ముఖ్యమంత్రిని అరెస్తు చేయగలరా?

నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా),

31 అక్టోబర్ 2013: తెలంగాణలో పర్యటిస్తే.. సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డిని అరెస్టు చేయగలరా?, అడ్డుకుంటారా అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పోలీసులను, తమపై ప్రజలను ‌రెచ్చగొడుతున్న నాయకులను నిలదీశారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంది అని ‌ఆమె స్సష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటిస్తున్న తనను పోలీసులే అడ్డుకోవడాన్ని శ్రీమతి విజయమ్మ రోడ్డుపైనే బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా? అన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని తాము కోరుకుంటున్నాం అని శ్రీమతి విజయమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని ‌తమ గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని ఆమె అన్నారు. కొంత మంది నాయకులు, పార్టీలు వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తున్నారన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను తాము కలుసుకోవడం తప్పా అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. మహానేత రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న మంత్రులు ఆయన సతీమణి అయిన తాను బాధితులను పరామర్శించకూడదని అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కలుసుకుని, వారికి మాట ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.

తుపాను వల్ల రైతులు ఇబ్బందులకు గురైతే మంత్రులు కాని, సీఎం, సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు పరామర్శించారా అని శ్రీమతి విజయమ్మ సూటిగా అడిగారు. తుపాను వచ్చి అన్నీ కొట్టుకుపోయిన ఎనిమిది రోజులకు ముఖ్యమంత్రి బయటికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఏరియల్‌ సర్వే చేసి, ఫొటో ప్రదర్శన చూసి కిరణ్‌ చెప్పిన మాటలు బాధితులకు ఏమాత్రం ప్రయోజనం కలిగేవిగా లేవన్నారు. ప్రశాంతంగా ప్రజల వద్దకు వెళుతుంటే అరెస్టు చేయడమంటే చేతగాని సీఎంగా ఉన్నారా? అని కిరణ్‌ను ప్రశ్నించారు.

ప్రజలను పరామర్శించేందుకు వెళుతున్న తామేమన్నా రౌడీషీటర్లమా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 144 సెక్షన్‌ ఎందుకు పెట్టారన్నారు. తెలంగాణ అంటే పాకిస్తానా, బంగ్లాదేశా అని ప్రశ్నించారు. తమను ఎందుకు పోనివ్వరని నిలదీశారు. ప్రజలను పరామర్శించడం కూడా తప్పేనా అని అన్నారు. ప్రజల స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తోంది అని అన్నారు. అల్లర్లు చేసే వారిని అరెస్టు చేయాలి కాని రైతులను పరామర్శిస్తే అరెస్టు చేస్తారా అని అన్నారు. అసలు ప్రజాస్వామ్య దేశంలోనే మనం ఉన్నామా? ఏ యుగంలో ఉన్నాం అని నిలదీశారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో త్వరలోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. 42 మంది ఎంపీలో మన రాష్ట్రం బలమైన రాష్ట్రంగా ఉండాలని, అభివృద్ధి చేసుకోవాలని జగన్‌బాబు కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు. ప్రజల వద్దకు వెళ్ళకుండా తమను ఆపలేరన్నారు. మేము మళ్లీ వస్తాం.. అని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

తుపాను తాకిడికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన శ్రీమతి వైయస్ విజయమ్మను ఖమ్మం జిల్లాలోని పైనంపల్లి వద్ద పోలీసులు గురువారం సాయంత్రం నల్గొండ జిల్లా ముంపు ప్రాంతాలకు వెళ్ళకూడదంటూ అడ్డుకున్నారు. దీనితో ఆమె రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేసి నేలకొండపల్లి పీఎస్‌కు తరలించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను అరెస్టు చేయడానికి నిరసనగా పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి, ఆందోళన చేశారు.

Back to Top