యువత రాజకీయాల్లోకి రావాలి

చిత్తూరు: యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా  అవినీతి, అసమర్థ రాజకీయాలను ప్రక్షాళన చేసే వీలుంటుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం స్థానిక  చౌడేశ్వరీ కల్యాణమండపంలో శ్రీనివాస డిగ్రీ కళాశాల 15వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన, ఎమ్మెల్యే దేశాయ్‌తిప్పారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలలోని జ్ఞానం మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలన్నారు. మదనపల్లెకు విద్యారంగంలో ఎనలేని ఖ్యాతి ఉందని, విదేశాల్లో సైతం పేరుమోసిన అనేక పదవుల్లో ఇక్కడివారే ఉండటం గర్వకారణమన్నారు. విద్యార్థి దశలో కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకుని, నచ్చిన పని మాత్రమే చేయండని సూచించారు.  ఉన్నతచదువులు చదివి అమెరికా మోజులో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా, వారిని బాధ్యతగా చూసుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ విషయంలో తన చిన్నాన్న పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనకు ఆదర్శమని, ఆయన చూపిన తెగువ, ధైర్యం,ఆత్మవిశ్వాసంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు.  


ఎమ్మెల్యే డా.దేశాయ్‌తిప్పారెడ్డి మాట్లాడుతూ నేటి తరం ఆధునికత మోజులో పెడదారి పట్టకుండా, మంచి అలవాట్లతో సమాజాభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా అవసరమని, పట్టుదలతో చదివి, క్రీడల్లోనూ మంచి ప్రతిభ కనపరిచి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మలచుకుని నిరంతర అన్వేషిగా ఉండాలన్నారు. ప్రత్యేకహోదా సాధనకు పోరాడుతున్న పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. తంబళ్లపల్లె వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ పెద్దలను, గురువులను గౌరవిస్తూ బంగారు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గ్రహించి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని చెప్పారు. అనంతరం చదువు, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమొంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ వీసీ అరుణాచలం, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు రంగనాథ గుప్తా, కళాశాల చైర్మన్‌ కృష్ణారెడ్డి,  పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్‌జాన్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భవానీప్రసాద్, కౌన్సిలర్లు జింకావెంకటాచలపతి, మస్తాన్‌రెడ్డి, ఖాజా, బాలగంగాధరరెడ్డి, ఎస్‌.ఏ.కరీముల్లా, కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసులురెడ్డి, ప్రిన్సిపాల్‌ గోపాల్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.   
Back to Top