విజయవాడ: చంద్రబాబు గిరిజనుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గిరిజన చట్టాలు, అమలు తీరుపై జరిగిన చర్చలో మేరుగ నాగార్జున, బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ... చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు దాటినా ఎన్నికలకు ముందు గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల జీవోను చంద్రబాబు సర్కార్ ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో చంద్రబాబుకు పుట్టగతులుండవని హెచ్చరించారు. తక్షణమే గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలని మేరుగ డిమాండ్ చేశారు.<br/>రాజ్యాంగంలో చట్టాలను అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆమహానేత విద్యార్థులకు 40శాతం స్కాలర్ షిప్ లు పెంచిన విషయాన్ని మేరగు ఈసందర్భంగా గుర్తుచేశారు. గిరిజనులు, దళితులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రుణపడి ఉన్నారని ఆయన తెలిపారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. దళితులు, గిరిజనులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.