గతాన్ని పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి

హైదరాబాద్ 30 2013:

తాను జైలులో 16 నెలలు ఉన్నా డీల్ కుదిరిందని విమర్శించడం తనకు బాధ కలిగిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన లోటస్ పాండ్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బెయిలు కోసం నేను రెండు సార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించానన్నారు. తొలుత హైకోర్టు 6నెలలు సీబీఐకి గడువిచ్చింది. అది చాల ఎక్కువనీ, గడువును తొలగించమనీ మా న్యాయవాదులు కోరారు. అప్పటికి చార్జి షీటు కూడా వేయలేదు. సుప్రీం కోర్టుకు వెళ్ళాం. అక్కడ నాలుగు నెలల గడువు విధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ కూడా పాటించాల్సిందే. ఆ మేరకు దర్యాప్తు పూర్తి చేసి, చార్జి షీటు దాఖలు చేశారు. దరఖాస్తు చేసుకుంటే బెయిలు ఇచ్చారు. ఇందులో డీల్ ఏముంటుంది అని శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను జైలులో ఉన్న సమయంలో తనపైనా, తన కుటుంబంపైనా ఆప్యాయతానురాగాలు చూపిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని శ్రీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రావు తనపై పిటిషన్ వేస్తే... టీడీపీ నేతలు అందులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. వారిద్దరి పిటిషన్లు పరిశీలిస్తే కామాలు, ఫుల్ స్టాపులు కూడా మారకుండా ఉన్న విషయం తెలుస్తుందన్నారు. కేవలం 14రోజుల్లో తన నివాసంపై సీబీఐ దాడులు చేసిందన్నారు. తన కేసులో ప్రభుత్వం కావాలనే కోర్టులో ప్రతిస్పందించలేదని తెలిపారు. ఒకటి నుంచి 12 వరకూ ఉన్న ప్రతివాదులు కోర్టుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని ప్రశ్నించారు.

రాజీనామా చేయరు కానీ సమావేశాల్లో పాల్గొంటారు
చంద్రబాబు సమైక్యానికి మద్దతుగా రాజీనామా చేయరు కానీ నిస్సిగ్గుగా జేఏసీ సమావేశాలలో పాల్గొంటారని ఆయన ఎద్దేవా చేశారు. హోంమంత్రికి తాము ఇచ్చిన లేఖను ఒక్కసారి చూడండి.. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో కోరిన విషయం తెలుస్తుందని తెలిపారు. అందరికీ ఆమోదనీయ పరిష్కారాన్ని చూపాలని ఆ లేఖలో కోరామని చెప్పారు. ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

అందరి అభివృద్ది నా ఆకాంక్ష
'తెలంగాణలోని ప్రతి ఒక్క సోదరుడికి నేను చెబుతున్నా ప్రతి ఒక్కరినీ అభివృద్ధి పథం వైపు తీసుకెడతానని' శ్రీ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 16 నెలలుగా కాంగ్రెస్, టీడీపీల అబద్ధాలు చూసి, చూసి నా ఆవేదనను మీతో పంచుకుంటున్నానని తెలిపారు. వైయస్ఆర్ సీపీ ప్లీనరీలో తీర్మానాన్ని ఒకసారి పరిశీలించాలని కోరుతున్నానన్నారు. నాకు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అన్నీ సమానమేననీ, తనకు అందరూ కావాలనీ చెప్పారు.

Back to Top