బాబుకు ఎందుకంత ఉలికిపాటు

– అమరావతి రైతుల ఆవేదన తీర్చడానికే వైయస్‌ జగన్‌ పర్యటన 
– ల్యాండ్‌ పూలింగ్‌ హామీలు నెర్చవేర్చాలని డిమాండ్‌
– సీసీ కెమెరాలతో రైతులను భయపెట్టడం దారుణం
– గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల బేఖాతర్‌ సిగ్గుచేటు
– విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారథి

హైదరాబాద్ః ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంత రైతుల నుంచి లాక్కున్న భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి తీరాల్సిందేనని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్ధసారథి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూములు కోల్పోయిన రైతుల పక్షాన పోరాడటానికి వస్తున్న వైయస్‌ జగన్‌ను చూస్తే టీడీపీకి ఎందుకంత ఉలికిపాటు అని ఆయన ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కునేటప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోపాటు మళ్లీ మరో 8వేల ఎకరాలు లాక్కునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం దారుణమన్నారు. బాధిత రైతుల పక్షాన పోరాడేందుకే మా నాయకుడు వైయస్‌ జగన్‌ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని పార్ధసారథి స్పష్టం చేశారు. 

ముందు హామీలు నెరవేర్చండి
రైతుల నుంచి భూములు సేకరించే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే మిగిలిన పనులు మొదలు పెట్టాలని పార్థసారథి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2500 పెన్షన్, ఉచిత విద్య, వైద్యం.. యువకుల గ్రూపులకు 25 లక్షల వరకు రుణాలు లాంటి హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఆనాడు చెప్పిన తియ్యతియ్యని మాటలు ఇప్పుడు గుర్తులేవా అని నిలదీశారు. జగన్‌ ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతులను బెదిరించేందుకు హడావుడిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భయాందోళనలు రేకెత్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు టీడీపీ నాయకుల వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. మూడు పంటలు పండే 33 వేల ఎకరాల భూమిని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేసి లాక్కోవడం దారుణమన్నారు. 

టీడీపీ ప్రభుత్వానికి చట్టాలపై గౌరవం లేదు.. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు.. ప్రజల మీద ప్రేమ లేదు.. కేంద్ర ఆదేశాలు అంటే భయం లేదని మండిపడ్డారు.  వారు చేస్తున్న అరాచకాలను, అవినీతి కప్పి పుచ్చుకునేందుకే ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీపై తప్పుడు ప్రచారం చేసి రోజులు దొర్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. పర్యావరణ వేత్తలు, కోర్టులు, చట్టాలు వ్యతిరేకించినా ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో మూడు నాలుగు పంటలు పండే 33వేల ఎకరాలు, డీఫారిసై్టజేషన్‌ పేరుతో 50 వేల ఎకరాలు, 17 నుంచి 20 వేల ఎకకాల ప్రభుత్వ భూమిని మొత్తం లక్షా 6వేల ఎకరాలు డీనోటిఫై చేశారని పేర్కొన్నారు. భూములు ఇవ్వడం ఇష్టం లేక కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్న రైతులను, ప్రజల పక్షాల నిలుస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్ట్‌ భూములున్న వారికి పరిహారంపై ఇంతవరకు స్పందన లేకపోవడం సిగ్గు చేటన్నారు. భూములను అభివృద్ధి చేసి కార్పొరేట్లకు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా ప్లాట్ల అలాట్‌మెంట్‌ చేయాలని అధికారులకు సూచించారు. రైతులను దోచుకోవడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా ఉందని పార్ధసారథి దుయ్యబట్టారు. 

ప్రజా రాజధానికి అండగా ఉంటాం..
ప్రజా రాజధాని నిర్మాణానికి వైయస్‌ఆర్‌సీపీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని పార్ధసారథి అన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ధి పేరు చెప్పి రైతుల భూములు లాక్కుని కార్పొరేట్లకు అప్పనంగా ఇస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల జోలికి వెళ్లేది లేదని.. గ్రామ కంఠాలను పాడు చేయమని ప్రకటించిన అధికారులు ఇప్పుడెందుకు కూల్చివేతలకు సిద్ధమయ్యారో స్పష్టం చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రైతులు రాకుండా అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్‌ జగన్‌ వస్తుంటే వారికెందుకు అంత దడ.. భయమో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పేదలను కించపరిచే వాతావరణం నడుస్తుందని చాగంటి కోటేశ్వరరావు మాటలను ఉద్దేశించి అన్నారు. యాదవ కులస్థులను కించపరిచే విధంగా శ్రీకృష్ణుడి పుట్టుకపై ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దేవుళ్లు, మహాపరుషుల గురించి మాట్లాడే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించాలని చాగంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాగే వదిలేస్తే రేపొద్దున దళిత కులంలో పుట్టాడని అంబేడ్కర్‌ను.. పూరిపాకలో పుట్టాడని ఏసు క్రీస్తును కూడా తూలనాడుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
Back to Top