సమైక్య తీర్మానం కోసం వారు పట్టుపట్టరేం?

హైదరాబాద్:

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభాపతి హోదాలో, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ మనోహర్‌ సీమాంధ్రకు చెందినవారే అయినప్పటికీ సమైక్య తీర్మానం గురించి ఎందుకు పట్టుపట్టడం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం ప్రశ్నించింది. ఈ ముగ్గురూ కావాలని పట్టుబడితే సభలో సమైక్య తీర్మానం చర్చకు రాదా? అని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, మేకతోటి సుచరిత, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో కలిసి ఆమె మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశానికి హాజరై ఎందుకు సమైక్య తీర్మానానికి పట్టుబట్టలేదని వారు ప్రశ్నించారు. వారిద్దరూ తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి బిల్లుపై చర్చ జరిగేలా చూస్తున్నారని విమర్శించారు. స్పీకర్, ముఖ్యమంత్రి పూర్తిగా కాంగ్రెస్ అ‌ధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారని, సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రధానప్రతిపక్ష నేత వీలైనంత త్వరగా విభజన బిల్లును ఢిల్లీకి పంపేందుకు ఆతృత పడుతున్నారని విమర్శించారు.

ఈ ముగ్గురు సీమాంధ్ర నేతలు కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ, సీమాంధ్ర సభ్యులు మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ సమైక్య తీర్మానం చర్చకు రాలేదంటే వారి చేతకానితనమో, లేదా వీరు సోనియాగాంధీ దర్శకత్వంలో పనిచేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. సీమాంధ్ర సభ్యులు ఐకమత్యంగా లేకపోవడంవల్లే సమైక్య తీర్మానం పెట్టించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తీర్మానం కోసం పోరాడుతుందన్నారు.

శైలజానా‌థ్ కూడా‌ సమైక్య తీర్మానం కోసం సంతకం చేశారు :
శాసనసభ రూల్ 77, 78 కింద అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ తమ పార్టీ సభ్యులు నోటీసు ఇచ్చినప్పటికీ, స్పీకర్ ఇప్పటివరకు దానిని అడ్మి‌ట్ చేసుకున్నట్టు ప్రకటించలేదని చెప్పారు. కాంగ్రె‌స్ పార్టీలోని సీమాంధ్ర‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవే నిబంధనలతో సభలో సమైక్య తీర్మానం చేయాలంటూ నోటీసులిచ్చారని తెలిపారు. ఇప్పుడు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్న శైలజానాథ్ కూడా సమైక్య తీర్మానం కోసం సంతకాలు చేసిన వారిలో ఉన్నారని గుర్తుచేశారు. అదే వ్యక్తి తన హోదాలో మార్పు రాగానే బిల్లుపై చర్చకు సహకరించమని కోరుతున్నారని విమర్శించారు. ‌కాంగ్రెస్‌లోని వ్యక్తులు హోదా వస్తే ఒక రకంగా.. రాకపోతే మరొకరకంగా మాట్లాడే పరిస్థితి ఉందన్నారు.

సీఎం కిరణ్, చంద్రబాబు బీఏసీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వం, పార్టీలోని రెండు ప్రాంతాల నాయకులను సమావేశాలకు పంపి డ్రామాలు ఆడుతున్నారని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. బీఏసీకి పార్టీ శాసనసభాపక్ష నాయకులే రావాలని, లేదంటే వచ్చిన వారైనా పార్టీ వైఖరిని మాత్రమే తెలియజేయాలని స్పీకర్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విభజనకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందో అసెంబ్లీకి పంపిన బిల్లులోనైనా చెప్పాలి కదా అని ఒక విలేకరి ప్రశ్నకు‌ ఆమె సమాధానం ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top