ఎప్పుడో ఇచ్చిన లేఖను రాజకీయం చేస్తారా!

హైదరాబాద్ 08 ఆగస్టు 2013:

తెలంగాణ అంశంపై గతంలో కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీకి ఇచ్చిన లేఖను ఇప్పుడు రాజకీయం చేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి తప్పుపట్టారు. అప్పట్లో ఆ లేఖను సీడబ్ల్యూసీలో చర్చించి ఎస్సార్సీ వేయమని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి లేఖ రాశారనీ, ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు ప్రధాన కారకులని ఇతర పార్టీల మీద బురదజల్లడం సరికాదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆరే ప్రధాన కారకుడంటూ గురువారం సాయంత్రం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ అప్పట్లో బయటకొచ్చి ఉద్యమాన్ని మొదలు పెట్టిన విషయాన్ని మైసూరా రెడ్డి గుర్తుచేశారు. అది ఆ పార్టీకీ, ఆయనకు సంబంధించిన వ్యవహారమన్నారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డిగారికి సంబంధించి సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలు కాబట్టి శాసనసభ్యులువెళ్ళి లేఖ ఇచ్చారన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. సీడబ్ల్యూసీలో చర్చించి.. ఎస్ఆర్‌సీ వేయమని ఎన్డీఏ ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. ఆ లేఖను పట్టించుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఎన్నికలకోసం రాజకీయ లబ్ధికోసం సీడబ్ల్యూసీలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానం చేసి, ఉద్యమాలు మొదలయ్యేటప్పటికి సమస్యలు తెలుసుకోవడానికంటూ ఓ కమిటీని వేశారని చెప్పారు. పార్టీ అత్యున్నత విభాగమైన సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ కమిటీ ఏమీ చేయలేదని మైసూరా రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కమిటీ రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.

రాష్ట్ర విభజనకు ముందు సాగునీటి అంశాన్ని పరిష్కరించాలని మేము ఎప్పటినుంచో చెబుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలలో నెలకొన్న అలాంటి భయాందోళనలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టంచేశారు. ఇతర పార్టీలను దొంగ నాటకాలంటున్న మీ పార్టీవి ఏ నాటకాలని సీఎంను ప్రశ్నించారు. భౌగోళిక,  జల అంశాలు ఉన్నాయని అంగీకరించిన సీయం వీటిని  కోర్ కమిటీలో వీటిని ఎందుకు చర్చించలేదని నిలదీశారు.  కాంగ్రెస్ పార్టీకి పదితలలున్నాయనీ ఒక్కో పార్టీ ఒక్కోలా మాట్లాడతాయనీ చెప్పారు. విభజన అంశంపఐ ఎప్పటినుంచో అందరితో మాట్లాడాలని మేం ఎప్పటినుంచో చెబుతున్నామని మైసూరా రెడ్డి జ్ఞాపకం చేశారు. ఇలాంటి వ్యక్తి  బాధ్యతాయుత  పదవిలో ఉండడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top