మొండిచెయ్యి చూపేందుకే ఢిల్లీకి అఖిలపక్షమా?

హైదరాబాద్, 21 డిసెంబర్ 2013:

విభజన బిల్లు అసెంబ్లీలో రాకుండా అడ్డుకుంటానని గొప్పగా చెప్పిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ బిల్లు రాష్ట్రానికి వచ్చిన 10 గంటల్లోపలే ఆగమేఘాల మీద సభలో ప్రవేశపెట్టారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సీజీసీ సభ్యుడు మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణానది నీటి పంపకాల విషయంలో బ్రిజేశ్‌కుమార్‌ కమిటీ తీర్పు వచ్చిన తరువాత సీఎం కిరణ్ అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్ళడంపై ఆయన స్పందించారు. అఖిలపక్షంతో ఏమి సాధించారన్నది అయోమయం అన్నారు.‌ అఖిలపక్షంతో ప్రధాని మన్మోహ‌న్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఉచిత సలహా కోసం అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు కిరణ్‌ తీసుకువెళ్ళడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ప్రధాని ముందుకు రాకపోవటం శోచనీయమని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానికి ఉన్న అధికారాలేమిటో, దేనిపై మాట్లాడవచ్చో, దేనిపై కూడదో ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరం అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటే సుప్రీం అనే విషయం ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు దానిని సరిదిద్దడానికి ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలన్నది పార్లమెంటు నాయకుడిగా ప్రధానికి తెలియకపోవడం మన రాష్ట్రానికి శాపం అన్నారు. అధికారం ఇచ్చిన మన రాష్ట్రానికి మొండిచెయ్యి, రిక్తహస్తం చూపిస్తున్నదనడానికి ఇదే నిదర్శనం అని ఆవేదన వ్యక్తంచేశారు. అందులో భాగంగానే సీఎం కిరణ్ కుమా‌ర్‌రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అందు కోసమే అఖిలపక్షం అనే డ్రామా నడిపించారని తన అభిప్రాయం అన్నారు.

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు సమైక్యమన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే బాగుండేదని మైసూరారెడ్డి అన్నారు. తాను చెప్పిందే విధానం అనే ధోరణిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నారని, ఇంత వరకూ సమైక్యం అనే మాట మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనీ చెప్పలేదన్నారు. లేదా తాను ఇచ్చిన విభజన లేఖను వెనక్కి తీసుకోలేదన్నారు. ఆ లేఖను మార్పులు, చేర్పులు చేసి ఇవ్వలేదన్నారు. సమైక్య ఉద్యమంలో టీడీపీ నుంచి కొందరు పాల్గొన్నప్పటికీ అది ఆ పార్టీ అభిప్రాయం కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ విభజనకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన కోరుకునే పార్టీలతో తాము వేదిక పంచుకోవటం అర్థం లేదని ఆయన అన్నారు.
సమైక్యవాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అశోశ్‌బాబును మైసూరారెడ్డి ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కట్టుబడి పోరాటం చేస్తుందని, సమైక్యం కోసం పనిచేసేవారితో పార్టీ కలిసి కృషి చేస్తుందన్నారు.

Back to Top