రాజధాని భూములపై పచ్చ రాబందులు

*పేదల పొట్టగొడుతున్న ప్రభుత్వం
‍‍*బాబు నాయకత్వంలో యథేశ్చగా తమ్ముళ్ల భూదందా
*సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులతో పచ్చనేతల కుమ్మక్కు
*రైతుల నుంచి సేకరించిన పొలాలు కైంకర్యం
*భూమిని తక్కువగా చూపి రిజిస్ట్రేషన్లు 
*కుంభకోణాల ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం
 
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి సేకరించిన భూముల్లో ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరో కుంభకోణం వెలుగుచూసింది. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. రైతులను నయానో బయానో బెదిరించి సేకరించిన భూములను టీడీపీ నాయకులు ముక్కలు చేసి పంచుకోవడం ప్రాంరంభించారు. సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రైతుల భూములను అడ్డదారిలో మింగేసేందుకు పథక రచన చేసి అడ్డంగా దొరికిపోయారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా కాయకష్టం చేసి కడుపు నింపుకుంటున్న రైతులను దోచుకుని రోడ్డున పడేస్తున్నారు. 

రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు కుమ్మక్కై
రాజధాని నిర్మాణం ముసుగులో  రైతుల భూములు స్వాహా చేసేందుకు రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు తెలుగు తమ్ముళ్లతో చేతులు కలిపారు. అన్నం పెట్టే రైతన్న కడుపుకొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరూ కలిసి రైతన్న నడ్డి విరగొట్టారు.   ఓట్లేసి గెలిపించిన పాపానికి తమను నిండాముంచారని భూములు కోల్పోయిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసమని భూములిస్తే మా భూముల్నే ముక్కలు చేసి వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారని వాపోతున్నారు. సచివాలయం  నిర్మిస్తున్న అనంతవరం గ్రామంలో చిన్న సన్నకారు రైతుల నుంచి మొత్తం 2,523 ఎకరాల పొలం సేకరించారు. దీనిపై సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు కన్నేశారు. రైతుల నుంచి సేకరించిన భూములను తక్కువగా చూపించి తమకు నచ్చిన వారి పేరు మీదకు మార్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఉదా.. సుంకర విజయకుమారి అనే మహిళల నుంచి అనంతవరం గ్రామంలో 2 ఎకరాల 28సెంట్ల భూమిని సేకరించారు. దానికి సంబంధించి ఆమె వద్ద పట్టాదారు పాసు పుస్తకం కూడా ఉంది. సీఆర్‌డీఏ వద్ద ఉన్న రికార్డుల్లోనూ 2.28ఎకరాల భూమి ఉన్నట్లు ఉంది. అయితే 2.24 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు రికార్డులు సృష్టించి సంతకం తీసుకున్నారు. మిగలిని నాలుగు సెంట్ల భూమిని ఇతరుల పేరుతో నమోదు చేసి మోసం చేశారు. దీనిపై పలుమార్లు ఆమె అధికారులను కలిసినా ఫలితం లేదని వాపోయింది. ఇలాంటి ఉదంతాలు అనంతవరం ప్రాంతంలో చాలానే ఉన్నాయి. 


అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే...
ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి భూములు లాక్కుని పెట్టుబడి దారులకు దారాదత్తం చేస్తుంటే.... అధికార పార్టీ అనుయాయులు మాత్రం పేదల భూములు, ప్రభుత్వ స్థలాలు ఫలహారం చేస్తున్నారు. రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న భూ కబ్జాలు చూస్తే రాష్ట్రంలో భూ మాఫియా ఎంత పకడ్బందీగా పనిచేస్తోందో తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి అధికార పీఠానికి అల్లంత దూరంలో జరుగుతున్న ఈ భూ కబ్జాల గురించిన వార్తలు వరుసగా పత్రికల్లో వస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం కుక్కిన పేనులా కిమ్మనకుండా ఉండడానికి కారణం ఈ దందాలు చేస్తున్నదీ, చేయిస్తున్నదీ బాబు, ఆయన తాబేదారులే.  

