ఆ పిటిషన్లు ఎందుకు పెండింగ్

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో సాంకేతిక లోపాలున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అన్నీ సరిగ్గా ఉన్న పిటిషన్లను అప్పుడే స్పీకర్‌కు అందజేశామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టారంటూ ప్రశ్నించారు. తాము ఏప్రిల్‌లోనే సరైన పిటిషన్లు ఇచ్చిన‌ప్ప‌టికీ,  ఇప్పటివరకు పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు. వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, టీడీపీలోకి మారింది వాస్తవం కాదా? అని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చట్టం ఏం చెప్తుందో తెలియదా? అని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని అందుకే తాము పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించామ‌న్నారు. ఈ నెల 8న దీనిపై సుప్రీంలో విచారణకు రానున్న నేపథ్యంలోనే ఏదో ఒక సమాధానం చెప్పాలన్న కారణంతో స్పీకర్‌ తిరస్కరించారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చిందనీ, అవసరమైతే అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పినట్టు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Back to Top