సీబీఐ విచారణ అంటే భయమెందుకు బాబు

 • పార్టీ ఫిరాయింపు చ‌ట్టంలో స‌వ‌ర‌ణ అవ‌స‌రం
 • బాబు అవినీతిపై బీజేపీ ఎందుకు నిలదీయడం లేదు
 • నేను నిప్పు అని మాట్లాడే బాబు విచారణకు ఎందుకు జంకుతున్నారు
 • హోంమంత్రి హోంగార్డుకు ఎక్కువ..కానిస్టేబుల్ కు తక్కువ
 • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి

 • హైదరాబాద్ః పార్టీ మారే ఎమ్మెల్యేల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా ఫిరాయింపుల‌పై కొత్త చ‌ట్టాలు రావాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. స్పీక‌ర్ ప‌రిధిలో చ‌ట్టాలు ఉండ‌డంతో  ఫిరాయింపుల చ‌ట్టం దుర్వినియోగం అవుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. చంద్ర‌బాబు ఇలాఖాలో చేస్తున్న అవినీతిపై బీజేపీ బాబును ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని భూమన ప్ర‌శ్నించారు. ఇత‌ర పార్టీల శాస‌న‌స‌భ్యుల‌ను విచ్చ‌లవిడిగా అనైతికంగా బాబు కొనుగోలు చేస్తున్నా, దారుణ‌మైన మోసాల‌కు పాల్ప‌డుతున్నా వెంక‌య్య‌నాయుడు ఎందుకు నిల‌దీయ‌డం లేదో చెప్పాలన్నారు. 

  స్పీక‌ర్ ప‌రిధిలో ఉన్న చ‌ట్టాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోకి తీసుకోచ్చే విధంగా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని స్వ‌యంగా హోంమంత్రిని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కోరార‌ని భూమన తెలిపారు. పార్టీ మారిన వారిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఇప్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌ దేశంలోని అనేకమంది జాతీయ రాజ‌కీయ నాయ‌కులను క‌లిసి బాబు ప్రోత్స‌హిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై, అవినీతిపై వివ‌రించార‌ని ఆయ‌న తెలిపారు. ఫిరాయింపు చ‌ట్టంలో క‌ఠిన‌మైన సవరణలు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీ గుర్తుల‌పై గెలిచిన ఎంపీటీసీల నుంచి ఎంపీల వ‌ర‌కు అందరికీ చట్టం వర్తించేలా ఆ అధికారం ఈసీ పరిధిలోకి తీసుకొచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చి చట్ట సవరణ చేయాలని వైయస్ జగన్ హోంమంత్రిని కోరడం జరిగిందన్నారు. 

  చంద్రబాబు వ్యాఖ్య‌లు సిగ్గుచేటు...
  అంద‌రి కుటుంబాలు చిన్న‌విగా ఉన్నాయి... పిల్ల‌ల‌ను క‌న‌డం లేదు... జ‌నాభాను పెంచాల్సిన అవ‌శ్య‌క‌త ప్ర‌తిఒక్క‌రిపై ఉంద‌ని.. అంద‌రూ పిల్ల‌ల‌ను క‌నండి అని స్వ‌యంగా చంద్రబాబే చెప్ప‌డం హాస్య‌ాస్ప‌ద‌మ‌న్నారు. క‌న్యాశుల్కం గిరీశం లాంటి వారు బాబు అని ఎద్దేవా చేశారు. గ‌తంలో పిల్ల‌ల‌ను క‌న‌డంలో అంద‌రూ నియంత్ర‌ణ పాటించాల‌ని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చి పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా క‌నాల‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌న్నారు. ఒక ప‌ద్ధ‌తి లేకుండా త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హరిస్తున్న వ్య‌క్తి ఒక్క చంద్ర‌బాబ‌ేనన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లి... సాంఘిక భ‌ద్ర‌త క‌ల్పించి, సామాజిక స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర్చి, కుటుంబాల ఆర్థిక స్థితిని పెంచడం ద్వారా పౌష్టికత్వాన్ని మ‌రింతగా వృద్ధి చేయాల్సిన అభివృద్ధిని చూడ‌కుండా.... అంద‌రూ పిల్ల‌ల‌ను క‌నండ‌ని బాబు చెప్ప‌డం సిగ్గు చేట‌న్నారు. 