రాజధాని పరిధిలోని దొండపాడు గ్రామంలో దాదాపు పదికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పక్కా ప్రణాళికతో బొక్కేయడానికి చేసిన ప్రయత్నాలను పక్కా ఆధారాలతో పత్రికలు ప్రచురించాయి. గ్రామ అడంగల్‌లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్న 6.24 ఎకరాల భూమిని ప్రయివేటు వ్యక్తులు పూలింగ్‌లో ప్రభుత్వానికి దాఖలు చేస్తున్నట్లు చేసిన ప్రయత్నం అధికారులకు తెలియకుండా జరిగేది కాదు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా తన డాష్‌ బోర్డు మీద ప్రత్యక్షమవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రికి ఇంత పక్కా ఆధారాలతో వెలువడిన భూ దందా గురించి తెలియలేదనుకోవడం అవివేకమే. రాజధాని గ్రామాల్లోని ఉద్దందరాయునిపాలెంలో ఏకంగా 300 ఎకరాల విలువైన లంక భూమిని ఆక్రమించుకోడానికి కబ్జారాయుళ్లు పక్కా పథకం వేసి రాత్రికి రాత్రి కబ్జా భూమిలో కొబ్బరి మొక్కలు నాటారు. ఆక్రమించుకున్న స్థలానికి డాబర్‌మెన్‌ కుక్కలను కాపాలా పెట్టారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని కబ్జాచేయబూనుకున్న దందారాయుళ్లను ప్రశ్నించిన దళితులపై కారుకూతలకు దిగారు. విషయం బయటకు వస్తే చంపేస్తామని బెదిరించే వరకు భూ బకాసురులు వెళ్లారంటే వారి వెనుక రాజకీయ అండదండలు లేవని చెప్పలేం. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉన్న సీఆర్‌డీఏ పరిధిలోనే ఇటువంటి భూ కబ్జాలు జరుగుతున్నాయంటే అవినీతి ఏ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదేమి రాజ్యం...దోపిడీ రాజ్యం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో ఒక్క ఎకరం భూమి కూడా పేదలకు పంచలేదు. కానీ రైతుల నుండి వేలాది ఎకరాలు అక్రమ పద్ధతుల్లో సేకరించి ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు రైతులనుండి బలవంతంగా సేకరించారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చెబుతున్న చంద్రబాబు అనేక గ్రామాల్లో భూములు ఇవ్వకుండా నిరాకరించిన వారి గురించి మాటమాత్రం చెప్పడం లేదు. తీరా భూములిచ్చిన రైతులను కూడా అనేక విధాలా వంచనలకు గురిచేస్తున్న వైనం, దానికి రైతులు ఎదురుతిరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అనేక గ్రామాల్లో భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి అధికారులే బలవంతంగా బుల్డోజర్లు పంపి పంటలు నాశనం చేస్తున్నారు. రైతులను బెదిరిస్తున్నారు. విద్యుత్‌ వగైరా సదుపాయాలు లేకుండా చేస్తున్నారు. రైతులు భూములు ఇవ్వడం, ప్రభుత్వం తీసుకోవడం అంతా స్వచ్ఛందంగా జరిగితే వారిపై ఈ దౌర్జన్యాలు, బెదిరింపులు దేనికి? రాజధానిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చనేతలు రైతులను భయపెట్టి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ఎదురు తిరిగినవారిపై అక్రమకేసులు, అరెస్ట్ లతో అరాచక పాలన సాగిస్తున్నారు. 

పచ్చతమ్ముళ్ల దౌర్జన్యకాండ
కాకులను కొట్టి గద్దలకు పెట్టే చంద్రబాబు విధానాలనే కింది స్థాయి క్యాడర్‌ ఒంటబట్టించుకున్నది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వ భూములు, పేదల భూములు రకరకాల పద్ధతుల్లో లాక్కునే పథకాలు రచిస్తున్నారు. రాజధాని లంకల్లో ’అంతర్జాతీయ స్ధాయి’లో టూరిజం రీసార్టులు నిర్మించదలచుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో విలువైన లంక భూములను ప్రభుత్వం ప్రయివేటు పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయదలుచుకున్నది. అందుకని ముందుగా ఈ భూములపై ఎప్పటినుండో పండించుకుంటున్న దళితులను అక్కడి నుండి తరిమేయడానికి పరోక్ష పద్ధతుల్లో ప్రభుత్వమే  దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో భూ దందాల ఘటనలు ఇంకా అనేకం బయటకొస్తున్నాయి. రాజధానిలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం జోక్యం చేసుకొని విచారణ జరిపించాలి. దోపిడీదారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు రక్షించాలి.  పేదల భూములు వారికే చెందేట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

Back to Top