కేటాయింపులపై స్పష్టత లేకుండానే విభజనా!

ఇచ్చాపురం 04 ఆగస్టు 2013:

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను విజయవంతంగా ముగిసేలా సహకరించినందకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగింపు వేదికపై ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓ దశలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమకు సహకరించిన ప్రజల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆమె పేర్కొన్నారు.  రాజన్న కుటుంబానికి రాష్ట్రంతో ఉన్న అనుబంధం ఎంతో  గొప్పదన్నారు. రాజన్న ఓ మాట చెప్పేవారని ఇలా తెలిపారు. 'కష్టాల్లో మీ వెంట ఉంటానంటూ భరోసా కల్పించి ఏం చేసినా పేదలు బాగా గుర్తుపెట్టుకుంటారు.' ప్రస్తుతం మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్న తీరే దానికి ఉదాహరణని తెలిపారు. రాజన్న కుటుంబంపై మీ ప్రేమకు  సంకేతమన్నారు. షర్మిల రికార్డులకోసం పాదయాత్ర చేయలేదనీ, ప్రజల కష్టాలను విని భరోసా కల్పించడానికే ఈ సాహసానికి పూనుకుందనీ ఆమె వివరించారు.  రాజన్న రాజ్యంలో మంచి జరుగుతుందని చెప్పడమే దీని ఉద్దేశమన్నారు. అలాగే కుమ్మక్కు రాజకీయాలతో కాంగ్రెస్, టీడీపీల కుట్రను వెల్లడి చేయడం కూడా దీని లక్ష్యమని చెప్పారు.

గద్గదమైన విజయమ్మ స్వరం

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తున్నప్పుడు శ్రీమతి విజయమ్మ స్వరం గద్గదమైంది. కన్నీటిని అదుపుచేసుకోలేకపోయారు. తన కుమారుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన  పరిస్థితుల్లో బెయిలు రాని తరుణంలో ఏం చేయాలో తెలియక అన్న చేపట్టాల్సిన పాదయాత్ర తాను చేస్తానని షర్మిలమ్మ ముందుకొచ్చింది.  రాజన్న మన మధ్యలో లేరు. బిడ్డ జైలులో ఉన్నారు.  పాదయాత్రకు పంపిస్తున్న తన కుమార్తెను ఆదరించమని చెబుతూ మీ చేతుల్లో పెట్టానని అన్నప్పుడు శ్రీమతి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తన కుమార్తె షర్మిలను ఎంతో అపురూపంగా చూసుకునేవరు. అలాంటి బిడ్డ అన్న ఆశయం కోసం, కాంగ్రెస్, టీడీపీల దుర్మార్గాలను దునుమాడడం కోసం ఆమె ఎండలో, వానలో, చలిలో ఏదీ లెక్కచేయకుండా నడిచిందన్నారు.  రంగారెడ్డి జిల్లాలో మోకాలికి అయిన గాయాన్ని సైతం పార్టీలు రాజకీయం చేశారని ఆరోపించారు. త్వరగా కోలుకోవడం కోసం శ్రీమతి షర్మిల రోజుకు ఆరేడు గంటలపాటు ఫిజియోథెరపీ చేసింది... ఇది చేసి చాలా కష్టమనిపించిందన్నారు. మీ ప్రేమాభిమానాల సాక్షిగా ఆమెను మళ్ళీ పాదయాత్రకు పంపానని తెలిపారు. శ్రీమతి షర్మిల తన యాత్రలో ప్రజలను ఓదారుస్తూ భరోసా కల్పించడమే కాక.. తనకు తోచిన సాయాన్ని అందించారు.  నీటి ప్రాజెక్టులను చూసినప్పుడు బిడ్డ తండ్రి గుర్తుకొచ్చి ఉద్వేగానికి లోనయ్యిందన్నారు. రాజన్న  జ్ఞపకాలు ఆమెను కన్నీటి పర్యంతం చేశాయని చెప్పారు. ప్రజలందరితో ఆమె మమేకమైందన్నారు. పరిణతి చెందిన  మాదిరిగా శ్రీమతి షర్మిల మాట్లాడుతుంటే.... ఒకవైపు సంతోషం మరోవైపు బాధ కలిగాయి. ఎంతో మంచి బిడ్డల్ని కన్నావని ప్రజలు తనతో అన్నప్పుడు కళ్ళనీళ్ళొచ్చాయన్నారు. ఆ సమయంలో వారే ధైర్యం చెప్పేవారన్నారు.  రానున్న రోజుల్లో జగన్ సీఎం అవుతారని చెప్పినప్పుడు కళ్ళనీళ్ళొచ్చేవన్నారు.

