వైఎస్సార్సీపీలోనే ఉంటా..!

 జూలూరుపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనే కొన‌సాగుతాన‌ని, పార్టీ వీడే  అవసరం తనకు లేవని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని పార్టీ జిల్లా కార్యదర్శి చండ్ర నరేంద్రకుమార్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్సార్‌సీపీ మనలేదని ప్రచారం చేసినా..ప్రజల దీవెనలతో ఖమ్మం జిల్లాలో తాను ఎంపీగా గెలిచానని, మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాసీపీ అభ్యర్థులు విజయం సాధించారని గుర్తు చేశారు. జిల్లా ప్రజల ఆదరణతో 232 గ్రామ పంచాయతీల్లో గెలిచామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ఇలా 121 మంది ఉన్నారని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటిందని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకున్నామని తెలిపారు. 27వ తేదీన ఏదో జరగబోతోందని, టీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ విలీనం అవుతుందని దుష్ర్పచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’ అని హితవు పలికారు. 
 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తలపెట్టిన ప్రాజెక్ట్‌లకు రీ డిజైన్ చేస్తూ, పేర్లు మారుస్తూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి, కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తున్నాయని... అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు రుణాలను మాఫీ చేయాలని, వచ్చే సీజన్‌కు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా కార్యదర్శి చండ్ర నరేంద్రకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎదళ్లపల్లి వీరభద్రం, మండల అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, నాయకులు మోదుగు రామకృష్ణ, కంచర్ల రాజు, ఎస్‌కె.చాంద్‌పాషా, పలువురు సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Back to Top