సాగునీటి ప్రాజెక్టులను విస్మరించారు

 
– ప్రాజెక్టు నిధులకు ..వ్యయాలకు పొంతన లేకుండా పోతోంది
– ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దోచుకునేందుకు తాజాగా జీవోలు
హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోవడం లేదని రాప్తాడు నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు దాదాపు 80 శాతం పనులు పూర్తి అయితే చంద్రబాబు ఈ నాలుగేళ్లలో అదనంగా మరో ఏడు శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.11,500 కోట్ల అంచనాలతో రూపొందిస్తే...ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు కాల వ్యవధి పడుతుందన్నారు. అదనంగా ఎత్తిపోతల పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం జిల్లాకు 23 టీఎంసీలతో 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. డిస్ట్రీబ్యూటరీ పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. 2015 నుంచి హంద్రీనీవాకు 15 టీఎంసీల నీరు వస్తుందన్నారు. నీరు సమృద్ధిగా జిల్లాకు తీసుకురావాలంటే కాల్వ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం గతేడాది రూ.1300 కోట్లతో టెండర్లు పిలిచినా కూడా..ఆ పనులు కూడా నత్తనడకనా సాగుతున్నాయన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాకు 32 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. పూడిక కారణంగా కర్ణాటక ప్రభుత్వం పది టీఎంసీల నీరు ఇవ్వలేకపోతుందని, మనకు రావాల్సిన 22 టీఎంసీల్లో కూడా కోత విధిస్తూ 10 టీఎంసీలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మరో 45 టీఎంసీలు వస్తే గానీ జిల్లాలో 7.50 లక్షల ఆయకట్టును స్థిరీకరించే వీలు ఉండదన్నారు. అదనపు నీరు తీసుకువచ్చే ప్రయత్నాలు చంద్రబాబు చేయకుండా..ఉన్న ప్రాజెక్టులపై ఆధారపడటం సరికాదన్నారు. రూ.1400 కోట్ల అంచనాలు పెంచుకొని ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  రూపాయి ఖర్చు లేకుండా పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇవ్వవచ్చు అని ఎంతో మంది సీఎంకు లేఖలు రాశారన్నారు. అయితే వీరి ప్రతిపాదనలు బుట్టదాఖలు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు భారీగా నిధులు దోచుకునేందుకు నిన్న జీవోను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.



 
Back to Top