రాష్ట్ర గతిని మార్చిన పదం వైయస్..
ఇచ్చాపురం పేరు వినగానే మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన  ప్రజా ప్రస్థానం గుర్తుకొస్తుందనీ, వారంరోజులుగా అవే ఆలోచనలు చుట్టుముట్టాయనీ శ్రీమతి విజయమ్మ తెలిపారు. రాజన్న ముఖ్యమంత్రయిన తర్వాత సీఎం అయిన తర్వాత అన్ని సమస్యలకూ పరిష్కారం చూపారన్నిరు.  వైయస్ అనే పదం రాష్ట్ర గతినే మార్చిందని చెప్పారు. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిందన్నారు. ఆయన చేపట్టిన పథకాలు రైతులు గర్వంగా తలెత్తుకునేలా చేశాయన్నారు. రైతులు, తదితరులను రుణ విముక్తుల్ని చేసింది. లక్షలాది మందికి ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ఆదుకున్నాయన్నారు. పావలా వడ్డీ ఆడబిడ్డలకు వరమైంది. ఫీజు రీయింబర్సుమెంటూ అంతేనన్నారు.  రాజన్న మరణం తర్వాత పన్నుల భారం ప్రారంభమైందన్నారు. అక్రమంగా జైల్లో పెట్టడంతో జగన్ బదులు షర్మిల పాదయాత్ర చేపట్టిందన్నారు.  ఏ జైలు గోడలూ మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డిగారిని చేరకుండా ఆపలేవని స్పష్టంచేశారు. వారు చేయాలనుకున్న సేవలను నిలపలేవన్నారు. శ్రీమతి షర్మిలను ఆంధ్ర ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాలకు తెలిసేలా చేసిందన్నారు. ప్రజలను ఏకం చేసిందన్నారు. జగన్ బాబు బయటకు రాకుండా కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుట్రలనూ,  సీబీఐ నిర్వాకాలను యాత్రలో శ్రీమతి షర్మిల విజయవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఈ అన్యాయాలన్నింటికీ ఇచ్చాపురం సాక్షిగా ప్రజలు సమాధానం చెప్పాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షాన్ని తరిమికొట్టాలని కోరారు. జగన్ బాబు వల్లనే రాజన్న రాజ్యం సాధ్యమని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి ఇచ్చిన మద్దతుకు ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమాభిమానాల వల్లే మా కుటుంబం మీ ముందు నిలబడిందన్నారు. తాము ఫలానా మంచి ప్రజలకు చేశామని చెప్పలేని పరిస్థితిలో  పార్టీలున్నాయని ఎద్దేవా చేశారు. నాయకుల పరిస్థితీ అంతేనన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మాత్రం 'చెప్పిందీ చేశాం..చెప్పనివీ చేశాం' అంటూ 2009 ఎన్నికల్లో ప్రజల  ముందుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీరు, అందరికీ తాగునీరు అందేందుకు కృషిచేశారన్నారు. రాష్ట్రంలో  కరెంటు ఉత్పత్తికి పవర్ ప్రాజెక్టులు చేపట్టారనీ, అన్ని వర్గాల ప్రజలూ ఎదగాలనీ  కోరుకున్నారన్నారు.

అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెంది ఉంటే విభజించినా బాధ పడదు
అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఎవరూ బాధపడి ఉండేవారు కాదని శ్రీమతి విజయమ్మ చెప్పారు. కేవలం హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ఇంతవరకూ తమ పార్టీ  కేంద్ర హోం మంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్షంలో మాత్రమే తమ పార్టీ పాల్గొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  విభజించే అధికారమున్న కాంగ్రెస్ అందరితో మాట్లాడి తెలంగాణ ప్రకటించానని చెబుతోందన్నారు. యూపీఏ పక్షాలతో తప్ప తమతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదన్నారు. కానీ, నీరు, విద్యుత్తు, తదితర అంశాల కేటాయింపులపై స్పష్టత లేకుండానే విభజించేసిందని చెప్పారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలంటుండడాన్ని ఆమె తప్పు పట్టారు. ఇంకా రాష్ట్రం ఏర్పడకుండానే  ఇలాంటి  వ్యాఖ్యలు చేయడం శోచనీయమని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని తెలంగాణలో సీట్ల కోసం విభజించారని ఆమె మండిపడ్డారు. అందరికీ సమ న్యాయం తమ సిద్ధాంతమని పేర్కొన్నారు. తాము తెలంగాణను అడ్డుకోవడం లేదనీ, ఆంద్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని కోరారు. అందరికీ మంచి జరగాలనీ  కోరుకుంటున్నట్లు శ్రీమతి విజయమ్మ చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top