  రెండేళ్ల‌లో పాతాళానికి...
  బాబు రెండేళ్ల ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితిగ‌తులు పాతాళానికి వెళ్లిపోయాయ‌ని భూమన ఆరోపించారు. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మండుతుంటే వాటిని నియంత్రించాల్సింది పోయి, వాటిని మ‌రింత బుల్లెట్ వేగంతో ఆకాశానికి తీసుకెళ్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రికీ స‌రైన భ‌ద్ర‌త, ఆర్థిక స్థితి లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  కొత్త ఓట‌ర్ల‌ను మోసం చేసేందుకే బాబు జనాభా వ్యాఖ్యలని  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అత్యంత ద‌య‌నీయమైన స్థితికి చేరుకున్నాయ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో దేశంలోనే ఐద‌వ స్థానంలో ఉండ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం రెట్టింపు కేసులు న‌మోద‌వుతున్నాయ‌న్నారు. అందులో ఎస్టీ, ఎస్సీల‌పైనే ఎక్కువ కేసులున్నాయ‌న్నారు. టీడీపీకి ఎదురు మాట్లాడిన వారిపై దాడి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. 

  ఎమ్మెల్యే, కొడుకులపై చర్యలేవి..!
  రాజ‌కీయాల్లోకి మేము ఓట్ల‌ద్వారా వ‌చ్చిన వాళ్లం. కాబ‌ట్టి మా కార్య‌క‌ర్త‌లే మాకు ముఖ్యం.  వారి ప‌ట్ల మీరు ముక్కుసూటిగా వెళ్దామంటే కుద‌ర‌ద‌ని, అలా వెళ్లితే మీకు నష్టం, మాకు న‌ష్ట‌మ‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు 8-8-2014న క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌మావేశంలో చెప్పార‌న్నారు. ఓ ఎమ్మెల్యే కొడుకు కారు ద్వారా ఓ వ్యక్తిని బలితీసుకున్నా, మరో ఎమ్మెల్యే కొడుకు మ‌హిళ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా... మ‌రో ఎమ్మెల్యే ఎంఆర్ఓను దారుణంగా కొట్టించినా స్పందించ‌ని ప్ర‌భుత్వం టీడీపీ అన్నారు. తిరుప‌తిలో 14 నెల‌లుగా 30 యాక్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు తీయ‌కుండా అమలులో ఉంద‌న్నారు.  ఉభ‌య గోదావ‌రి జిల్లాలో యుద్ధ‌వాతావ‌ర‌ణం కొన‌సాగుతుందని క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రూ తిర‌గ‌బ‌డినా ర‌క్తం వ‌చ్చేలా కొడుతూ, దొంగ కేసులు పెడుతూ బెదిరిస్తున్నారన్నారు. శాంత్రిభ‌ద్ర‌త‌లు ఏపీలో స‌ర్వ‌న‌శ‌న‌మైయ్యాయ‌ని నిప్పులు చెరిగారు. దీనికి ముఖ్య‌కార‌ణం సీఎం కావ‌డం సిగ్గు చేట‌న్నారు. 

  హోంమంత్రి హోంగార్జుకు ఎక్కు..కానిస్టేబుల్ కు తక్కువ
  ఒక హోంగార్డును కూడా బ‌దిలీ చేసే ప‌రిస్థితిలో నేను లేన‌ని హోంమంత్రి చిన్న‌రాజ‌ప్ప చెప్పడం సిగ్గు చేట‌న్నారు. హోంమంత్రి హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్‌కు త‌క్కువ‌ని ఎద్దేవా చేశారు. అవినీతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని వైయ‌స్సార్‌సీపీ కోరితే అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని అన‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. ప‌రిటాల ర‌వి హ‌త్య విష‌యంలో సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరిన అప్ప‌టి చంద్ర‌బాబు మ‌రి ఇప్పుడు జ‌రుగుతున్న అవినీతిపై ఎందుకు సీబీఐ విచార‌ణ జ‌రిపించ‌డం లేద‌న్నారు. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ‌లో కొన‌సాగుతున్న  అవినీతిపై ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని స‌వాల్ విసిరారు. మాట్లాడితే నేను నిప్పు అని చెప్పుకునే బాబు సీబీఐ విచార‌ణ అంటే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల‌ని మాట్లాడ‌డం కాద‌ని, అందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్టాల‌ను తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. 
Back to Top