బాబూ.. సీబీఐ అంటే ఎందుకు భయం

విజయవాడ: పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజీపై సీబీఐ ఎంక్వైరీ వేసి దోషులను శిక్షిద్దామని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం పేపర్‌ లీక్‌లతోనే ర్యాంక్‌లు, అవార్డులు సంపాదిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించి ప్రతిపక్షనేత మాట్లాడుతుంటే చంద్రబాబు నువ్వు ఏం చదివావు, ఎక్కడ చదివావు అంటూ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రతిపక్ష నేత ధీటుగా సమాధానం చెప్పారన్నారు. నీలా వచ్చిరాని ఇంగ్లీష్‌ చదవలేదు.. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలో చదివాను అని వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. అంశంపై మాట్లాడకుండా దిగజారిపోయి చాలెంజ్‌లు చేయాల్సిన అవసరం ఏంటని బాబును నిలదీశారు. లీకేజీల్లో మీ ప్రమేయం లేకపోతే ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అంటే భయపడుతున్నారని ప్రశ్నించారు. నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే వార్డెన్‌ను వాటర్‌ బాయ్‌గా పరీక్షలకు పంపించాల్సిన అవసరం ఏంటి.. ఎందుకు పంపించారని ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా సీబీఐ విచారణకు ఒప్పుకోండి అంటూ ఎద్దేవా చేశారు. మీ పరిపాలనపై నమ్మకం ఉంటే, చంద్రబాబు తుప్పు కాదు నిప్పు అయితే సమగ్ర విచారణ జరిపించి మంత్రులను తొలగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు.

Back to Top