మహానేతకు వైయస్ కుటుంబ‌ సభ్యుల నివాళి

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

2 సెప్టెంబర్ 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి నాలుగ‌వ వర్ధంతి సందర్భంగా‌ సోమవారంనాడు ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అశ్రు నయనాలతో నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి శ్రీమతి విజయమ్మ, కుమార్తె శ్రీమతి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు సోమవారం ఉదయం వైయస్‌ఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మహానేత నాలుగవ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ప్రజల కోసం ప్రతి క్షణమూ పరితపించిన నాయకుడు వైయస్ రాజశేఖ‌రరెడ్డి. ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన కళ్ల ముందు నుంచి ఆయన దూరమయ్యారు. వైయస్‌ఆర్ మన మధ్య నుంచి దూరమై నాలుగేళ్లు అయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలి‌చే ఉన్నారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ లబ్ధి పొందారు. అందుకే ఆయన ప్రజలకు దేవునిగా వారి హృదయాల్లో నిలిచిపోయారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేతకు పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు నివాళులు అర్పించారు. వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి - పార్టీ ‌నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పార్టీ సీనియర్ ‌నాయకుడు కొణతాల రామకృష్ణ రక్తదానం చేశారు. వైయస్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కాగా, ‌శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల ఆదివారం రాత్రికే ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఇడుపులపాయ నుంచి శ్రీమతి షర్మిల తిరుపతి చేరుకుని అక్కడ జరిగే 'సమైక్య శంఖారావం' బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచే ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు.

వైయస్ఆర్ వ‌ర్ధంతిని పురస్కరించుకుని పులివెందుల నియోజకవర్గంలో వైయస్ఆర్ ‌కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమా‌లు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘా‌ట్‌ను ప్రత్యేకంగా అలంకరించటంతో పాటు వచ్చే అభిమానులకు ఇబ్బందులేవీ లేకుండా కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Back to Top