గాజువాక: గాజువాక హౌస్ కమిటీ పరిధిలోని భూ సమస్య, విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్వాసిత కాలనీల్లో రిజిస్ట్రేషన్ల సమస్య, నిర్వాసితుల ఆర్ కార్డుల బదిలీ, ఉపాధి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి నేతృత్వంలో నాయకులు విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిసి సమస్యలు వివరించారు.
ఈనాందారు, ప్రభుత్వం మధ్య వివాదం తేలకపోవడంతో గాజువాకలోని ఆరు వార్డుల పరిధిలో 900 ఎకరాల్లో ఇళ్లు, స్థలాలు ఉన్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గాజువాకలో భూములను ప్రభుత్వ భూములుగా 1987లో నిర్ణయించారని, 1995లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భూములపై హౌస్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత కాలంలో ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు అనేక ఆందోళనలు నిర్వహించినా ఆయన స్పందించలేదన్నారు.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాజువాక భూములను క్రమబద్ధీకరించేందుకు 2008లో జీవో 44ను అమలు చేసి 2004 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు కూడా జారీ చేశారని చెప్పారు. 2003 కటాఫ్ తేదీనాటికి ఉంటున్నవారికి 166 జీవో ప్రకారం క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారన్నారు. ఆయన మరణం తరువాత ఆ ప్రక్రియ ఆగిపోయిందని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు వైఎస్ ఇచ్చిన క్రమబద్ధీకరణ పట్టాలతో కలుపుకొని అన్ని భూములను 22ఏలో చేర్చుతూ గజిట్ పబ్లికేషన్‌ను జారీ చేశారని తెలిపారు. దీనివల్ల గాజువాకలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు బహిర్గతం చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వాసితుల ఆర్ కార్డులను వారసులకు బదిలీ చేయడానికి, ఉక్కు నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలను గ్యారంటీ చేస్తూ జీవో ఇచ్చారన్నారు. ఆయన మరణం తరువాత బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి ఆర్ కార్డుల బదిలీలను నిలిపివేశారని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారన్నారు.
ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి మూడేళ్లు దాటిపోతున్నా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. దీంతో తమ అవసరాల కోసం ఆస్తిని అమ్ముకోలేక కొందరు, రుణాలు రాని కారణంగా సొంతింటి నిర్మాణం చేపట్టలేక మరికొందరు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిని పరిష్కరించాలని గతేడాది చీఫ్ కమిషనర్ ల్యాండ్ ఎక్విజేషన్ (సీసీఎల్‌ఏ)నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ జిల్లా అధికారులు దానిపై స్పందించడం లేదన్నారు. దీనివల్ల నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు కట్టుకుందామని ప్రయత్నించినా బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముం దుకు రాకపోవడంతో స్థల యజమానులు అవస్థలు పడాల్సి వస్తోందని వివరించారు.
కాగా, వీటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. జగన్‌ను కలిసినవారిలో మార్టుపూడి పరదేశి, పల్లా పెంటారావు, మొల్లి చిన్నా, సుబ్బారావు,పల్లాచిన్నారావు తదితరులున్నారు.
అంతకుముందు మర్రిపాలెంలోని ముస్లింల వేడుకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గుడివాడ అమర్‌నాథ్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, గొల్ల బాబూరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి ,నియోజకవర్గ సమన్వకర్తలు కోలా గురువులు,తిప్పల నాగిరెడ్డి,పెట్ల ఉమాశంకర్ గణేష్, వంశీకృష్ణ, అదీప్‌రాజ్, పక్కి దివాకర్, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జిల్లా ప్రచార కమిటీ ప్రతినిధి బర్కత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.