చంద్రబాబూ! ఎందుకంత గింజుకుంటున్నారు!!

హైదరాబాద్ 21 ఆగస్టు 2013:

తమ మీద వారు, వీరు కుట్ర చేశారని చంద్రబాబునాయుడు ఎందుకు అంతగా గింజుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ఈమేరకు వారు టీడీపీ అధ్యక్షునికి ఓ బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...
ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత దుస్థితిలో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే. ఆయనకు విశ్వసనీయత లేకపోవడం, ప్రజలంతా రాజకీయాల్లో ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భయం లేకుండా నిస్సిగ్గుగా ఎఫ్.డి.ఐ. బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంలో తన సభ్యులను గైర్హాజరు చేయించటం నిజం కాదా. రాష్ట్రంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విసుగెత్తి, అన్ని ప్రతిపక్ష పార్టీలూ అవిశ్వాసం ప్రవేశపెడితే మీరు మాత్రం ఏకంగా విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు గారూ! ఓట్లు, సీట్లు, క్రెడిట్ కోసమని కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీలుస్తుంటే, అన్యాయం జరుగుతోందని తెలిసీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. ఏపీ ఎన్జీవోలు వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోనని నిర్దయగా తెగేసి చెప్పారు. రాజీనామా చేయాలన్న డిమాండునూ తిరస్కరించారు. ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించబోనని చెప్పారు.

రాష్ట్రంలో కోట్లాదిమందికి అన్యాయం జరుగుతున్నప్పటికీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇప్పటికైనా చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించండి. ప్రెస్ మీట్లు పెట్టి ఇలా గింజుకునే బదులు మీరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. విభజన మీద మీరిచ్చిన లేఖను వెనక్కి తీసుకోండి. అలా చేస్తే మీకు అంతో ఇంతో గౌరవం మిగులుతుంది. మీరు చేయాల్సినవి చేయకుండా ఇలా అందరినీ దూషించడం వల్ల మీరే ప్రజలలో పలచనవుతారు. జరుగుతున్న ఈ అన్యాయానికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా?

విభజన జరిగితే కృష్ణా ఆయకట్టులో రోజూ గొడవలు జరుగుతాయి. ఇప్పటికే పైన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితే తప్ప కిందకు నీరు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో మరోక రాష్ట్రం అవసరమా. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడినుంచి వస్తాయి. నాగార్జునసాగర్‌కు నీళ్ళు ఎలా వస్తాయి. కింద ఉన్న రాష్ట్రానికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఎక్కడున్నాయి. పోలవరానికి జాతీయహోదా ఇచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే కింది రాష్ట్రానికి నీళ్ళెక్కడినుంచి వస్తాయి. రాష్ట్ర రాజధానిగా ఆరు దశాబ్దాల నుంచి ఉన్న హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు ఇచ్చేస్తే.. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు యాబై శాతం ఆదాయం కోల్పోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ప్రశ్నార్థకమవుతాయి. చదువుకున్న ప్రతి యువకుడూ ఉద్యోగం కోసం ఎక్కడి కెళ్ళాలి? మేం అడుగుతున్న ఈ ప్రశ్నలు చాలా చిన్న అంశాలు. వీటికే పరిష్కారం లేనప్పడు రాష్ట్రాన్ని అల్లకల్లోలమయ్యేలా విభజించడం తప్పు కాదా అని పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, మేకతోటి సుచరిత సంయుక్తంగా ఆ లేఖలో చంద్రబాబు నాయుడును నిలదీశారు.

Back to Top