ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు

న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ  లోక్‌సభలో తమ పార్టీ  ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతుందని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే  మూడుసార్లు లోక్‌సభను స్తంభింపజేసిందని తెలిపారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం వైయస్సార్సీపీ గుంటూరులో ఎనిమిది రోజులపాటు దీక్ష చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుబ్బారెడ్డి విమర్శించారు.

నిర్దిష్ట వివ‌ర‌ణ‌
 సెక్షన్-94 ఏ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు మార్చి 2, 2014 నుంచి 15 ఏళ్ల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా వర్తిస్తుంది. ఒకవేళ అవసరమైన పక్షంలో 15 ఏళ్ల తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించేందుకు తగిన ఉత్తర్వుల ద్వారా చర్యలు తీసుకుంటుంది. 
సెక్షన్-94 బీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం, ప్రత్యేక కేంద్ర సాయం అందించాలి. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఈ సాయం ఉండాలి. స్పెషల్ స్టేటస్ ద్వారా పన్ను ఆదాయం, ఇతర నిధుల పంపిణీ ఇలా ఉండాలి. 1) మార్చి 2, 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే పరిశ్రమలకు ఆర్థిక శాఖ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలి. 2) ఇన్‌కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లలో రాయితీలు ఇవ్వా లి. 3) మార్చి 2, 2014 తరువాత పరిశ్రమలు తమ కార్యకలాపాలను, యూనిట్లను విస్తరించాలనుకుంటే వర్కింగ్ కేపిటల్‌లో 40 శాతం సబ్సిడీ ఇవ్వాలి..’ అని పొందుపరిచారు. 
 సెక్షన్-94 సీ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని జీడీపీలో ఐదు శాతానికి నిర్ధారించాలి.


 ‘ప్రకాశం’ను వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలి
 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ చట్టానికి సవరణను ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లును శుక్రవారం నాటి లోక్‌సభ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే సభ మధ్యాహ్నమే వాయిదాపడడంతో ఈ బిల్లు రాలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా ఇందులో చేర్చాలని వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లులో ప్రతిపాదించారు.

Back to Top