అనంతలో అరాచకం

  • బరితెగించిన మంత్రి సునీత
  • కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ
  • వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలపై టీడీపీ నేతల దాడి
  • గాయపడ్డ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు గంగమ్మ
  • ఎంపీపీ ఉపఎన్నికను రద్దు చేయాలి
  • కోర్టులో న్యాయపోరాటం చేస్తాంః వైయస్సార్సీపీ నేతలు
అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నేతలు ధౌర్జన్యానికి పాల్పడ్డారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి మద్దతిస్తూ  చేయి ఎత్తాలని వైయస్‌ఆర్‌సీపీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు గంగమ్మ చీర కొంగు పట్టి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్రగాయమైంది. అలాగే మరో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను భయాందోళనకు గురి చేయడంతో వారు బెదిరిపోయారు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే మహిళా ప్రతినిధులపై దాడికి పాల్పడినా ఆమె చూస్తు ఉరుకున్నారు. పైగా ఒక్కో సభ్యురాలితో చెవిలో రహస్యంగా మాట్లాడి ప్రలోభాలకు గురి చేశారు. ఇదేంటని సునీతను ప్రశ్నిస్తే..రాజకీయం అంటే ఇదేనమ్మా అని సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్య. టీడీపీ ఎంపీపీ అభ్యర్థిని ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా దూషించింది. మండల పరిషత్‌ కార్యాలయంలో లోపల సీఐ, ఆర్‌డీవో, ఇతర అధికారులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అసలు ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తకపోయినా, సంతకాలు చేయకపోయినా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యంగా, ఏకపక్షంగా ఉప ఎన్నిక నిర్వహించుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులను రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యాలయ ఆవరణలోనే 400 మంది టీడీపీ కార్యకర్తలకు అనుమతించారు. ఇలా మంత్రి సునీత అనంతపురం జిల్లాలో అరాచకాలు సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 
–––––––––––––––––
ఏకపక్షమని ప్రకటించడం దారుణం
 అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక టీడీపీ నేతలు ఏకపక్షంగా నిర్వహించుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ ఉప ఎన్నికపై తమకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని, వాటన్నింటిని కూడా ఇవాళ నిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఏకంగా మంత్రి పరిటాల సునీత ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారని, కూర్చీలు విరుగగొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా సీఐ, ఆర్‌డీవో పట్టించుకోకుండా, సభ్యులు సంతకాలు చేయకపోయినా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని ప్రకటించడం దారుణమన్నారు. 
––––––––––––––––
పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
అనంతపురం : కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక తీరు చూశాక పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థ మీద తాము నమ్మకం ఉంచి.. ఇక్కడ ఏదో జరుగుతోందన్న విషయాన్ని డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్‌కు ముందుగానే చెప్పామని ఆయన అన్నారు. కానీ అసలు ఎన్నిక అన్నది జరగకుండానే ఆర్డీవో డిక్లరేషన్‌ ఇచ్చేశారని.. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంపీపీ ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని.. వాళ్లు తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యం చేశారని అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఉన్న ఎంపీటీసీ సభ్యులు బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ కొట్టారని చెప్పారు. సాక్షాత్తు సీఐ కూడా లోపలే ఉండి దౌర్జన్యం చేశారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తమ జీపు ఎక్కేందుకు వస్తున్నా కూడా పోలీసులు వాళ్లను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైయస్‌ఆర్‌సీపీ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతిచ్చిందని, కానీ మంత్రి పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టి, బలవంతంగా నెరవేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు.
–––––––––––––––
న్యాయపోరాటం చేస్తాం
వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ
కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక జరిగిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. టీడీపీకి మెజారిటీ లేకపోయినా ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టడం తప్పు అన్నారు. ఏకంగా మంత్రి పరిటాల సునీత దగ్గరుండి మరీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం దుర్మార్గమన్నారు. ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ బీసీ అభ్యర్థిని ఎంపీపీగా నిలబెడితే... అగ్రవర్ణాల అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించి, అడ్డదారిలో గెలిపించుకుందని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామని శంకర్‌ నారాయణ తెలిపారు.

Back to Top