చంద్రబాబు అనుభవమే రాష్ట్రాన్ని ముంచింది

పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదు
వైయస్‌ఆర్‌ సీపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేస్తుంది
టీడీపీ ఎంపీల డ్రామాలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు
గుంటూరు: అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని ముంచేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా గుంటూరులో చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు వైయస్‌ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ స్ఫూర్తితో హోదా సాధన కోసం మొట్టమొదటి సారి కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామని, కేంద్రం మొండి వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు చేశామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలకు హోదా విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. హోదా నినాదాన్ని బలహీనపరిచింది టీడీపీనే అని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనేకసార్లు మాటమార్చాడని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఉందన్న చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎల్లో మీడియాలో అనేక ప్రచారాలు చేసుకున్నారన్నారు. ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందన్న చంద్రబాబు మళ్లీ హోదా కావాలని యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. 

టీడీపీ ఎంపీలు ఢిల్లీలో అనేక డ్రామాలు ఆడుతున్నారని, ఆ బిల్డప్‌లు టీవీ ఛానళ్లకు మాత్రమేనని, ఆఫ్‌ ద రికార్డు టీడీపీ ఎంపీల సంభాషణ ఎంత నీచంగా ఉంటుందో సోషల్‌ మీడియాలో ప్రజలంతా చూశారని వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ పిరికితనం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే హోదా వచ్చేదన్నారు. వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చినప్పుడు స్పందించకుండా డ్రామాలు ఆడితే ఎవరూ నమ్మరన్నారు. 2014లో అనేక హామీలిచ్చి.. అనేక పార్టీలతో పొత్తులుపెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వంలోకి వచ్చారని, సింగిల్‌గా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి బయటకు వచ్చిన తరువాత వైయస్‌ఆర్‌ సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ సింహంలా సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతుందన్నారు. 
Back to Top