'విద్యుత్ చార్జీలు పెంచడం శోచనీయం'

ఒంగోలు:  విద్యుత్‌చార్జీలు పెంచాలని నిర్ణయించడం శోచనీయమని, ఈ నిర్ణయాన్ని ముఖ్యమ్రంతి చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని ఒంగోలు జిల్లా  మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ చాంబర్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచితే పేదలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట మాట్లాడటం చంద్రబాబు నైజమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వైఎస్‌ఆర్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించకుండా వ్యాట్ రూపంలో ప్రజలపై అదనపు భారం మోపుతుందని జంకె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచుతుండగా, మన రాష్ట్రంలో మాత్రం జీతాలకే ఇబ్బందిపడుతున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం అర్థరహితమన్నారు. 24 గంటలు విధి నిర్వహణలో ఉంటున్న ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు నిధుల కొరత అంటూనే మరోవైపు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డులంటూ కొత్త పథకాన్ని పెడుతున్నారని, వాటి అమలుకు నిధులెలా వస్తాయని సీఎంను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రారుణాల మాఫీని అర్హులందరికీ అమలు చేయాలని, తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని   ఆయన కోరారు.
Back to Top