వైయ‌స్ అవినాష్‌రెడ్డి గృహ నిర్భందం


వైయ‌స్ఆర్ జిల్లా  : అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేత‌లు అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ రౌడీయిజం చేస్తున్నారు. వైయ‌స్‌ఆర్‌ జిల్లా పులివెందులలో 144 సెక్షన్‌ ఇంకా కొనసాగుతోంది. పులివెందుల అభివృద్ధిపై టీడీపీ నేతల సవాల్‌పై చర్చకు సిద్ధమన్న వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. కాగా లాఠీఛార్జ్‌లో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు కూడా వీలు లేకుండా హౌస్‌ అరెస్ట్‌ చేశారని అవినాష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ తప్పు లేకున్నా ఎంపీని గృహ నిర్బంధం చేయడంపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు అధికారం తమదేనన్న ధీమాతో టీడీపీ నేతలు అమాయకులపై కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు కలిసేందుకు విజయవాడలో మకాం వేశారు.

అసలేం జరిగింది..
పులివెందుల అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సవాల్‌ విసిరి మాటల యుద్ధం మొదలెట్టారు. ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు నేను సిద్ధం. ఎప్పుడు.. ఎక్కడికి పిలిచినా వస్తా’ అంటూ మార్చి 1న ప్రతి సవాల్‌ విసిరారు. పులివెందులలోని పూల అంగళ్ల సర్కిల్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని సతీష్‌రెడ్డి అన్నారు. మళ్లీ శనివారం కడపలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చర్చకైనా.. రచ్చకైనా సిద్ధమంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. 

చర్చకు సహకరించాలని విజ్ఞప్తి 
పులివెందుల రాజకీయం వేడెక్కడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఆదివారం ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఎంపీ అవినాష్‌రెడ్డికి ఇంటికి వెళ్లి.. మీరు బయటికొస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి, బయటకు రావొద్దని అన్నారు. అయితే, తాను ఓల్డ్‌ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాలని చెబుతూ అవినాష్‌రెడ్డి అక్కడికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం పులివెందుల ఏఎస్పీ ఆధ్వర్యంలో మరోసారి అవినాష్‌రెడ్డితో చర్చించారు. అర్థవంతమైన చర్చ జరిగేందుకు సహకరించాలని ఆయన పోలీసులను కోరారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా ఎంపీని అరెస్టు చేసి తరలించేందుకు జీపు వద్దకు తీసుకురాగా.. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ... అందరూ సంయమనం పాటించాలని కోరారు. చట్టాన్ని, పోలీసులను గౌరవించాలని, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉందామని అన్నారు.



Back to Top