అడుగడుగునా బాధితుల ఆక్రందన

నెల్లూరు: ఎడతెరిపి లేని వర్షాలకు సర్వం కోల్పోయి వీధినపడ్డ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి భరోసానిచ్చేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటగిరి, బంగారుపేట, నాయుడుపేటల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళవారం ఉదయం 9.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరదబాధిత ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ బాధితుల కన్నీరు తుడిచారు.

అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసా కల్పించారు. ఆయన వెంకటగిరి పట్టణం పాతకోట వీధి, పోలేరమ్మ ఆలయం మీదుగా రాజావీధి, కైవల్యానది కూడలి, తహశీల్దార్ కార్యాలయం, తూర్పువీధి, పాతబస్టాండ్, పాలకేంద్రం మీదుగా బంగారుపేట బీసీ కాలనీ, బంగారుపేటలో పర్యటించారు. బీసీకాలనీలో భారీగా ప్రవహిస్తున్న వరదనీటిలోనే రెండు గంటలపాటు కలియతిరిగారు. ఇల్లిల్లూ తిరిగి నీటమునిగిన చేనేత మగ్గాలను పరిశీలిస్తూ, కార్మికులను పలుకరించారు.
 
అడుగడుగునా బాధితుల ఆక్రందన
వెంకటగిరి నుంచి సాయంత్రం 4.20కి నాయుడుపేటకు బయలుదేరిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా బాధితులు తాముపడుతున్న బాధలను విన్నవించారు. బీడీ కాలనీలో మోకాలు లోతు బురదలో పర్యటించి బీడీ కార్మికులను పరామర్శించారు. మల్లిక అనే మహిళ భర్త షేక్‌జమీల్ చలిగాలులకు మరణించటంతో ఆమెకు సహాయంగా నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీతో రూ.10 వేల చెక్కును ఇప్పించారు. అనంతరం కొత్తబీడీ కాలనీ, లక్ష్మీఅనంతసాగరం, గోమతి, కోళ్లఫారం సెంటర్‌లలో పలువురు బాధితులను పరామర్శించారు. మీకు అండగా తాను పోరాడతానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం వాకాడు మండలం గొల్లపల్లికి చేరుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top