'యానాం గుండెల్లో చిరంజీవిగా మహానేత వైయస్‌'

గన్నవరం (కృష్ణాజిల్లా) : యానాం ప్రజల గుండెల్లో మహానేత వైయస్‌ రాజశేఖరెడ్డి చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. యానాం అభివృద్ధిలో ఆయన సహకారాన్ని తాము ఎప్పుడూ మరిచిపోలేమన్నారు. యానాంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం తాము అడిగిన వెంటనే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజమండ్రి నుంచి పైప్‌లైన్‌ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.‌ ఈ పైప్‌లైన్‌ పూర్తయితే వచ్చే వందేళ్ళ వరకూ తమకు తాగునీటి సమస్య ఉండబోదన్న ధీమాను వ్యక్తం చేశారు. పైప్‌లైన్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు 55 ఎకరాల స్థలాన్ని కూడా వైయస్‌ కేటాయించారని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి యానాం నుంచి పాదయాత్రగా వెళుతున్న కృష్ణారావు బుధవారం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో ఆయన మాట్లాడారు.

పాండిచ్చేరి ప్రభుత్వం కేటాయించిన రూ.46.86 కోట్లతో ఈ పైప్‌లైన్ నిర్మాణం జరుగుతుందని మల్లాడి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొత్తగా రూ.9.34 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బొటానికల్ గార్డె‌న్‌కు వైయస్ పేరు‌ పెడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రలో కంటే ముందుగా యానాంలో నిలువెత్తు వైయస్‌ఆర్ విగ్రహంతో పాటు అంతర్జాతీయ ఇండో‌ర్ స్టేడియం నిర్మించామని గుర్తుచేశారు.
Back to Top