పంచాయతీలు అవసాన దశలో ఉన్నాయంటే కారణం మీరు కాదా?

15–05–2018, 
మంగళవారం
జోగన్నపాలెం క్రాస్, పశ్చిమగోదావరి జిల్లా

ఈ రోజు ఎదురైన ఓ సంఘటన.. బంధుత్వాలు లేకున్నా తమకంటూ ఓ నమ్మకాన్ని కలిగించిన మనిషి పట్ల బంధాలు, అనుబంధాలు ఎంత బలంగా పెనవేసుకుపోతాయో ప్రత్యక్షంగా అనుభవమైంది. ‘అయ్యా.. నా భర్త చావుబతుకుల్లో ఉన్నాడు. మంచినీళ్లు కూడా ముట్టకుండా నువ్వొస్తావని ఎదురుచూస్తున్నాడు’ అంటూ మనుమరాలిని వెంటతీసుకుని ఓ పెద్దమ్మ వచ్చింది. రోడ్డుకు దూరంగా వీధి చివర ఉన్న వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే.. ఎదురుగా గోడ మీద కనిపించిన దృశ్యం కళ్లు విప్పారేలా చేసింది. దేవుళ్ల ఫొటోలతో సమానంగా వాటి మధ్య నాన్నగారి ఫొటోను పెట్టుకున్నారు. తమ గుండెల్లో వారు నాన్నగారికి ఇచ్చిన చోటు మనసును కదిలించింది.

చిక్కిశల్యమై మంచం పట్టిన ఆ ఇంటి పెద్దాయన కఠారి రాములును పరామర్శించాను. నన్ను చూడగానే కదిలిపోయిన ఆ పెద్దయ్య సంతోషంతో చేయి పట్టుకున్నాడు. ఆయనకు నాన్నగారంటే ఎంత ప్రేమంటే.. నాన్నగారి మరణవార్త వినగానే ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మార్పణ చేసుకోవడానికి సైతం సిద్ధమైపోయాడట. అదృష్టవశాత్తు చుట్టుపక్కలవారు చూసి పక్కకు తప్పించి బతికించారట. ‘ఆరోగ్యం బాగోలేక ఆర్నెల్లుగా మంచానికే పరిమితమైన మా మావయ్య ముఖంలో ఈ రోజే ఆనందం చూస్తున్నామన్నా’ అంటూ ఆ ఇంటి కోడలు ఆప్యాయంగా చెప్పినప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. మరణించిన తర్వాత కూడా ఇలాంటి కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోవడంకన్నా సార్థకత ఏముంటుంది! 

‘అన్నా.. మా నాన్నకు 70 ఏళ్లు.. పింఛన్‌ రాలేదంటూ అర్జీ పెట్టుకున్నాను. కొద్ది రోజులకే ఓ ఫోన్‌ వచ్చింది. మీరు పింఛన్‌కు అప్లై చేశారట కదా.. గతంలో ఏ పార్టీకి ఓటేశారు.. అంటూ ఆరా తీశారు. జగనన్నకు అని చెప్పగానే.. వారానికే రేషన్‌కార్డు సైతం తీసేశారు. బతుకు భారంగా ఉంది.. పింఛన్‌ ఇవ్వండి మహా ప్రభో అని మొరపెట్టుకుంటే.. బియ్యం కూడా రాకుండా చేశారు. పంటికి మందు కోసం వెళితే కన్ను పీకేసినట్లైంది మా పరిస్థితి’ అంటూ బావురుమన్నాడు తిరుపతిరావు అనే సోదరుడు.  
 
‘అన్నా.. పేరుకే మేము సర్పంచులం.. కానీ పూర్తిగా ఉత్సవ విగ్రహాలం. చేతిలో ఏ పవరూ లేదు. పనులు చేస్తే బిల్లులూ రావు. ఒక్క పింఛన్‌ కూడా ఇప్పించలేని నిస్సహాయులం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నన్ను కలిసిన సర్పంచులు. ‘ఐదు నెలల నుంచి సిబ్బందికి జీతాల్లేవు. కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాయి మా గ్రామాలు’ అంటూ మైనర్‌ పంచాయతీల దయనీయ స్థితిని కళ్లకు కట్టారు. ఈ పాలనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కొసమెరుపేంటంటే.. ముఖ్యమంత్రిగారి తనయుడు ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారిపోవడం.

రెండేళ్ల చంటిపాపను చంకనేసుకుని, ఆడబిడ్డను కాపాడండి.. అంటూ రాసిన ప్లకార్డు పట్టుకుని వచ్చింది.. పరంజ్యోతి అనే చెల్లెమ్మ. నేటి పాలనలో ఆడబిడ్డ తల్లుల అభద్రతాభావానికి, ఆందోళనకు అద్దంపడుతుందీ సన్నివేశం. 
 ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేస్తామంటూ మేనిఫెస్టోలో గొప్పగా చెప్పారు. పంచాయతీల కాలపరిమితి ముగియనున్న ఈ దశలో కూడా సిబ్బందికి జీతాలు చెల్లించలేని, కరెంటు బిల్లులు కూడా కట్టలేని అవసాన దశలో ఉన్నాయంటే.. కారణం మీరు కాదా? రాజ్యాంగపరమైన అధికారాలను బదలాయిస్తామంటూ హామీ ఇచ్చి.. రాజ్యాంగేతర శక్తులైన జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడం ద్రోహం కాదా?
- వైఎస్‌ జగన్‌

Back to Top