యువతకు భవిత ప్రత్యేక హోదానే

నరసరావుపేటః యువతకు ఉద్యోగాలతో పాటు మంచి భవిష్యత్‌ కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పకుండా అవసరమని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తేటతెల్లం చేశారు. గుంటూరు సమీపంలోని నల్లబాడులో పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహనరెడ్డి పాల్గొనే యువభేరీ కార్యక్రమానికి గురువారం నాయకులు, కార్యకర్తలతో బయలుదేరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, నూతన పరిశ్రమలు వచ్చే అవకాశం లేదన్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునే వారు హైదరాబాదు, బెంగుళూరు వైపు చూస్తున్నారేకాని ఆంధ్రప్రదేశ్‌వైపు ఎవరూ చూడట్లేదన్నారు. సాప్ట్‌వేర్, ఇతర పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహం చూపింట్లేదన్నారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తిచేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాలకోసం హైదరాబాదు, బెంగుళూరులకు వెళ్ళాల్సివస్తోందన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబుడులు రావాలంటే ప్రత్యేకహోదా అవసరమని, దీనిని సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ప్రత్యేకహోదా ఇచ్చే కేంద్రంలోని ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు తెలియచేస్తుందని గోపిరెడ్డి స్పష్టంచేశారు. వైయస్‌.జగన్‌ యువభేరీకి నరసరావుపేట నుంచి పలు కళాశాలలకు చెందిన  విద్యార్ధులతో 25 బస్సులు, 15కార్లతో బయలుదేరి వెళుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Back to Top