- కార్యకర్తలకు అండగా ఎంతదూరమైనా వెళ్తా..
- ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో వైయస్‌ఆర్ సీపీలో భారీ చేరికలు
నెల్లూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం 53, 54 డివిజన్లకు చెందిన యువత ఎమ్మెల్యే అనిల్ కుమార్ సమక్షంలో వైయస్‌ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2014 ఎలక్షన్స్‌లలో ఈ రెండు డివిజన్ల నుంచి ఎంపీకి 6,500, ఎమ్మెల్యేకు 3,650 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. అనిల్ కుమార్‌కు దూకుడు ఎక్కవ అని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, నేనేమీ కమీషన్ల కోసం.. వాటాల కోసం వాగ్వాదానికి దిగడం లేదని, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసమే పోరాడుతున్నానని స్పష్టం చేశారు. తనను నమ్మి సీటు ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌కు, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు రుణపడివుంటానని చెప్పారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి ప్రజలకు, పార్టీకి వెన్నుపోటు పొడిచే రకం కాదన్నారు. నెల్లూరు కాల్వగట్ల మీదున్న 5 వేలమంది పేద ప్రజల ఇళ్లు కూల్చేస్తామని మంత్రి అంటే నీ కాలేజీ పక్కనున్న కాల్వలను తొలగించి వారి ఇంటి మీదకు రావాలని గొడవ పెట్టుకున్నానని అన్నారు. పార్టీని నమ్మిన కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలో చేరిన వారిలో అర్షద్, బాబు, మదార్, ఎస్‌కే బాబు, ముజీర్, షమీమ్, ఖాదర్‌బాషా, ఖరీముల్లా, సాదిక్, సాబులు, ఖాసిం, రఫీ, దిలీప్ తదితరులు ఉన్నారు.