయిన్‌లతో కూల్చేశారంటూ దూబచర్లకు చెందిన అక్కచెల్లెమ్మలు వాపోయారు. ‘మా ఇళ్లను కూల్చేసి.. తెలుగుదేశం వారి ఇళ్ల జోలికి పోకపోవడం అన్యాయం, అక్రమం కాక మరేంటి’ అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ రోజు బాబుగారు నీతి, నిజాయితీల గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఇసుక, మట్టిలో అవినీతే జరగలేదంటూ సవాల్‌ విసురుతున్నారు. 


ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎక్కడిదాకో ఎందుకు? స్వయానా మీ సుపుత్రుడు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దత్తత తీసుకున్న.. మీ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావుగారి స్వగ్రామమైన నిమ్మకూరు చెరువులో జరిగిన అవినీతిని నేనే స్వయంగా వీక్షించాను. పరిస్థితి ఇలా ఉంటే.. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు మీకుందా? 

మా పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా సంతలో పశువుల్లా కొనడమేగాక.. స్పీకర్‌ వ్యవస్థను దిగజార్చి.. వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడటమేగాక.. నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు. మరి మీకు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతికత ఉందా? దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా స్వయంగా సీఎంగా ఉన్న మీరే నల్లధనంతో ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిపో యారు. మూడేళ్లుగా.. ఆ స్వరం మీదా.. కాదా.. కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. తీరా ఆ స్వరం మీదేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌వారు నిర్ధారించాక తేలు కుట్టిన దొంగలా మిన్నకుండి పోయారు. అటువంటి మీకు.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత ఉందా?
-వైయ‌స్‌ జగన్‌


Back to Top