అంగన్‌వాడీలకు అండగా ఉంటాం: వైఎస్ అవినాష్‌రెడ్డి

పులివెందుల: అంగన్‌వాడీ అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని  కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీల పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పులివెందుల సీడీపీవోను వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. వైఎస్‌ఆర్‌సీపీ తరపున కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్పతో పాటు జిల్లా కార్యదర్శి రసూల్, ఆ పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటులో జీరో అవర్ లేదా క్వశ్చన్ అవర్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా గట్టిగా పోరాడుతానన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సీసీఎం జిల్లా కమిటీ నాయకుడు రామ్మోహన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐఎన్ సుబ్బమ్మ, వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగ జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఆ విభాగం జిల్లా కార్యదర్శి సర్వోత్తమరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి వీరభద్రారెడ్డి, ఆ పార్టీ మైనార్టీ సెక్రటరీ బాబావల్లి, ఏడీకే గార్మెంట్స్ మాధవరెడ్డి, ఎస్సీ నాయకులు సూరి, శంకర్, కృష్ణమూర్తి, తిరుమలయ్య పాల్గొన్నారు.
Back to Top